సినిమా టికెట్ రేట్ల రచ్చ.. నిర్మాతకు మిగిలేది ఇంతేనా? ఎస్‌కేఎన్ షాకింగ్ లెక్కలు!

ఒక ఫ్యామిలీ మల్టీప్లెక్స్ కు వెళ్తే అయ్యే ఖర్చు, అందులో ఎవరికి ఎంత వాటా వెళ్తుంది అనే దానిపై డీటైల్డ్ ఎనాలిసిస్ ఇచ్చారు.;

Update: 2025-11-25 10:34 GMT

మనం సినిమాకు వెళ్తాం.. టికెట్లు, పాప్‌కార్న్ అంటూ వేలకు వేలు ఖర్చు చేస్తాం. ఇంత ఖర్చు చేస్తున్నాం కదా, నిర్మాతలకు లాభాలు కురుస్తున్నాయని, అందుకే హీరోలకు కోట్లు ఇస్తున్నారని అనుకుంటాం. కానీ తెర వెనుక అసలు కథ వేరే ఉంది. మనం ఖర్చు చేసే డబ్బులో అసలు సినిమా తీసిన వారికి ఎంత వెళ్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. బేబీ, టాక్సీవాలా వంటి హిట్ చిత్రాల నిర్మాత ఎస్‌కేఎన్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.

ఒక ఫ్యామిలీ మల్టీప్లెక్స్ కు వెళ్తే అయ్యే ఖర్చు, అందులో ఎవరికి ఎంత వాటా వెళ్తుంది అనే దానిపై డీటైల్డ్ ఎనాలిసిస్ ఇచ్చారు. ఇది చూసిన తర్వాత నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మనం సినిమా కోసం పెట్టే ఖర్చులో మేజర్ షేర్ ఎంజాయ్ చేస్తుంది వేరే వాళ్ళని ఈ లెక్కలు చెబుతున్నాయి.

ఎస్‌కేఎన్ షేర్ చేసిన లెక్కల ప్రకారం, ఒక నలుగురు సభ్యులున్న ఫ్యామిలీ మల్టీప్లెక్స్ లో సినిమాకు వెళ్తే సుమారు రూ. 2,178 ఖర్చు అవుతుంది. ఇందులో నిర్మాత జేబులోకి వచ్చేది కేవలం రూ. 372 మాత్రమే, అంటే మొత్తం ఖర్చులో ఇది జస్ట్ 17% మాత్రమే అని ఎస్‌కేఎన్ ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా డబ్బులో ఎక్కువ భాగం అంటే దాదాపు 71% (రూ. 1,545) మల్టీప్లెక్స్ యాజమాన్యానికే వెళ్తుంది.

కష్టపడి కథ వెతికి, హీరోని ఒప్పించి, అప్పులు చేసి సినిమా తీసి రిస్క్ చేసేది నిర్మాత అయితే.. ఏ రిస్క్ లేకుండా కేవలం సమోసాలు, కూల్ డ్రింక్స్, పాప్‌కార్న్ అమ్ముకుని లాభపడేది థియేటర్ ఓనర్లు అని ఆయన ఘాటుగా స్పందించారు. మల్టీప్లెక్స్ లో మనం కొనే ఫుడ్ స్నాక్స్ సుమారు రూ. 1200 మీద, అలాగే థియేటర్ యాడ్స్ మీద నిర్మాతకు ఒక్క రూపాయి కూడా రాదని క్లారిటీ ఇచ్చారు.

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. టికెట్ రేట్లు తగ్గించొచ్చు కదా అని అడగగా, అది కేవలం నిర్మాత చేతుల్లో లేదని ఎస్‌కేఎన్ బదులిచ్చారు. హీరోలకు బ్లాక్ మనీలో పేమెంట్స్ ఇస్తారు కదా అని మరొకరు ప్రశ్నించగా.. ఆ తరహా "సితార" నాలెడ్జ్ ఇప్పుడు పనికిరాదని కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఓటీటీ, శాటిలైట్, జీఎస్టీ వచ్చాక అంతా వైట్ మనీనే నడుస్తుందని స్పష్టం చేశారు.

బుక్ మై షో వాళ్ళు తీసుకునే కన్వీనియన్స్ ఫీజు 3.6% కూడా నిర్మాతకు రాదు. వ్యవస్థ మొత్తం మధ్యవర్తులకే (మల్టీప్లెక్స్, ఆన్లైన్ ప్లాట్ ఫామ్స్) అనుకూలంగా ఉందని, సామాన్యుడికి సినిమా భారం కావడానికి ఇదే కారణమని ఈ లెక్కలు చూపిస్తున్నాయి. నిర్మాతకు దక్కేది కేవలం 17 శాతం మాత్రమే అని ఎస్‌కేఎన్ చెప్పిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

నలుగురు సభ్యులున్న ఫ్యామిలీ ఖర్చు (రూ. 2,178) లెక్కలు ఇలా ఉన్నాయి:

మల్టీప్లెక్స్ సంపాదన (గ్రాస్): రూ. 1,545.33 (70.95%) - (టికెట్ షేర్ + ఫుడ్ & స్నాక్స్).

ప్రభుత్వానికి పన్ను (GST): రూ. 182.00 (8.36%).

ఆన్లైన్ బుకింగ్ (BMS) ఆదాయం: రూ. 78.67 (3.61%).

చివరికి నిర్మాతకు మిగిలేది: రూ. 372.00 (17.08%).

Tags:    

Similar News