బీఫ్ సీన్.. ప్రకాష్‌రాజ్-అనురాగ్‌లకు గట్టిగా ఇచ్చి పడేసాడు
భారతీయ యువతులను మోసం చేసి మత మార్పిడులకు పాల్పడే పాక్ ఉగ్రమూకలు, ముసల్మానులపై ప్రొపగండా సినిమా 'ది కేరళ స్టోరి' అనే ప్రచారం ఒక వర్గంలో ఉంది.;
భారతీయ యువతులను మోసం చేసి మత మార్పిడులకు పాల్పడే పాక్ ఉగ్రమూకలు, ముసల్మానులపై ప్రొపగండా సినిమా 'ది కేరళ స్టోరి' అనే ప్రచారం ఒక వర్గంలో ఉంది. ఇప్పుడు సీక్వెల్ `ది కేరళ స్టోరీ 2` ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో, చిత్ర పరిశ్రమలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. ముఖ్యంగా దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్.., నటుడు ప్రకాష్ రాజ్ - దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
అనురాగ్ కశ్యప్ విమర్శలు:
కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో మీడియాలో మాట్లాడిన అనురాగ్ కశ్యప్ ఈ సినిమాపై అత్యంత కఠినమైన పదజాలాన్ని ఉపయోగించారు. ఆయన ఈ చిత్రాన్ని ప్రచార చిత్రం (ప్రొపగండా), చెత్త సినిమా అని కొట్టిపారేశారు. ట్రైలర్‌లో ఒక హిందూ స్త్రీకి బలవంతంగా బీఫ్ (గోమాంసం) తినిపించే దృశ్యంపై స్పందిస్తూ..''ఎవరైనా అలా బీఫ్ తినిపిస్తారా? అది అసలు వాస్తవికంగా లేదు. కేవలం డబ్బు సంపాదించాలనే దురాశతో తీసిన సినిమా ఇది!'' అని ఘాటుగా విమర్శించారు.
ఇంతకుముందు ప్రకాష్ రాజ్ కూడా ట్రైలర్ లో బీఫ్ తినిపించే సన్నివేశం వీడియోలు, ఫోటోలు షేర్ చేసి, నిజమైన కేరళ వాసులు బీఫ్ ని ఎలా వండుకు తింటున్నారో చూడండి! అంటూ కౌంటర్ వేసారు. కేరళ సమాజాన్ని తప్పు పడుతూ, ది కేరళ స్టోరి 2లో చూపించినది కేవలం `ప్రొపగండా` అనే అర్థంలో విమర్శించారు.
దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ కౌంటర్:
అయితే అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ విమర్శలకు దర్శకుడు ఢిల్లీలో ఒక మీడియా సమావేశంలో గట్టి సమాధానం ఇచ్చారు. అనురాగ్ కశ్యప్‌పై స్పందిస్తూ,..అనురాగ్ సినిమాలు గత కొన్ని ఏళ్లుగా ఫ్లాప్ అవుతున్నాయి.. అందుకే ఆయన మానసికంగా బలహీనపడ్డారు. ప్రజలు ఆయన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. మన సోదరీమణులకు బలవంతంగా బీఫ్ తినిపించి మతమార్పిడి చేస్తున్నారనే నిజాన్ని ఆయన చూడలేకపోతున్నారు. ఆయనకు కావాలంటే మా రీసెర్చ్ మెటీరియల్ అంతా ఆయన ఇంటికి పంపిస్తాం! అని సవాల్ విసిరారు.
ప్రకాష్ రాజ్‌పై తీవ్రంగా విరుచుపడుతూ.. దర్శకుడు కామాఖ్య ఇలా అన్నారు. ప్రకాష్ రాజ్‌ను `మేధోపరంగా దివాళా తీసిన వ్యక్తి` అని సంబోధించారు. వాస్తవాలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
వివాదానికి కారణం:
2023లో వచ్చిన 'ది కేరళ స్టోరీ' లాగే, ఈ సీక్వెల్ కూడా కేరళలో జరుగుతున్న మతమార్పిడులు, లవ్ జిహాద్ అంశాల చుట్టూ తిరుగుతోంది. ట్రైలర్‌లో చూపించిన కొన్ని సీన్లు..ముఖ్యంగా బీఫ్ తినిపించే సీన్ లాంటివి తీవ్ర దుమారం రేపుతున్నాయి. చిత్ర బృందం మాత్రం ఇవన్నీ వాస్తవ సంఘటనల ఆధారంగానే తీశామని వాదిస్తోంది.
మొత్తానికి 'ది కేరళ స్టోరీ 2' కేవలం సినిమాగానే కాకుండా ఒక రాజకీయ, సామాజిక చర్చగా మారిపోయింది. దర్శకుడు మాత్రం తన సినిమాను విమర్శించే వారికి గట్టిగానే సమాధానం ఇస్తున్నారు.