నా అన్వేష్ కామెంట్స్.. గరికపాటి కౌంటర్.. ఏమన్నారంటే..

తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్లకు తన అభిమానులే గట్టిగా సమాధానం చెబుతున్నారని గరికపాటి వారు ధీమా వ్యక్తం చేశారు.;

Update: 2026-01-02 09:52 GMT

సోషల్ మీడియా వేదికగా సాగుతున్న కొన్ని వివాదాలు ఇప్పుడు పరాకాష్టకు చేరుకున్నాయి. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ట్రోలింగ్, ఆయనపై కొందరు వ్యక్తులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ఎంతో ఘాటుగా స్పందించారు. రీసెంట్ గా యూట్యూబర్ నా అన్వేష్ పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే గరికపాటి గారు పేరు ఎత్తకుండానే కామెంట్ చేసే వారందరికీ కౌంటర్ ఇచ్చారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తులపై బురద జల్లడం ఒక ఫ్యాషన్ గా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూనే, తప్పు చేసే వారికి ఎలా బుద్ధి చెప్పాలో స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.

ముఖ్యంగా ధర్మానికి, వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలపై ఆయన మాట్లాడుతూ.. ఒక నేరస్తుడికి పదేళ్ల శిక్ష పడినా వాడు మారతాడో లేదో చెప్పలేం కానీ, పదిమంది కలిసి ఒక వ్యక్తిని ఈసడించుకుంటే వాడు పది రోజుల్లోనే మారిపోతాడని అభిప్రాయపడ్డారు. తప్పు చేసే వారు వీధుల్లోకి రావాలంటే భయపడేలా సమాజం స్పందించాలని, అప్పుడే మార్పు సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మచ్చ లేని వ్యక్తులపై బురద జల్లడం, వారిని అవమానించడం వంటి చర్యలను సమాజం ఎంతకాలం సహిస్తుందని ప్రశ్నించారు. మనం ఎందుకులే అని మౌనంగా ఉండటం వల్లే ఇలాంటి కవ్వింపు చర్యలు ఎక్కువవుతున్నాయని, ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు.

తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్లకు తన అభిమానులే గట్టిగా సమాధానం చెబుతున్నారని గరికపాటి వారు ధీమా వ్యక్తం చేశారు. "నా విషయంలో నా అభిమానులు ఎప్పుడూ సహించలేదు, ఎప్పుడు పెట్టాల్సిన రేవు అప్పుడు పెడుతూనే ఉన్నారు" అని ఆయన ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పారు. సోషల్ మీడియా కామెంట్ల యుద్ధంలో కూడా ధర్మానికి కట్టుబడిన వారే పైచేయి సాధిస్తున్నారని, శత్రుపక్షం వారు పారిపోయేలా తన ఫ్యాన్స్ స్పందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ధర్మానికి మద్దతుగా నిలబడే ప్రతి ఒక్కరికీ ఆయన శిరస్సు వంచి నమస్కరిస్తూ అభినందనలు తెలిపారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటాన్ని, ఏది పడితే అది నమ్మడాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, అలా కట్టుబడినప్పుడే ధర్మం నిలబడుతుందని ఆయన గట్టిగా చెప్పారు. ఈ విషయంలో తనకు ఎలాంటి మొహమాటం లేదని, ధర్మం వైపు నిలబడే వారే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.

గరికపాటి వారి స్పందనతో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారికి ఒక హెచ్చరిక వెళ్ళినట్లయింది. ఆయన టెక్నికల్ టీమ్ కూడా ఇప్పటికే అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై లీగల్ చర్యలకు సిద్ధమైంది. ఒకరి వ్యక్తిగత గౌరవాన్ని కించపరిచేలా ప్రవర్తిస్తే చట్టపరమైన పరిణామాలు ఎలా ఉంటాయో చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మరోసారి గరికపాటి కామెంట్స్ వైరల్ గా మారాయి.




Tags:    

Similar News