స్టార్‌డమ్ కంటే కుటుంబ సంతోషమే మిన్న!
1990వ దశకం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విలక్షణమైన కాలం. ఆ రోజుల్లో ఒకే ఒక్క భారీ విజయం కొత్త నటిని రాత్రికి రాత్రే సంచలనంగా మార్చేసేది.
1990వ దశకం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విలక్షణమైన కాలం. ఆ రోజుల్లో ఒకే ఒక్క భారీ విజయం కొత్త నటిని రాత్రికి రాత్రే సంచలనంగా మార్చేసేది. అలా 1992లో విడుదలైన `జాన్ తేరే నామ్` చిత్రంతో అరంగేట్రం చేసిన ఫర్హీన్ ఖాన్ (ప్రస్తుతం ఫర్హీన్ ప్రభాకర్) కూడా అప్పట్లో ఓ వెలుగు వెలిగారు. ప్రముఖ నటి మాధురీ దీక్షిత్‌తో ఆమెకున్న పోలికల కారణంగా చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు కూడా ఆమెను మాధురి `లుక్‌అలైక్` అని పిలిచేవారు. భవిష్యత్తులో పర్భీన్ బాలీవుడ్‌ను ఏలుతుందని నాటి ట్రేడ్ వర్గాలు సైతం అంచనా వేశారు.
పర్హీన్ కెరీర్ ప్రారంభమైన వెంటనే షారుఖ్ ఖాన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన `బాజీగర్` చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం వచ్చింది. అయితే అదే సమయంలో తమిళంలో కమల్ హాసన్ సరసన `కలైజ్ఞన్` చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఆమె `బాజీగర్` సినిమాను తిరస్కరించారు. ఆ తర్వాత శిల్పా శెట్టి నటించిన `బాజీగర్` చిత్రం బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయం సాధించగా.. ఫర్హీన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళ చిత్రం మాత్రం నిరాశపరిచింది. కెరీర్ ఆరంభంలో తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం భవిష్యత్తు దిశను ఎలా మారుస్తుందో? చెప్పడానికి ఈ సంఘటన పెద్ద ఉదాహరణ.
ఆ తర్వాత పర్హీన్ హిందీ -దక్షిణాది సినిమాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి `సైనిక్`, `దిల్ కీ బాజీ`, `నజర్ కే సామ్నే` వంటి చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. వీటితో పాటు `అగ్ని ప్రేమ్`, `ఫౌజ్`, `తహకీకాత్` వంటి చిత్రాలు ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గవిగా నిలిచాయి. వైవిధ్యమైన పాత్రలతో పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి పర్హీన్ నిరంతరం ఎంతో శ్రమించారు.
వృత్తిపరమైన జీవితం ఇలా సాగుతుండగా.. మాజీ భారత క్రికెటర్ మనోజ్ ప్రభాకర్‌తో ప్రేమలో పడ్డారు. వీరి పరిచయం వివాహ బంధానికి దారితీసింది. పెళ్లి తర్వాత పర్హీన్ గ్లామర్ ప్రపంచానికి దూరంగా జరిగి, కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వెండితెర వెలుగుల కంటే గృహిణిగా తన భర్త, ఇద్దరు కుమారులు రాహిల్, మానవన్ష్‌లతో కలిసి ఢిల్లీలో ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికే మొగ్గు చూపారు.
ఇలా సుదీర్ఘ కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఫర్హీన్ ఇటీవలే జాన్ అబ్రహం నటించిన `ది డిప్లొమాట్` చిత్రం తో మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ఈ సినిమాలో నటుడు కుముద్ మిశ్రా భార్యగా ఒక చిన్న పాత్రను కూడా పోషించారు. అయితే దురదృష్టవశాత్తూ ఈ సినిమా నిడివి , కథా గమనాన్ని సర్దుబాటు చేసే క్రమంలో ఎడిటింగ్‌లో ఆమె నటించిన సన్నివేశాలన్నీ తొలగించారు. ఎంతో కాలం తర్వాత స్క్రీన్ పై కనిపించాలనుకున్న నటికి కొంత నిరాశ కలిగించే విషయమే.
ప్రస్తుతం ఫర్హీన్ ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా ఢిల్లీలో కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో పెద్ద స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ స్టార్‌డమ్ కంటే కుటుంబ సంతోషమే మిన్న అని భావించిన ఆమె ప్రయాణం నిజంగా ఆసక్తికరమైనదే. 90ల నాటి నటీమణుల జీవితాలు, వారి ప్రాధాన్యతలు నేటి తరానికి భిన్నంగా ఎలా ఉండేవో చెప్పడానికి ఫర్హీన్ చక్కని నిదర్శనం.