ఫిలింఛాంబర్ (X) ఫెడరేషన్: వివాదం చినికి చినికి గాలివాన
30శాతం భత్యం పెంపు నియమాన్ని అమలు చేస్తేనే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల కోసం పని చేస్తామని ఫెడరేషన్ (కార్మిక సంఘాల ఐక్య సమాఖ్య) అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే.;
30శాతం భత్యం పెంపు నియమాన్ని అమలు చేస్తేనే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల కోసం పని చేస్తామని ఫెడరేషన్ (కార్మిక సంఘాల ఐక్య సమాఖ్య) అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాలతో ముంబై నుంచి కార్మికులను దిగుమతి చేసుకోవడంపైనా ఫెడరేషన్ గుర్రుగా ఉందని సమాచారం. ఆ మేరకు సోమవారం నుంచి కొన్ని పెద్ద సినిమాల షూటింగులకు అంతరాయం ఏర్పడిందని కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ, మహేష్- రాజమౌళి SSMB29, ఎన్బీకే- బోయపాటి అఖండ 2 వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. ప్రభాస్ రాజా సాబ్ షూట్ చివరి అంకంలో ఉంది. ఇలాంటి సమయంలో కార్మికుల మెరుపు సమ్మె ఆయా పెద్ద సినిమాలకు తీవ్ర ఆటంకంగా మారిందని కథనాలొస్తున్నాయి.
నైపుణ్యం లేకపోతే అంతే సంగతి:
పెద్ద సినిమాలకు నాణ్యమైన ఉత్పత్తిని అందించాలంటే, సెట్లో పని చేసేవారంతా కచ్ఛితంగా సుశిక్షితులైన వారై ఉండాలి. కార్మికులు అయినా కానీ, నైపుణ్యం ఉన్నపుడే ఎలాంటి కొత్త సమస్యా తలెత్తకుండా పని చేయగలరు. కానీ ఇప్పుడు ఫెడరేషన్ సమ్మె కారణంగా ఈ పరిస్థితి కనిపించడం లేదు. సెట్స్ పై ఉన్న సినిమాలన్నీ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్టు కథనాలొస్తున్నాయి.
ధిక్కరించడానికి వీల్లేదు:
ఫెడరేషన్ అధికారికంగా సమ్మె ప్రకటించినప్పుడు మెంబర్ షిప్స్ ఉన్న ఏ కార్మికుడు పని చేయడానికి వీల్లేదు. సంఘాల నాయకులను ధిక్కరించి ముందుకు సాగలేరు. అందువల్ల విధిగా పెద్ద సినిమాల నిర్మాతలు కార్మికుల కోసం ఇప్పుడు ఇతర మార్గాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. అదే క్రమంలో ఇరుగు పొరుగు భాషల నుంచి కార్మికులను రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయని కూడా ఫెడరేషన్ ఆరోపిస్తోంది.
మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్!
అయితే కార్మిక సంఘాలతో మాటల్లేవ్, మాట్లాడుకోడాల్లేవ్! అంటూ ఫిలింఛాంబర్ పట్టు వీడకపోవడం చర్చనీయాంశంగా మారింది. వేతన పెంపునకు నిరాకరించడమే గాక, నైపుణ్యం ఉండి అసోసియేషన్లలో సభ్యత్వాలు లేని కార్మికులకు అవకాశాలు కల్పిస్తామంటూ ఛాంబర్ ఒక అధికారిక నోట్ ని రిలీజ్ చేయడం హాట్ టాపిగ్గా మారింది. అంతేకాదు.. కార్మిక సంఘాల్లో సభ్యత్వం పేరుతో లక్షల్లో వర్కర్స్ నుంచి దోపిడీ చేస్తున్నారని, నిపుణులకు అలాంటి అవసరం లేదని కూడా ఫిలింఛాంబర్ అధికారిక నోట్ లో ఆరోపించడం చర్చగా మారింది. అంతేకాదు లేబర్ కమీషన్ నుంచి అనుమతులు ఉన్నాయి.. అసోసియేషన్ల నుంచే కార్మికులను తీసుకోవాలని రూల్ ఏమీ లేదనే అర్థంలో కూడా ఛాంబర్ హెచ్చరించడం ఇక్కడ పరిశీలించదగినది.
రిలీజ్ కి వచ్చే వారికి ఇబ్బందే:
తాజా పరిణామాలతో రానున్న రెండు నెలల్లో రిలీజ్ లకు రెడీ అవుతున్న కొన్ని సినిమాలు ఇబ్బందుల్లో పడినట్టేనని విశ్లేషిస్తున్నారు. రామ్ నటిస్తున్న `ఆంధ్రా కింగ్ తాలూకా` యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి సకాలంలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నందున, ఫెడరేషన్ నియమానికి అంగీకరించిందని కూడా టాక్ వినిపిస్తోంది. పెండింగ్ పనుల్లో ఉన్న ఇతర నిర్మాతలు కూడా ఫెడరేషన్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలుందని గుసగుస వినిపిస్తోంది. అయితే కొందరు అగ్రనిర్మాతలు మాత్రం, 30 శాతం పెంపునకు అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. అలాంటి వారికి తక్షణం ఇబ్బంది ఎదురవ్వొచ్చని ప్రముఖ నిర్మాత వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరేషన్ నుంచి కాకుండా, ఏపీ, తెలంగాణలో నిపుణులైన సినీకార్మికులను రప్పించడం అనేది అసాధ్యమని కూడా విశ్లేషిస్తున్నారు. సరిపడినంత మంది నైపుణ్యం ఉన్న కార్మికులు ప్రస్తుతానికి అందుబాటులో లేరు. వృత్తిగత నైపుణ్యం లేకుండా సెట్స్ లో డ్రామాలాడటం చాలా సమస్యల్ని కొని తెస్తుందని కూడా ఆయన విశ్లేషించారు.