టాప్ 5: సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు

ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఇలా సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు ఈమధ్య బాగానే వస్తున్నాయి.

Update: 2026-10-08 04:47 GMT

సినిమా బడ్జెట్ రెండు కోట్లు.. కానీ బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టింది మాత్రం ఏకంగా 400 కోట్లు. వినడానికి ఏదో వింతగా అనిపించినా ఇప్పుడు హనుమాన్ అంశ్ విషయంలో జరిగింది అక్షరాలా ఇదే. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా పది లక్షల ఓపెనింగ్ తో మొదలైన ఈ చిన్న చిత్రం.. కేవలం రెండు నెలల్లోనే వరల్డ్ వైడ్ గా 425 కోట్ల మార్క్ దాటి ట్రేడ్ పండితుల మైండ్ బ్లాక్ చేసింది.

భారీ స్టార్ కాస్ట్ లేదు.. రిలీజ్ కు ముందు పాన్ ఇండియా ప్రమోషన్లు అంతకంటే లేవు. కేవలం మౌత్ టాక్ తోనే ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టడం మామూలు విషయం కాదు. థియేటర్లలో సినిమా రన్ అవుతున్న కొద్దీ దానికి అదే కొత్త స్క్రీన్లు పెంచుకుంటూ పోయింది. కంటెంట్ లో దమ్ముంటే కలెక్షన్ల సునామీని ఎవరూ ఆపలేరని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది.

ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఇలా సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు ఈమధ్య బాగానే వస్తున్నాయి. రిలీజ్ కు ముందు ఒక చిన్న ప్రాంతీయ సినిమాగానో లేక సింపుల్ కాన్సెప్ట్ తోనో మొదలై.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించిన బ్లాక్ బస్టర్స్ కొన్ని ఉన్నాయి. పెట్టిన బడ్జెట్ కు లాభాలకు అస్సలు పొంతన లేని ఆ ఐదు సినిమాల లిస్ట్ ఒకసారి చూస్తే..

హనుమాన్ అంశ్: బడ్జెట్ రూ. 2 కోట్లు; వసూళ్లు రూ. 425 కోట్లు

సీక్రెట్ సూపర్ స్టార్: బడ్జెట్ రూ. 15 కోట్లు; వసూళ్లు రూ. 900 కోట్లు

కాంతార: బడ్జెట్ రూ. 16 కోట్లు; వసూళ్లు రూ. 400 కోట్లు

ది కశ్మీర్ ఫైల్స్: బడ్జెట్ రూ. 25 కోట్లు; వసూళ్లు రూ. 238 కోట్లు

కార్తికేయ 2: బడ్జెట్ రూ. 15 కోట్లు; వసూళ్లు రూ. 121 కోట్లు

ఈ లిస్ట్ లో కాంతార స్టోరీ ఒక అద్భుతం అని చెప్పాలి. కేవలం ఒక ప్రాంతానికే పరిమితమైన ఆచారం, దైవం చుట్టూ తిరిగే కథను కన్నడ ఆడియన్స్ కు మాత్రమే పరిమితం చేయకుండా పాన్ ఇండియా జనాలు ఓన్ చేసుకున్నారు. అలాగే కార్తికేయ 2 కూడా తెలుగులో స్టార్ట్ అయి హిందీ బెల్ట్ లో సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఈ రెండు సినిమాలకు మొదట్లో భారీ మార్కెట్ లేకపోయినా.. కంటెంట్ నచ్చి జనాలే వాటిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లారు.

ఇక సీక్రెట్ సూపర్ స్టార్ లెక్క పూర్తిగా వేరు. ఇండియాలో డీసెంట్ కలెక్షన్లు తెచ్చుకున్న ఈ 15 కోట్ల సినిమాకు చైనా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా జాక్ పాట్ తగిలింది. ఓవర్సీస్ లో అక్షరాలా తొమ్మిది వందల కోట్లు కొల్లగొట్టి సెన్సేషన్ గా నిలిచింది. కశ్మీర్ ఫైల్స్ కూడా అంతే.. రిలీజ్ రోజున చాలా తక్కువ థియేటర్లలో పడిన ఈ సెన్సిటివ్ మూవీ, రోజులు గడిచేకొద్దీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇప్పుడు ఈ రూట్లో హనుమాన్ అంశ్ తన జోరు కొనసాగిస్తోంది. నార్త్ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను అక్టోబర్ 9న గ్రాండ్ గా తెలుగులో రిలీజ్ చేస్తోంది. కంటెంట్ ఉంటే బడ్జెట్ తో పనిలేదని ప్రూవ్ చేసిన ఈ చిన్న సినిమా మన దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News