'వీరమల్లు' రిలీజ్ డేట్.. ఓటీటీ సంస్థ ఫైనల్ చేసిందా?
ప్రెస్ మీట్ లో వీరమల్లు మూవీ గురించి మాట్లాడి.. కొత్త రిలీజ్ తేదీని రత్నం ప్రకటిస్తారని తెలుస్తోంది. మొత్తానికి ఈరోజు విడుదలపై క్లారిటీ రానుందని సమాచారం.;
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు విడుదల మరోసారి వాయిదా పడుతుందని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 12వ తేదీన రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించినా.. అది జరిగేలా లేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా లేట్ అయిందని కామెంట్స్ పెడుతున్నారు.
అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో జాప్యం కావడం వల్లే సినిమా ఇప్పుడు వాయిదా పడిందని క్లియర్ గా తెలుస్తోంది. కానీ ఓటీటీ డీల్ విషయంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఏం చేస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్.. హరిహర వీరమల్లు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది.
ఓటీటీ డీల్ ఫిక్స్ అయ్యాకనే.. వీరమల్లు మేకర్స్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఇప్పుడు వాయిదా వేస్తే అమెజాన్ ప్రైమ్ వీడియో అదే డీల్ ను కొనసాగిస్తుందని చెప్పలేం. ఎందుకంటే రిలీజ్ స్లాట్స్ ను చూసుకునే డీల్ ఫిక్స్ చేస్తాయి ఓటీటీలు. అయితే నిర్మాత ఏ ఎం రత్నం.. అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులతో ఇటీవల చర్చించినట్లు తెలుస్తోంది.
వీరమల్లు రిలీజ్ విషయంపై మాట్లాడుకున్నారట. సమావేశంలో ఏం డిస్కస్ చేసుకున్నారో తెలియదు కానీ.. విడుదల తేదీపై ఓ నిర్ణయానికి వచ్చేశారని టాక్. జూలై 4వ తేదీ లేదా జూలై 18వ తేదీల్లో ఒకటి డేట్ ను ఫైనల్ చేయనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో నిర్మాత రత్నం.. మరికొద్ది గంటల్లో ప్రెస్ మీట్ పెట్టనున్నారట.
ప్రెస్ మీట్ లో వీరమల్లు మూవీ గురించి మాట్లాడి.. కొత్త రిలీజ్ తేదీని రత్నం ప్రకటిస్తారని తెలుస్తోంది. మొత్తానికి ఈరోజు విడుదలపై క్లారిటీ రానుందని సమాచారం. ఏ తేదీని ఫిక్స్ చేస్తారో చూడాలి. అయితే జూలై 4వ తేదీన విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీ రిలీజ్ కానుంది. దాంతోపాటు మరిన్ని సినిమాల రిలీజ్ లూ ఉన్నాయి.
ఇక వీరమల్లు విషయానికొస్తే.. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా.. ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మరి హరిహర వీరమల్లు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.