యుఫోరియా.. దురంధర్ రేంజ్ అనుకున్నారట
ఫిబ్రవరి తొలి వారంలో విడుదలైన ఈ సినిమా.. మంచి ప్రయత్నంగా అనిపించినా, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.;
తెలుగులో సొగసు చూడతరమా, బాల రామాయణం, చూడాలని ఉంది, ఒక్కడు, రుద్రమదేవి లాంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. ఈ ఏడాది యుఫోరియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి తొలి వారంలో విడుదలైన ఈ సినిమా.. మంచి ప్రయత్నంగా అనిపించినా, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
ఐతే ఈ సినిమా చూడనందుకు తెలుగు ప్రేక్షకుల మీద తన ఆవేదనను వెళ్లగక్కారు గుణశేఖర్. ఈటీవీ విన్ ద్వారా యుఫోరియా డిజిటల్‌గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ నిర్వహించిన గుణశేఖర్.. ఈ సినిమాకు థియేటర్లలో ఆశించిన ఫలితం రాకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేశారు. దురంధర్‌తో మంచి గుర్తింపు సంపాదించిన సారా అర్జున్ ప్రతిభను తాను ముందే గుర్తించి తన సినిమాలో ముఖ్య పాత్రకు ఎంచుకున్నానని.. తన సినిమా కూడా దురంధర్ స్థాయిలో పెద్దసక్సెస్ అవుతుందని.. సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అనుకున్నానని గుణశేఖర్ వ్యాఖ్యానించారు.
ఫిబ్రవరిలో జీతాలు రాగానే జనాలు ఈ సినిమా చూస్తారని మొదటి వారంలో రిలీజ్ చేశామని.. కానీ సంక్రాంతికి వచ్చిన సినిమాల కోసం చాలా డబ్బులు పెట్టేసిన ఆడియన్స్ తమ సినిమా చూడ్డానికి థియేటర్లకు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా బాగుందట, ఓటీటీలోకి వచ్చాక చూడాలని అనడం తాను చాలా మంది నుంచి విన్నానని.. సినిమా బాగున్నా ఇది ఓటీటీ సినిమా అని థియేటర్లకు ప్రేక్షకులు రాలేదని.. ఓటీటీల వల్ల థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారని.. కాబట్టి ఓటీటీ విండో 3 నెలలకు పెంచాలని గుణశేఖర్ అభిప్రాయపడ్డారు.
ఈ సినిమా మహేష్ బాబుకు విపరీతంగా నచ్చిందని.. సినిమా చూసి తనతో చాలా సేపు మాట్లాడారని.. సినిమాను కొనియాడారని.. అంతే కాక ఇలాంటి సినిమా జనాలకు చేరాలని ట్వీట్ చేశారని.. ఇదంతా మహేష్ తనకు తానుగా చేశాడే తప్ప తాను అడిగితే చేయలేదని.. తన సినిమాకు డబ్బులు రాకపోయినా, మహేష్ లాంటి సూపర్ స్టార్‌కు సినిమా అంతగా నచ్చడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని గుణశేఖర్ చెప్పారు.