'బ్యాండ్ మేళం'తో కోర్ట్ జోడీ.. టీజర్ ఎలా ఉందంటే?
ఇటీవల చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న కోర్ట్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జోడీ హర్ష్ రోషన్- శ్రీదేవి మరోసారి కలిసి రాబోతున్నారు.;
ఇటీవల చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న కోర్ట్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జోడీ హర్ష్ రోషన్- శ్రీదేవి మరోసారి కలిసి రాబోతున్నారు. ఈసారి వారిద్దరూ కంప్లీట్ యూత్ ఎంటర్టైనర్ గా రూపొందిన బ్యాండ్ మేళం మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మార్చి 13వ తేదీన ఆ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా.. తాజాగా మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు.
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఆ చిత్రానికి సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. యువతకు దగ్గరగా ఉండే ప్రేమ, స్నేహం, కుటుంబ భావోద్వేగాలు, సరదా సంఘటనలు.. అలా అన్నీ కలగలిపి సినిమాను రూపొందించినట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. ముఖ్యంగా బావా మరదళ్ల మధ్య సాగే గిల్లికజ్జాలు, అల్లరి, చిన్న చిన్న గొడవలు, బ్రేకప్ ఎమోషన్స్.. సినిమాలో ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.
బ్యాండ్ మేళం చిత్రాన్ని ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ నిర్మించారు. ఆయన బ్యానర్ లో వస్తున్న సినిమాలంటే ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అదే నమ్మకంతో బ్యాండ్ మేళం మూవీని కూడా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ తో తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. సంగీతాన్ని యువ సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు మరో ప్లస్ గా నిలవనున్నాయని టాక్ వినిపిస్తోంది.
మంగళవారం విడుదలైన టీజర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రేమలో ఫెయిల్ అయిన యువకుడి భావోద్వేగాలతో టీజర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కాలేజీ వాతావరణం, స్నేహితుల ఫన్నీ మూమెంట్స్, హీరో హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు వరుసగా చూపించారు. అయితే ఇటీవల వచ్చిన గ్లింప్స్ లో హీరో తన స్నేహితుడికి తాళి కట్టే సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ట్విస్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
అయితే కోర్ట్ సినిమాతో ప్రశంసలు అందుకున్న రోషన్, శ్రీదేవి ఇప్పుడు బ్యాండ్ మేళం చిత్రంలో మరింత ఎనర్జీతో కనిపిస్తున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంతో నేచురల్ గా, ఫ్రెష్ గా ఉండటం యూత్ ను ఆకట్టుకునే అంశంగా మారింది. విలేడ్ అండ్ టౌన్ ఎన్విరాన్మెంట్ లో సాగే కథకు తెలంగాణ బ్యాక్ డ్రాప్ ప్రత్యేక అందాన్ని తీసుకువచ్చింది. విజువల్స్ ఎంతో నేచురల్ గా ఉన్నాయి.
ఏదైమైనా బ్యాండ్ మేళం మూవీ ఒక ఫన్నీ లవ్ స్టోరీ మాత్రమే కాకుండా, కుటుంబంతో కలిసి చూడదగ్గ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందినట్లు టీజర్ హింట్ ఇస్తోంది. అయితే చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన కోర్ట్ తర్వాత రోషన్, శ్రీదేవి నుంచి వస్తున్న బ్యాండ్ మేళం మూవీ అదే రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో లేదో అన్నది వేచి చూడాలి