హరిహర వీరమల్లు బిజినెస్.. ఓ రిస్కుకు సిద్ధమైన నిర్మాత
ప్రస్తుతం థియేట్రికల్ బిజినెస్ రంగంలో హరిహర వీరమల్లు చిత్ర బృందం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎపిక్ “హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్” సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ విడుదలతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. పవన్ కొత్త అవతారం, విజువల్ ప్రెజెంటేషన్, కీరవాణి సంగీతం అన్నీ కలిసి ఈ సినిమాను ప్రేక్షకుల్లో బలమైన బజ్‌తో నిలిపాయి. సినిమా విడుదల సమీపిస్తున్నప్పటికీ, నిర్మాతల దృక్పథం మాత్రం బిజినెస్ పరంగా ఎలాంటి తొందర పడకుండా స్ట్రాటజిక్‌గా సాగుతోంది.
ప్రస్తుతం థియేట్రికల్ బిజినెస్ రంగంలో హరిహర వీరమల్లు చిత్ర బృందం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. మిగతా ఏరియాల డీల్స్ కోసం చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు చాలా ప్రాంతాల్లో ఫైనల్ డీల్ కుదరలేదని సమాచారం. సినిమా హై బడ్జెట్, పవన్ రాజకీయ స్థితిగతుల నేపథ్యంలో, నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ విషయంలో చాలా బలమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ప్రత్యేకించి కొన్ని కీలక ప్రాంతాల్లో డైరెక్ట్ ఓన్షిప్ విడుదల వైపు మొగ్గుచూపుతున్నారు.
తాజాగా నైజాం ఏరియాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ ఏరియాలో సినిమా హక్కులు ఎవరికీ అమ్మకుండా, నిర్మాత రత్నం స్వయంగా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారట. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ ద్వారా కొన్ని సినిమాలు స్వయంగా రిలీజ్ చేసిన అనుభవం ఆయనకు ఉండటంతో, నైజాంలో మార్కెట్ రీచ్, పవన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని స్వయంగా రిలీజ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారని సమాచారం. దీంతో నైజాంలో ప్రాఫిట్ మొత్తం నిర్మాతలకే చేరే అవకాశం ఉండనుంది.
ఇటీవల సినిమా సెన్సార్ పూర్తై U/A సర్టిఫికెట్ పొందింది. విడుదలకు అన్నీ సిద్ధమయ్యాయి. జూలై 24న హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. మాస్ అండ్ క్లాస్‌ను కలిపే కంటెంట్‌తో ఈ సినిమా థియేటర్లలో కొత్త అనుభూతిని ఇవ్వబోతోందన్న నమ్మకం మేకర్స్‌కు ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలో పవన్ కళ్యాణ్ కూడా నేరుగా పాల్గొనాలన్న ఆలోచనలో ఉన్నారన్న టాక్ ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది.
బాబీ డియోల్, నిధి అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు విజువల్స్, మ్యూజిక్ బలమైన ప్లస్ పాయింట్లుగా నిలవబోతున్నాయి. సినిమా విడుదలకు ముందు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల ప్లానింగ్ కూడా మొదలైంది. నైజాంలో స్వయంగా విడుదలతో నిర్మాతల ధైర్యం చూస్తుంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ సంచలనం సృష్టించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.