వేదికపై భార్యా భర్తలు ఎమోషనల్.. నా లవర్, సర్వస్వం అంటూ భర్తకు ముద్దు!
`బిచ్చగాడు` చిత్రంతో నటుడిగా గొప్ప గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత తెలుగు పరిశ్రమలోను మార్కెట్ అందుకున్నారు విజయ్ ఆంటోని.
`బిచ్చగాడు` చిత్రంతో నటుడిగా గొప్ప గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత తెలుగు పరిశ్రమలోను మార్కెట్ అందుకున్నారు విజయ్ ఆంటోని. అతడు ప్రతి సినిమాతో కంటెంట్ పరంగా ప్రయోగాలకు వెనకాడడనే మంచి గుర్తింపు ఉంది. దీనికి మించి జీవితంలో అతడు ఇంకా ఎన్నో ప్రయోగాలు చేసాడు. రిస్కీ అని తెలిసినా సినిమా నిర్మాతగాను అతడు తన ప్రయత్నాలను ఆపలేదు. తన భార్య ఫాతిమాను నిర్మాతగా మార్చి తన ఎదుగుదలలో ఒక భర్తగా అతడు చేస్తున్న సహకారాన్ని మర్చిపోలేము.
వీటన్నిటినీ మించి విజయ్ ఆంటోని- ఫాతిమా దంపతులు తమ ఇంటి వెలుగు అయిన కుమార్తెను కోల్పోయి పుట్టెడు దుఃఖాన్ని అనుభవించారు. అది వారి జీవితంలో ఊహించని ఒక పెద్ద గ్లిచ్.. రెండేళ్ల క్రితం విజయ్ ఆంటోని షూటింగ్ లో తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొని మృత్యుంజయుడు అయ్యాడు. దానిని ఆ కపుల్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత కూడా ఇంకా తమను గుర్తుంచుకుని ఆదరిస్తున్నందుకు ఫాతిమా తెలుగు ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని కొత్త మూవీ `వంద దేవుళ్ళు` ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆయన భార్య ఫాతిమా భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఈ ప్రచార వేదికపై తన భర్త గురించి మాట్లాడుతూ తీవ్రంగా ఎమోషనల్ అయిన ఫాతిమా విజయ్ తనకు భర్త మాత్రమే కాదని లవర్ కూడా అంటూ బుగ్గపై ముద్దు ఇచ్చారు. నాకు తండ్రి, తమ్ముడు, అన్న ఎవరూ లేరు.. అన్నీ విజయ్ అని ఎమోషనల్ కాగా, ఆ సమయంలో భర్త విజయ్ కూడా ఎమోషన్ కి గురయ్యారు. తనను నిర్మాతను చేసి విజయ్ ఎంతో సహకారం అందించారని తెలిపారు. ఈ వేదికపై అతిథి నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. బిచ్చాగాడు చిత్రం కంటే వంద దేవుళ్లు పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రామాంజనేయులు జువ్వాజీ నిర్మించారు. ఈనెల 19న సినిమా థియేటర్లలోకి విడుదల కానుంది.
విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన `వంద దేవుళ్లు` (తమిళంలో `రత్తం`) చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. దర్శకుడు శశి ఈ కథను చెప్పినప్పుడు ఎమోషనల్ అయ్యానని తెలిపారు. ఇది సమాజంలో జరిగే ఒక తీవ్రమైన సమస్య చుట్టూ తిరిగే కథ అని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో సోషల్ మీడియా, కొన్ని వ్యవస్థలు సాధారణ ప్రజల ఆలోచనలను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నాయనే అంశాన్ని ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా చూపించామని చెప్పారు. దర్శకుడు ఈ కథను ఎంతో పరిశోధించి ప్రేక్షకులు ఆలోచించే విధంగా అద్భుతంగా తెరకెక్కించారని విజయ్ ఆంటోని ప్రశంసించారు. ఈ సినిమాలో తన పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందని, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.
తాను ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ఎంచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తానని, `వంద దేవుళ్లు` కూడా ఆ కోవకు చెందినదేనని అన్నారు. ఈ చిత్రం కేవలం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే కాదని... దీని వెనుక ఒక మంచి సామాజిక సందేశం కూడా దాగి ఉందని వివరించారు.