‘హరి హర వీరమల్లు ఈవెంట్’ - గెస్టులు ఏమన్నారంటే?

హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది.;

Update: 2025-07-22 07:00 GMT

హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ భారీ వేడుకకు అభిమానులతో పాటు ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ ప్రధాన ఆకర్షణగా నిలిచినా, ఈ వేడుకలో పలువురు అతిథులు కూడా సినిమాపై తమ ప్రత్యేక అభిప్రాయాలను పంచుకున్నారు.

ముందుగా కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారికి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మాకు కూడా కర్ణాటకలో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ జనరేషన్‌లో గొప్ప నటుడే కాదు, గొప్ప వ్యక్తి కూడా. సమాజానికి సేవ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. సినిమా, రాజకీయ రంగాల్లో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా బడా హీరో, బడా నిర్మాత కలిసినప్పుడు తప్పకుండా విజయం రావాల్సిందే” అంటూ అభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్ట్‌కి భారీ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా పేదవాడి కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆయన చెప్పే మాటలన్నీ ఆచరణలో పెట్టే వ్యక్తి. దేశభక్తి, జాతీయవాదంపై ఆయన చెప్పే మాటలు, సినిమాలైన ‘హరి హర వీరమల్లు’ కథాంశంతో యూత్‌కి దేశప్రేమను చాటిచెబుతుందని చెప్పవచ్చు. ఇలాంటి గొప్ప ప్రయత్నానికి శుభాకాంక్షలు” అని కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ అంటేనే, ఉద్వేగం. శివాజీ కలలు కన్న సామ్రాజ్య స్థాపన కోసం పవన్ హరిహర వీరమల్లుగా ఎలాంటి పోరాటం చేశారో సినిమాలో చూడబోతున్నాం. నిర్మాత ఎ.ఎం.రత్నం ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఈ సినిమా ఒక పెద్ద సంచలనాన్ని సృష్టిస్తుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.

ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన మానవత్వం పరిమళించిన మంచి మనిషి. తనంతట తానే వేసుకున్న బాటలో పోరాడి ముందుకు వచ్చారు. ఇంత మంది అభిమానులను తనతో కలిపి నడిపించడమంటే చిన్న విషయం కాదు. పుట్టుక నీది, చావు నీది… బ్రతుకంతా దేశానిది అనే మాట పవన్‌కు పూర్తిగా సరిపోతుంది. ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని హృదయపూర్వకంగా చెప్పారు.

నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ, “నా కెరీర్‌లో చాలా సినిమాలు చేశాను. కానీ పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ కాబట్టి ఇది నాకు ప్రత్యేకం. పవన్ గారి తొలి హిస్టారికల్ మూవీ, పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ని నిర్మించినందుకు గర్వంగా ఉంది. సినిమాతోపాటు కొంత సందేశాన్ని కూడా ఇవ్వాలనుకున్నాను. ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఉత్సాహపరిచడమే కాదు, ఆలోచింపజేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఇందులో చూడొచ్చు. బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం ఉంది” అన్నారు.

దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, “ఈ చిత్రానికి టైటిల్ పెట్టిన క్రిష్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాలో బాబీ డియోల్ పవర్‌ఫుల్ మొఘల్ కింగ్ ఔరంగజేబుగా కనిపిస్తారు. ఛత్రపతి శివాజీ తర్వాత ప్రజలకు ధైర్యం ఇచ్చిన పాత్ర వీరమల్లు. ఈ కథను ధర్మం కోసం జరిగే యుద్ధంగా మలిచాం. త్రివిక్రమ్ గారు కూడా పవన్ కల్యాణ్ డిజైన్ చేసిన ఫైట్‌ను మెచ్చుకున్నారు. మా నాన్న ఎ.ఎం.రత్నం ఇచ్చిన పేరే నాకు ఈ అవకాశాన్ని తీసుకొచ్చింది. అభిమానులందరికీ గర్వపడేలా ఈ సినిమా ఉంటుందని చెప్పగలను” అని ఉద్వేగంగా చెప్పారు.

చిత్ర కథానాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ, “ఈ రోజు నాకు ఎమోషనల్ డే. పవన్ కళ్యాణ్ గారితో నటించే అవకాశం దక్కడం గర్వంగా ఉంది. ఎ.ఎం.రత్నం గారి నాయకత్వం, జ్యోతి కృష్ణ గారి హ్యాండిల్… రెండు మా టీమ్‌ను విజయపథంలో నడిపించాయి. ఈసారి డేట్ మారదు, రికార్డులు మాత్రం ఖచ్చితంగా మారతాయని నమ్మకం ఉంది. కీరవాణి గారి సంగీతం సినిమాకు ప్రాణం. ఇలా గొప్ప టీమ్‌లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు. మొత్తంగా, ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి, వారి అభిప్రాయాలు, అభినందనలు ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి.


Tags:    

Similar News