నా తల్లి చనిపోవడానికి కారణం ఫేక్ న్యూస్‌లే: నటి హేమ కన్నీటి ఆవేదన!
తల్లి చనిపోవడానికి ప్రధాన కారణం మీడియాలో వచ్చిన ట్రోల్స్ ఫేక్ న్యూస్‌లేనని హేమ ఆరోపించారు.;
ఇటీవల ఒక వివాదం కారణంగా మానసికంగా కుంగిపోయిన నటి హేమ, ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె సంతోషం, విషాదం రెండింటినీ పంచుకున్నారు. బెంగళూరు హైకోర్టు తనపై ఉన్న కేసును కొట్టేసిందని, తాను నిర్దోషినని రుజువైందని హేమ సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఆ తీర్పు వచ్చిన కొద్ది రోజులకే తన తల్లి అనారోగ్యంతో చనిపోయారనే విషాదకరమైన వార్తను ఆమె పంచుకున్నారు.
హేమ మాట్లాడుతూ, నవంబర్ 3న కోర్టు తీర్పు వచ్చిందని, అయితే జడ్జిమెంట్ కాపీ చేతికి వచ్చేంత వరకు ఈ విషయాన్ని ప్రకటించవద్దని లాయర్లు చెప్పారని తెలిపారు. ఈలోగా తన తల్లికి స్ట్రోక్ వచ్చి హఠాత్తుగా చనిపోయారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తల్లి తన ధైర్యం అని, ఈరోజు తాను నిలబడడానికి కారణం ఆమేనని హేమ అన్నారు.
తల్లి చనిపోవడానికి ప్రధాన కారణం మీడియాలో వచ్చిన ట్రోల్స్ ఫేక్ న్యూస్‌లేనని హేమ ఆరోపించారు. సోషల్ మీడియాలో న్యూస్ ఛానెళ్లు చేసిన ప్రచారం వల్ల తన తల్లి చాలా బాధపడ్డారని, అది తట్టుకోలేకనే ఆమె చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను "ఫేక్ న్యూస్ వేయకండి, నేను నిర్దోషిని" అని మొత్తుకున్నా, ఎవరూ వినలేదని అన్నారు. ఇప్పుడు మా అమ్మ చనిపోయింది? ఒకవేళ నాకు ఏమైనా జరిగి ఉంటే దానికి మీరు ఏం చేస్తారు అని ఆమె ప్రశ్నించారు.
గత ఒకటిన్నర సంవత్సరం నుంచి ఈ ఫేక్ న్యూస్ కారణంగా తాను మానసికంగా శారీరకంగా చాలా మదనపడిపోయానని హేమ తెలిపారు. అందరిని కలవకుండా, పది చోట్లకు వెళ్లాల్సిన దాన్ని రెండు చోట్లకే వెళ్లి వెంటనే తిరిగి వచ్చేదాన్ని అన్నారు. ఈ మానసిక హింస వల్ల తాను కుంగిపోయానని చెప్పారు. కోర్టు తీర్పు వచ్చినా, తన తల్లిని వీరంతా తిరిగి తీసుకురాలేరు కదా అని ఆమె ప్రశ్నించారు.
హేమ మీడియా ట్రోల్స్ పై తీవ్రంగా మండిపడ్డారు. సెలబ్రిటీలు అయినంత మాత్రాన మాపై ఎలాంటి అధికారాలు మీకు ఉంటాయి? మా పరువు తీయడానికి మీకు ఏం హక్కు ఉంది? అని నిలదీశారు చివరగా, తాను నిర్దోషిని అని కోర్టు తీర్పు ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పారు. దయచేసి నిజాన్ని నిజంగా వేయండి, అబద్ధాలు ప్రచారం చేయొద్దని మీడియాను వేడుకున్నారు.