ఫైట్ మాస్టర్‌తో గోపీచంద్ క్రేజీ ప్రాజెక్ట్!
తన తరువాతే కెరీర్ స్టార్ట్ చేసిన హీరోలంతా రేసులో ఓవర్ టేక్ చేసేసి ముందుకు దూసుకుపోతున్నా గోపీచంద్‌కు మాత్రం కాలం కలిసి రావడం లేదు.;
టాలీవుడ్ స్టార్ హీరోల్లో రేసులో వెనకబడి ఉన్న స్టార్ గోపీచంద్. మ్యాచో మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న ఈ హీరో గత కొంత కాలంగా భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. హీరోగా కెరీర్ ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కమర్షియల్ స్టార్‌ల జాబితాలో చేరలేకపోతున్నారు. టీ.కృష్ణ వారసుడిగా అరంగేట్రం చేసినా మొదట్లో చూపించిన స్థాయిలో వేగం చూపించలేకపోతున్నారు. సక్సెస్‌లు కూడా అదే స్థాయిలో ఆయనతో దోబూచులాడుతున్నాయి.
తన తరువాతే కెరీర్ స్టార్ట్ చేసిన హీరోలంతా రేసులో ఓవర్ టేక్ చేసేసి ముందుకు దూసుకుపోతున్నా గోపీచంద్‌కు మాత్రం కాలం కలిసి రావడం లేదు. దీంతో ఇప్పటి వరకు స్టార్స్ జాబితాలో చేరే కమర్షియల్ బ్లాక్ బస్టర్‌ని దక్కించుకునే పనిలో ఉన్నారు. `ఘాజీ` ఫేమ్ సంకల్ప్ రెడ్డితో ప్రస్తుతం ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు. ఇది గోపీచంద్ నటిస్తున్న 33వ సినిమా. దీన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. సంకల్ప్ రెడ్డి `ఘాజీ` తరువాత మళ్లీ ఆ స్థాయి సక్సెస్‌ని సొంతం చేసుకోలేకపోయారు.
దీంతో ఈ సారి ఎలాగైనా షూర్ షాట్ బ్లాక్ బస్టర్‌ని ఖాతాలో వేసుకుని మళ్లీ ట్రాక్‌లోకి రావాలనే ప్రయత్నాల్లో భాగంగా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. రీతువర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. 25 రోజుల పాటు క్లైమాక్స్‌ని షూట్ చేయబోతున్నారు. దీనికి ముగ్గురు ఫైట్ మాస్టర్లు వర్క్ చేస్తున్నారు. సంకల్ప్, గోపీచంద్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ మూవీతో పాటు గోపీచంద్ మరో భారీ యాక్షన్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ మూవీ ద్వారా క్రేజీ ఫైట్ మాస్టర్ వెంకట్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. గోపీచంద్‌ని దృష్టిలో పెట్టుకునే సరికొత్త నేపథ్యంలో ఆయన కథని రాసుకున్నారట. ఇటీవలే ఆయనకు వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిందని తెలిసింది. ఈ భారీ యాక్షన్ డ్రామాని `యాత్ర` మూవీని నిర్మించిన 70 ఎం.ఎం బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టిన టీమ్ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ని జూన్ నుంచి ప్రారంభించాలని ప్లాన్ చేస్తోందట. ఇందులో గోపీచంద్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరు? కీలక పాత్రల్లో ఎవరెవరు నటిస్తారు? వంటి వివరాలతో పాటు సాంకేతిక నిపుణుల వివరాల్ని టీమ్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.