100కోట్లు కేవలం గడియారాల కోసం ధారపోసిన క్రికెటర్
లగ్జరీ బ్రాండ్ వాచ్ లను అమితంగా ఆరాధించే స్టార్లలో సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ప్రముఖులు ఉన్నారు.;
లగ్జరీ బ్రాండ్ వాచ్ లను అమితంగా ఆరాధించే స్టార్లలో సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ప్రముఖులు ఉన్నారు. గతంలో సల్మాన్ ఖాన్ ధరించిన జాకబ్ & కో బ్రాండ్ వాచ్ ఖరీదు గురించి చాలా చర్చ సాగింది. సల్మాన్ ఇష్టపడే వాచ్ ల రేంజు 4కోట్ల నుంచి 10కోట్ల మధ్య ఉంది. అలాగే సంజయ్ దత్ ప్రీమియం బ్రాండ్ వాచ్ ల కోసం కోట్లు ధారపోస్తాడు. టాలీవుడ్ స్టార్లు రామ్ చరణ్- ఎన్టీఆర్ ఖరీదైన రిచర్డ్ మిల్లె వాచీలు ధరించి పలు సందర్భాల్లో పబ్లిక్ లోకి వచ్చారు. రామ్ చరణ్ ధరించే ఆర్.ఎం 029 బ్రాండ్ వాచ్ ధర రూ. 1.5 కోట్లు. ఈ వాచ్ కోసం చెల్లించిన పన్నులు, దిగుమతి సుంకాలు అదనం. అప్పట్లోనే ముంబైలో ఓ ఈవెంట్ కోసం అటెండయిన జూనియర్ ఎన్టీఆర్ రూ. 8.7 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లీ వాచ్ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రదర్శించారు.
ఇప్పుడు టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఖరీదైన వాచ్ లతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 32 ఏళ్ల ఈ క్రికెటర్ ఆడంబరాలు ఎప్పుడూ చర్చనీయాంశమే. హార్దిక్ చాలాసార్లు తన సహచర ఆటగాళ్ళు ఒక సీజన్‌లో సంపాదించే దానికంటే ఎక్కువ ఖరీదైన వాచ్‌లను ధరించి కనిపించాడు. జీక్యూ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం.. పాండ్యా వాచ్ కలెక్షన్ క్రికెట్ ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తుంది. పటేక్ ఫిలిప్, రిచర్డ్ మిల్లె, రోలెక్స్ , ఆడెమర్స్ పిగ్యుట్ వంటి బ్రాండెడ్ వాచ్ లను మాత్రమే అతడు ధరిస్తాడు.
ఫ్యాన్స్ హార్థిక్ అభిరుచిని ఎంఎస్ ధోనికి సూపర్ బైక్‌లపై ఉన్న పిచ్చితో పోలుస్తారు. హార్థిక్ పాండ్య దగ్గర దాదాపు 50 -100 కోట్లు ఖరీదు చేసే వాచ్ లు ఉన్నాయంటే నమ్మగలరా? ఐపిఎల్ లో, ఇతర బహిరంగ ప్రదర్శనలలో, విమానాశ్రయాలలో కూడా ఖరీదైన వాచ్ లను చాలా క్యాజువల్‌గా ధరించే ఏకైక క్రికెటర్ అతడు. హార్థిక్ ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన ప్రతిసారీ అందరి దృష్టిని ఆకర్షిస్తాడు.
హార్దిక్ ధరించే వాచ్ లలో ఆడెమర్స్ పిగ్యుట్ మోడల్ ధర రూ. 2 కోట్ల నుండి రూ. 4 కోట్ల మధ్య ఉంటుంది. ఈ వాచ్ కి ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలలో మంచి డిమాండ్ ఉంది. రిచర్డ్ మిల్లె RM 67-02 అలెక్సిస్ పింటురాల్ట్ ఎడిషన్ వాచ్ ని హార్థిక్ గతంలో ధరించాడు. ఈ వాచ్ వెర్షన్ విలువ రూ. 3 కోట్ల నుండి రూ. 5 కోట్ల వరకు ఉంటుంది.
