ఒకరికి ఒక సమోసా కదా.. ఆయన రెండు తిన్నారు.. కానీ స్టోరీ వినలేదు

ఆ సమయంలో విజయ్‌ ను కింగ్డమ్ లో హీరోగా ఎంపిక చేసుకోవడానికి కారణమేంటని సందీప్‌ వంగా గౌతమ్‌ తిన్ననూరిని ప్రశ్నించారు. దీంతో ఆయన వివరించారు.;

Update: 2025-07-26 05:37 GMT

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ లీడ్ రోల్ లో నటిస్తున్న కింగ్డమ్‌ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఆ సినిమాపై జులై 31న రిలీజ్ కానుంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ కింగ్డమ్ బాయ్స్ పేరుతో స్పెషల్ పాడ్ కాస్ట్ నిర్వహించారు. అందుకు గాను టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. విజయ్, గౌతమ్ తో చిట్ చాట్ చేశారు.

ఆ సమయంలో విజయ్‌ ను కింగ్డమ్ లో హీరోగా ఎంపిక చేసుకోవడానికి కారణమేంటని సందీప్‌ వంగా గౌతమ్‌ తిన్ననూరిని ప్రశ్నించారు. దీంతో ఆయన వివరించారు. "అప్పుడు విజయ్ కు గుర్తుందో లేదో నాకు తెలియదు. అప్పట్లో నా ఫస్ట్ సినిమాను ఇంకా డైరెక్ట్ చేయలేదు. విజయ్ కు స్టోరీ నెరేట్ చేయాలనుకున్నా. అప్పటికీ పెళ్లి చూపులు కూడా రిలీజ్ అవ్వలేదు. ఆ సినిమా ముందే స్టోరీ చెబుదామనుకున్నా. కానీ కుదరలేదు" అని చెప్పారు.

"పెళ్లి చూపులు శుక్రవారం రిలీజ్ అయితే.. ఆ రోజు ఈవెనింగే విజయ్ ను మణికొండలో ఉన్న నా ఆఫీస్ కు పిలిపించాం. పుట్టపర్తిలో విజయ్ తో చదువుకున్న సంజీవ్.. నన్ను విజయ్ ను మీట్ అవ్వడానికి హెల్ప్ చేశారు. అయితే సినిమా రిలీజ్ అయింది కదా.. ఆఫీస్ కు వచ్చాక కంటిన్యూగా విజయ్ కు ఫోన్స్, మెసేజ్ వస్తూనే ఉన్నాయి" అని గౌతమ్ తెలిపారు.

"ఏదో ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్లాల్సి ఉంది. అప్పుడే స్టోరీ నెరేట్ చేయడం స్టార్ట్ చేశాను. తొలి 10-15 నిమిషాలు ఆయన మైండ్ ఇక్కడ లేదని అర్థమైంది. ఎందుకంటే ఆ.. ఆ.. అంటున్నారు. అప్పుడే ఆఫీస్ బాయ్ వచ్చి సమోసా ఇచ్చాడు. అప్పుడు ఓవైపు సమోసా తింటున్నారు.. మరోవైపు ఫోన్ ను చెక్ చేస్తున్నారు.. ఇంకోవైపు నా స్టోరీ కూడా వింటున్నారు" అని పేర్కొన్నారు.

"అప్పుడు ఏదో క్వశ్చన్ అడుగుతారని నేను అనుకున్నా. కానీ సమోసా కావాలని ఆఫీస్ బాయ్ ను అడిగారు. అతడు మరో సమోసా తీసుకురాగా.. రెండు తినేశారు. ఆ తర్వాత ఏం చెబుతున్నావో ఏం ఎక్కడం లేదు.. నేను బయటకు వెళ్లాలి.. వెళ్లిపోవచ్చా.. మళ్లీ కలుస్తా అని అన్నారు. అప్పుడు స్టోరీ పూర్తి చెప్పి ఉంటే బాగుండేదని మేం అనుకున్నాం" అంటూ గుర్తు చేసుకున్నారు.

"అయితే మా ఆఫీస్ బాయ్ బాగా డిస్సపాయింట్ అయ్యాడు. మన ఆఫీస్ లో ఒకరికి ఒక సమోసా కదా.. ఆయన రెండు తిన్నారు.. కానీ స్టోరీ వినలేదని అన్నాడు. ఆ తర్వాత నేను చాలా సార్లు ట్రై చేశాను. వర్కౌట్ కాలేదు. అలా మళ్లీ రావా సినిమా అవ్వలేదు. ఇప్పుడు కింగ్డమ్ స్టోరీతో వచ్చి కలిశా. ఇన్నేళ్లకు ఈ సినిమాతో కలిశాం" అని గౌతమ్ తిన్ననూరి తెలిపారు.

Tags:    

Similar News