సినిమాల్లో AI విప్లవం: శ్రమకు విలువేది? స్టంట్ మాస్టర్ల మనుగడకే ముప్పు!

ప్రస్తుత కాలంలో సినిమా మేకింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.;

Update: 2026-03-29 09:30 GMT

ప్రస్తుత కాలంలో సినిమా మేకింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ టెక్నాలజీపై ప్ర‌ముఖ‌ హీరో చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీశాయి. సినిమా అనేది కేవలం వెండితెరపై కనిపించే దృశ్యం మాత్రమే కాదని..., అది నటీనటుల నిజమైన శ్రమ - భావోద్వేగాల సమాహారమని ఆయన గుర్తుచేశారు. టెక్నాలజీని పరిమితంగా వాడుకోవడం వరం కావొచ్చు కానీ.. దానిపై అతిగా ఆధారపడటం సినిమా రంగానికి శాపంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో ఏఐ వినియోగం వల్ల సహజత్వం పూర్తిగా దెబ్బతింటోంది. గతంలో నటులు ప్రాణాలకు తెగించి చేసిన సాహసోపేతమైన పోరాట దృశ్యాలు ప్రేక్షకులకు ఒక రకమైన ఉత్తేజాన్ని ఇచ్చేవి. కానీ ఇప్పుడు నటుల ప్రమేయం లేకుండానే కంప్యూటర్ గ్రాఫిక్స్, ఏఐ ద్వారా అద్భుతాలు సృష్టించాలని చూడటం విడ్డూరంగా ఉంది. దీనివల్ల తెరపై యాక్షన్ సీన్లు అద్భుతంగా కనిపిస్తున్నా.. అందులో నటుల నిజమైన కష్టం కనిపించకపోవడంతో సినిమాలోని `ఆత్మ` లోపిస్తోంది.

ఏఐ ప్రభావం కేవలం విజువల్స్ పైనే కాకుండా నటుల పర్ఫార్మెన్స్ పై కూడా పడుతోంది. టెక్నాలజీ సాయంతో సీన్లను రూపొందించడం వల్ల నటుల హావభావాలు సైతం కృత్రిమంగా మారుతున్నాయి. ఎటువంటి రిస్క్ తీసుకోకుండా.. చెమట చిందించకుండా కేవలం డిజిటల్ సాయంతో గొప్ప యాక్షన్ సీక్వెన్సులను చూపించడం వల్ల సినిమా ప్రాథమిక సూత్రానికే విఘాతం కలుగుతోంది. భవిష్యత్తులో మనం వెండితెరపై చూసేది నిజమైన నటులనా లేక కేవలం డిజిటల్ బొమ్మలనా అనే సందేహాలు ఇప్పుడు అందరిలోనూ బలంగా వ్యక్తమవుతున్నాయి.

టెక్నాలజీ వల్ల మున్ముందు స్టంట్ మాస్టర్లు , యాక్షన్ కోరియోగ్రాఫర్ల ఉనికికే ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం స్టంట్ మాస్టర్లకు మంచి అవకాశాలు ద‌క్కుతున్నా.. `ఏఐ వినియోగం` పెరిగితే వారి అవసరం క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంది. సాంకేతికత అనేది మనుషుల పనిని సులభతరం చేయడానికి ఉపయోగపడాలి తప్ప.. వారి ఉద్యోగాలను దూరం చేసేలా ఉండకూడదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సృజనాత్మకతకు, సాంకేతికతకు మధ్య ఉండాల్సిన స్పష్టమైన గీత చెరిగిపోతే అది మొదటికే మోసం తెచ్చేలా ఉంది.

బడ్జెట్ తగ్గించుకోవడానికో లేదా పనులు త్వరగా పూర్తి చేయడానికో టెక్నాలజీని వాడుకోవడంలో తప్పు లేదు కానీ.. అది నటుల స్థానాన్ని భర్తీ చేయకూడదు. సినిమా అనేది మనుషుల భావోద్వేగాల సమాహారం కాబట్టి.. సృజనాత్మకతకు పెద్దపీట వేసినప్పుడే అది ప్రేక్షకులకు చేరువవుతుంది. ఈ విషయంలో చిత్ర పరిశ్రమ పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే సినిమా తన అస్తిత్వాన్ని కాపాడుకోగలదని సదరు హీరో చేసిన వ్యాఖ్యలు పరిశ్రమ వర్గాలను ఆలోచింపజేస్తున్నాయి.

Tags:    

Similar News