టాక్సిక్ బాక్సాఫీస్.. గీతూ టాప్ లీగ్‌లోకేనా?

ట్రైలర్ చూసి సినిమా మీద ఒక అభిప్రాయం పెట్టుకోవద్దని, సినిమాలో మహిళలకు కూడా బలమైన వాయిస్ ఉందని చెప్పారు.

Update: 2026-08-23 05:07 GMT

పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్లు, వందల కోట్ల మార్కెట్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, అట్లీ లాంటి పేర్లే. కానీ అదే రేంజ్‌లో మహిళా దర్శకుల పేరు మాత్రం చాలా అరుదుగా వినిపిస్తుంది. బాలీవుడ్‌లో ఫరా ఖాన్ ‘ఓం శాంతి ఓం’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ లాంటి భారీ కమర్షియల్ సినిమాలు చేశారు.

‘హ్యాపీ న్యూ ఇయర్’ ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్లకు పైగా వసూలు చేసింది. మేఘనా గుల్జార్ ‘రాజీ’తో దాదాపు రూ.190 కోట్ల రేంజ్‌లోకి వెళ్లారు. అయినా రూ.500 కోట్లు, రూ.1000 కోట్ల క్లబ్‌లో మహిళా దర్శకురాలి పేరు ఇప్పటివరకు బలంగా వినిపించలేదు. ఇప్పుడు గీతూ మోహన్‌దాస్ ముందు అలాంటి అవకాశం ఉంది. ‘టాక్సిక్’ చిన్న ప్రయోగం కాదు. యష్ హీరోగా, భారీ బడ్జెట్‌తో, ప్రపంచవ్యాప్తంగా 12 వేలకుపైగా స్క్రీన్లను టార్గెట్ చేస్తూ వస్తున్న సినిమా.

నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి పెద్ద కాస్ట్ కూడా ఉంది. అంటే ఒక మహిళా దర్శకురాలి చేతిలో ఇంత పెద్ద కమర్షియల్ ప్రాజెక్ట్ పెట్టడం అరుదైన విషయం. ఇక్కడ యష్ తీసుకున్న నిర్ణయం కూడా చిన్నది కాదు. ‘కేజీఎఫ్ 2’ తర్వాత ఆయన వెంటనే మరో మాస్ దర్శకుడి దగ్గరకు వెళ్లొచ్చు. కానీ గీతూ మోహన్‌దాస్‌ను ఎంచుకున్నారు.

ఆమె గత సినిమాలు ‘లయర్స్ డైస్’, ‘మూతోన్’ చూస్తే పూర్తిగా వేరే రకమైన దర్శకురాలు. అలాంటి దర్శకురాలితో యష్ తన కెరీర్‌లోనే పెద్ద సినిమాల్లో ఒకటి చేయడం రిస్క్ కూడా, నమ్మకం కూడా. యష్ కూడా హైదరాబాద్ ఈవెంట్‌లో ఇదే విషయం మీద మాట్లాడారు. మహిళలు ముందుకు రావడం ఎంత కష్టమో చెబుతూ, గీతూ ఈ సినిమాతో తన విజన్‌ను నిరూపిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.

ట్రైలర్ చూసి సినిమా మీద ఒక అభిప్రాయం పెట్టుకోవద్దని, సినిమాలో మహిళలకు కూడా బలమైన వాయిస్ ఉందని చెప్పారు. ఇప్పటికే గీతూ ఒక విషయం మాత్రం నిరూపించారు. మహిళా దర్శకురాలికి భారీ స్టార్, భారీ బడ్జెట్, పెద్ద కాన్వాస్ ఇవ్వలేమనే లెక్క ఇక్కడ పని చేయలేదు. ఇప్పుడు మిగిలింది బాక్సాఫీస్ మాత్రమే. ‘టాక్సిక్’ రూ.500 కోట్ల మార్క్ దాటితేనే అది పెద్ద రికార్డు. వెయ్యి కోట్లకు వెళ్లితే మాత్రం భారతీయ మహిళా దర్శకుల చరిత్రలోనే కొత్త రికార్డు అవుతుంది.

అదే నిజంగా జరిగితే గీతూ పేరు ఇక “లేడీ డైరెక్టర్” అనే ట్యాగ్ దగ్గర ఆగదు. పెద్ద స్టార్ సినిమాలు హ్యాండిల్ చేసే దర్శకుల లీగ్ లోనే నిలుస్తుంది. రాజమౌళి, నీల్, సుకుమార్ లాంటి టాప్ లీగ్‌తో పోలిక రావాలంటే ఇంకా సినిమాలు చేయాలి. కానీ ‘టాక్సిక్’ భారీగా క్లిక్ అయితే ఆ తలుపు మాత్రం ఈ ఒక్క సినిమాతోనే తెరుచుకుంటుంది.

Tags:    

Similar News