అమెరికాలో మనోళ్ల అతి.. ఇకనైనా ఆపకపోతే ప్రమాదమే
విదేశాల్లో ఉన్న భారతీయ యువత ఇటీవల కాలంలో మన సినిమాల రిలీజ్ లకు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.;
విదేశాల్లో ఉన్న భారతీయ యువత ఇటీవల కాలంలో మన సినిమాల రిలీజ్ లకు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఫ్యానిజం అనే పేరుతో అమెరికాను సైతం అమలాపురంలా మార్చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో పెద్ద సినిమాల రిలీజ్ టైమ్ లో డాలస్ నగరంలో జరిగింది ఇదే. నచ్చిన హీరో సినిమా రిలీజ్ ఉందంటే చాలు.. ఓ గ్యాంగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంతా డ్రెస్ కోడ్ ధరించి రోడ్లపై డ్యాన్సులు, టపాకాయలు కాల్చడం, థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. తెలుగు, కన్నడ అనేం కాదు. అన్ని రాష్ట్రాల యువతది దాదాపు ఇలాగే ఉంది పరిస్థితి.
థియేటర్ హాలులో ఫ్యాన్స్ గోల భరించలేక కొన్ని కొన్ని సినిమాల స్క్రీనింగ్ ను మధ్యలోనే ఆపేసిన వీడియోలు అనేకం వచ్చాయి. సినిమాలకే కాదు.. పండగలు, రాజకీయ పార్టీల సెలబ్రేషన్లు కూడా ఎక్కడా తగ్గేదేలే అంటూ అదే రీతిలో సంబరాలు జరుపుకుంటున్నారు. మనోళ్ల ఇలాంటి బిహేవియర్ తో అక్కడి లోకల్ పౌరులకే కాదు, మనోళ్లకు కూడా చిరాకు పుట్టిస్తుంది.
ఇలాంటివి మన యువత ప్రవర్తనకు ఉదాహరనగా నిలుస్తున్నాయి. అమెరికాలో సెటిల్ అయిన మన దేశ పౌరులు కూడా యువత ఇలా ప్రవర్తిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి ఏ విధమైన పరిణామాలకు దారి తీస్తాయో అని ఆందోళన పడుతున్నారు. పైపెచ్చు రీసెంట్ గా తెలుగు కుర్రాడిని గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపడం లాంటి ఘటనలు కూడా టెన్షన్ కు గురి చేస్తున్నాయి.
ఇప్పటికైనా మన అక్కడున్న మన తెలుగు సొసైటీ సీనియర్లు, సెటిలర్లు దీనిపై దృష్టి సారించి ఇలాంటి వాటిని కట్టడి చేసే చర్యలు తీసుకోవాల్సి ఉంది. పండగల సెలబ్రేషన్స్, సినిమా ఈవెంట్ లాంటివి ఉంటే.. తగిన జాగ్రత్తలు తీసుకొని క్రమశిక్షణతో ఉండేలా డాలస్ ఉన్న తెలుగువాళ్లు ప్రయత్నాలు చేయాలి. మళ్లీ మనోళ్లు అంటే డిసిప్లేన్ కు మారుపేరు అనే విధంగా మార్చేందుకు ప్రయత్నాలు కొనసాగించాలి.
మరో వారంలో దీపావళి పండుగ రానుంది. ఇంకేముందు మనోళ్లు అస్సలు ఆగరు. రోడ్డపైకి వచ్చి భారీగా టపాకాయలు కాల్చుతూ, సంబరాలు చేసుకుంటారు. తమ చేష్టలతో ఆక్కడి అమెరికా పౌరులకు చిరాకు తెప్పిస్తారు. అందుకే ఇలాంటి సెలబ్రేషన్స్ పేరిట ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్లపై మన సీనియర్ కమ్యూనిటీలు ఓ లుక్కేయాలి. మరీ ముఖ్యంగా కులాల పేరుతో వివాదాలు, రెచ్చగొట్టే స్లోగన్లు చేసే వారిపైనా చర్యలు తీసుకోవాలి. సంప్రదాయ పండగల సంబరాలు చేసుకునే క్రమంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ.. ఎవరికీ ఇబ్బంది కలుగకుండా చూసే ప్రయత్నాలు జరగాలి.