మార్కెట్‌లో కొత్త మోసాలు, ఇద్దరు హీరోయిన్స్ బలి...!
మారుతున్న టెక్నాలజీతో పాటు మోసాలు, నేరాలు సైతం మారుతూ వస్తున్నాయి. నేరగాళ్లు, మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.;
మారుతున్న టెక్నాలజీతో పాటు మోసాలు, నేరాలు సైతం మారుతూ వస్తున్నాయి. నేరగాళ్లు, మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అంది వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుని మోసాలకు పాల్పడటం అనేది ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ ఏ స్థాయిలో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిజిటల్ అరెస్ట్, ఆన్ లైన్ మోసాలు ఇలా చాలానే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సెలబ్రిటీల పేర్లు చెప్పి మోసాలకు పాల్పడటం జరుగుతోంది. హీరోయిన్స్ ఫేస్ తో వాట్సప్ క్రియేట్ చేసి, కొందరిని సంప్రదించి వారి నుంచి డబ్బు లాగడం వంటివి చేస్తున్నారు. హీరోయిన్స్ ఫేస్ తో ఉంటే వెంటనే జనాలు కనెక్ట్ అవుతారు అనేది వారి అభిప్రాయం కావచ్చు అందుకే మోసగాళ్లు హీరోయిన్స్ ఫోటోలను డీపీలుగా పెట్టి చాటింగ్ చేయడం మొదలు పెట్టి, మెల్లగా మోసాలకు పాల్పడుతున్నారు.
అదితి రావు హైదరి పేరుతో వాట్సప్...
కొన్ని రోజుల క్రితం హీరోయిన్ అదితి రావు హైదరి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో తన పేరుతో మోసగాళ్లు వాట్సప్ క్రియేట్ చేసి చాటింగ్ చేస్తున్నారు, డబ్బులు వసూళ్లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోటో షూట్ పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి నుంచి జాగ్రత్తగా ఉండండి. నా పేరుతో ఉన్న ఈ అకౌంట్ ను నమ్మవద్దు. అసలు ఆ వాట్సప్ నెంబర్ నాది కాదు. ఇంకా మరెవ్వరైనా ఇలా తన పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి, తెలియని నెంబర్ నుంచి మెసేజ్ చేస్తే తప్పకుండా జాగ్రత్తగా ఉండండి అంటూ తన ఫాలోవర్స్ తో పాటు అందరికీ సూచించింది. అదితి రావు హైదరి పేరుతో వాట్సప్ క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా డీపీగానూ ఆమె ఫోటోను పెట్టడంతో చాలా మంది అప్పటికే మోసపోయినట్టు తెలుస్తోంది. అయితే ఎక్కడ కూడా ఫిర్యాదు నమోదు కాలేదని సమాచారం.
శ్రియా సరన్ పేరుతో వాట్సప్...
అదితి రావు హైదరి పేరుతో ఎలా అయితే వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారో అలాగే ఇప్పుడు సీనియర్ హీరోయిన్ శ్రియ సరన్ పేరుతోనూ వాట్సప్ క్రియేట్ చేసి ఫోటో షూట్స్ పేరుతో కొందరిని సంప్రదించడం జరిగిందట. ఫోటో షూట్స్ కోసం సంప్రదించినట్లు సంప్రదించి మెల్లగా డబ్బులు గుంజే ప్లాన్ చేశారు అనేది టాక్. శ్రియ సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరుతో ఉన్న వాట్సప్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరు చేసిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. అదే విధంగా మరికొందరు హీరోయిన్స్ పేర్లతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. దాంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఇండస్ట్రీ వర్గాల వారు, పోలీస్ వర్గాల వారు ముందస్తుగా జనాలను హెచ్చరిస్తున్నారు.
సైబర్ క్రైమ్ జాగ్రత్త...
సెలబ్రిటీల పేరు పెట్టుకుని మోసాలకు పాల్పడటం కొత్తేం కాదు. కానీ ఇప్పుడు కొత్తగా ఇలా వాట్సప్ ద్వారా మోసాలకు పాల్పడటం అనేది కొత్తగా ఉందని, అందుకే జనాలు వెంటనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది పోలీసు వర్గాల మాట. ఆన్ లైన్ ద్వారా ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే స్పందించకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. పెరిగి పోతున్న సైబర్ క్రైమ్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా మీరు మోసపోకుండా ఉంటారు. కనుక ఏదో సైబర్ క్రైమ్, ఎక్కడో జరిగింది అని కాకుండా ప్రతి విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సైబర్ క్రైమ్ ఎన్ని విధాలుగా జరుగుతుంది, ఎన్ని రకాలుగా ఈ క్రైమ్ లు జరుగుతున్నాయి అనే విషయాలు తెలుసుకోవడం ద్వారా, మోసగాళ్ల బుట్టలో మీరు పడకుండా ఉంటారు.