పైరసీ ఎఫెక్ట్.. టెక్నాలజీతోనే అడ్డుకోవాలి!
ఈ నేపథ్యంలో టెక్ నిపుణులు విశ్లేషకులు ఇండస్ట్రీకి కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. పోలీసులను నమ్ముకోవడం కంటే, టెక్నాలజీని నమ్ముకోవడమే ఇప్పుడున్న ఏకైక మార్గం అని వారు అభిప్రాయపడుతున్నారు.;
ఐబొమ్మ రవి అరెస్ట్ తో ఇండస్ట్రీలో పైరసీ మీద చర్చ మళ్ళీ మొదలైంది. ఒక వ్యక్తిని పట్టుకుంటే సమస్య తీరుతుందా? అని కొందరు ప్రశ్నిస్తుంటే, అసలు టెక్నాలజీని వాడుకుని ఇంత పెద్ద స్కామ్ ఎలా చేశాడనేది మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో టెక్ నిపుణులు విశ్లేషకులు ఇండస్ట్రీకి కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. పోలీసులను నమ్ముకోవడం కంటే, టెక్నాలజీని నమ్ముకోవడమే ఇప్పుడున్న ఏకైక మార్గం అని వారు అభిప్రాయపడుతున్నారు.
ఓ నెటిజన్ ఈ విషయంపై స్పందిస్తూ, "ఒక వ్యక్తి మీ హార్డ్ డిస్క్ లను హ్యాక్ చేసి, కంటెంట్ ను పబ్లిక్ లోకి వదులుతున్నాడంటే, అది అతని తెలివితేటలు మాత్రమే కాదు, మీ టెక్నాలజీ లోపం కూడా" అని వ్యాఖ్యానించారు. టెక్నాలజీని ఉపయోగించి దొంగతనం చేస్తున్నప్పుడు, దాన్ని అడ్డుకోవడానికి కూడా టెక్నాలజీనే వాడాలి తప్ప, పోలీసుల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదని హితవు పలికారు.
హాలీవుడ్ లో కూడా పైరసీ సమస్య ఉంది, కానీ అక్కడ అది ఇంత తీవ్రంగా లేదు. కారణం.. వారు టెక్నాలజీలో పెట్టుబడి పెడతారు. "మీరు సినిమాల మీద వందల కోట్లు ఖర్చు చేస్తారు, కానీ అందులో ఒక 5, 10 శాతం బడ్జెట్ ని డిజిటల్ సెక్యూరిటీ మీద ఎందుకు పెట్టరు?" అని ప్రశ్నిస్తున్నారు. డిజిటల్ వాటర్ మార్కింగ్ వంటి టెక్నాలజీని వాడితే, లీక్ ఎక్కడి నుంచి అయ్యిందో వెంటనే కనిపెట్టవచ్చని సూచిస్తున్నారు.
నిర్మాతలు తమ సినిమాలను కాపాడుకోవడానికి పోలీసుల మీద ఆధారపడటం మానేసి, సొంతంగా టెక్నికల్ టీమ్స్ ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సినిమాకు ఒక 'యాంటీ పైరసీ' వింగ్ ఉండాలి. సర్వర్లను ఎలా సెక్యూర్ చేసుకోవాలి, ఎన్‌క్రిప్షన్ ఎలా వాడాలి అనే విషయాలపై అవగాహన పెంచుకోవాలి. లేదంటే టెక్నాలజీ తెలిసిన ప్రతివాడు రేపు పొద్దున ఐబొమ్మ రవి లాగా తయారయ్యే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి.
కేవలం చట్టాలు, అరెస్టులతో ఈ 'డిజిటల్ దొంగతనాన్ని' ఆపలేం. ఎందుకంటే ఇంటర్నెట్ కు సరిహద్దులు లేవు. ఒక సైట్ బ్లాక్ చేస్తే మరో పది పుట్టుకొస్తాయి. అందుకే మూలంలోనే సమస్యను పరిష్కరించాలి. కంటెంట్ లీక్ అవ్వకుండా అడ్డుకట్ట వేయగలిగితేనే పైరసీని అంతం చేయగలం అని మరికొందరు చెబుతున్నారు.