పటేక్ ఫిలిప్ నాటిలస్ ఎమరాల్డ్ వాచ్ లను హార్థిక్ ధరిస్తాడు. మార్కెట్ డిమాండ్‌ను బట్టి దీని అంచనా ధర రూ. 8 కోట్ల నుండి రూ. 15 కోట్ల వరకు ఉంటుంది. రిచర్డ్ మిల్లె ఆర్.ఎం 56-03 బ్లూ సఫైర్ హార్థిక్ కలెక్షన్స్ లో అత్యంత ఖరీదైన వాచ్. ఈ టైమ్‌పీస్ ధర రూ. 45 కోట్ల నుండి రూ. 55 కోట్ల మధ్య ఉంటుంది. నీలమణి క్రిస్టల్‌తో తయారు చేసే రిచర్డ్ మిల్లె అరుదైన వాచ్ లలో ఒకటి. రిచర్డ్ మిల్లె ఆర్.ఎం 27-04 రాఫెల్ నాదల్ ఎడిషన్ వాచ్ ధర రూ. 12 కోట్ల నుండి రూ. 15 కోట్ల మధ్య ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 వాచ్ పీస్ లు మాత్రమే ఉన్నాయి. ఇది పాండ్యా అత్యంత ప్రత్యేకమైన ఆస్తులలో ఒకటి.
రిచర్డ్ మిల్లె 35-02 బేబీ బ్లూ.. ఈ మోడల్ రూ. 1 కోటి నుండి రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. హార్దిక్ రెగ్యులర్‌గా ఉపయోగించే గడియారాలలో ఇది ఉంది. హార్దిక్ రూ. 18 కోట్ల నుండి రూ. 25 కోట్ల విలువైన రెండవ ఆర్.ఎం 27-04 వేరియంట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ వాచ్ మైదానంలో చాలా సార్లు అందరినీ ఆకర్షించింది.రోలెక్స్ డేటోనా `ఐ ఆఫ్ ది టైగర్` ఎడిషన్ వాచ్ ఖరీదు 1-3కోట్లు. అందమైన డయల్, వజ్రాలతో డిజైన్ చేసిన ఈ వాచ్ హార్థిక్ కలెక్షన్లలో ప్రత్యేకమైనది. అతడి ఇన్ స్టా పోస్టులు పరిశీలిస్తే, అతడు ఎన్ని మోడళ్ల వాచ్ లను ఉపయోగిస్తాడో సులువుగా విశ్లేషించవచ్చు.
అంబానీ వారసులు ఆ రేంజులో..
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తన పెళ్లిలో అత్యంత ఖరీదైన బ్రాండెడ్ వాచ్ లను ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అతడు తన పెళ్లికి వచ్చిన అతిథులకు ఒక్కొక్కరికి రూ.2కోట్ల ఖరీదు చేసే వాచ్ లను కానుకగా ఇచ్చాడు. ఇక అతడు 20కోట్ల ఖరీదైన వజ్రాలు పొదిగిన వాచ్ ని ధరించి ఆశ్చర్యపరిచాడు. రెడ్ కార్బన్ TPT రిచర్డ్ మిల్లె RM 57-03 డ్రాగన్ టూర్‌బిల్లాన్ లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌ని అనంత్ అంబానీ ధరించాడు.
ఖరీదైన విల్లాలు, కాస్ట్ లీ కార్లు, భారీతనం నిండిన ఆభరణాలు, బ్రాండెడ్ వాచ్ లు.. ఇలాంటి విలాసాలను ఆస్వాధించే సెలబ్రటీలు భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో అత్యధికంగా ఉన్నారని కూడా సర్వేలు చెబుతున్నాయి.