హర్భజన్ సింగ్ బయోపిక్ : ఏ హీరో సరిపోతాడు?
తన స్పిన్ బౌలింగ్‌తో పాటు, కీలక సమయాల్లో బ్యాటింగ్‌తోనూ ఎన్నో చిరస్మరణీయ క్షణాలను అందించాడు;
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప బౌలర్లలో హర్భజన్ సింగ్ ఒకరు. తన స్పిన్ బౌలింగ్‌తో పాటు, కీలక సమయాల్లో బ్యాటింగ్‌తోనూ ఎన్నో చిరస్మరణీయ క్షణాలను అందించాడు. 'టర్బోనేటర్'గా పిలువబడే హర్భజన్ ప్రస్థానం ఒక సినిమాటిక్ కథలాంటిది, దాన్ని వెండితెరపై చూడటం క్రికెట్ అభిమానులకు గొప్ప వినోదాన్నిస్తుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ తన జీవిత కథ సినిమాగా వస్తే చూడాలని ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా తన పాత్రకు న్యాయం చేయగలరని భావిస్తున్న ఇద్దరు నటుల పేర్లను కూడా వెల్లడించారు. విక్కీ కౌశల్ , రణవీర్ సింగ్‌లు తన పాత్రకు ఉత్తమ ఎంపికలని ఆయన అన్నారు. ఈ ఇద్దరు నటుల అంకితభావాన్ని, తెరపై వారి శక్తిని హర్భజన్ ప్రశంసించారు.
"రణవీర్ సింగ్ శక్తి, విక్కీ కౌశల్ తీవ్రత వీరిద్దరూ నా కథకు న్యాయం చేయగలరు" అని హర్భజన్ సింగ్ పేర్కొన్నారు. గతంలో రణవీర్ సింగ్ '83' చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో ఒదిగిపోయి, ఆ పాత్రను ఎంత అద్భుతంగా పోషించగలడో నిరూపించుకున్నాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినా, రణవీర్ నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. మరోవైపు, విక్కీ కౌశల్ 'ఛావా' చిత్రంలో తన పాత్రలో తీవ్రతను ప్రదర్శించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ₹600 కోట్లకు పైగా వసూలు చేసి, ఈ ఏడాది ఇప్పటివరకు అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది
హర్భజన్ సింగ్ బయోపిక్‌లో ఆయన పాత్రను ఎవరు పోషిస్తారో, ఆ చిత్రం ఎలా రూపుదిద్దుకుంటుందో చూడాలి. విక్కీ కౌశల్ తన ఇంటెన్సిటీతో లేక రణవీర్ సింగ్ తన ఎనర్జీతో భజ్జీ పాత్రలో మెప్పిస్తారో కాలమే నిర్ణయించాలి.