మలయాళ ఇండస్ట్రీ నుంచి మరో గొప్ప సినిమా
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లకు పిల్లలు బాగా అలవాటైపోతున్నారు. మరీ ముఖ్యంగా పిల్లలకు ఫోన్ పిచ్చి పట్టుకుంది.;
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లకు పిల్లలు బాగా అలవాటైపోతున్నారు. మరీ ముఖ్యంగా పిల్లలకు ఫోన్ పిచ్చి పట్టుకుంది. ఈ ఫోన్ల వాడకం చిన్న పిల్లల ఆరోగ్యంపై చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తోంది. పిల్లలు గొడవ చేస్తారనో లేదంటే అస్తమానం వారిని చూసుకునే ఓపిక లేకనో తల్లిదండ్రులు పిల్లలకు చాలా వయసులోనే మొబైల్ ఫోన్లను అలవాటు చేస్తున్నారు.
రాన్రానూ ఇది చాలా పెద్ద సమస్యలా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ ను విపరీతంగా వాడటం వల్ల పిల్లలు దానికి బానిసలా మారుతున్నారు. పిల్లలు ఆ ఫోన్లకు ఎంతలా బానిసలవుతున్నారంటే ఫోన్ లేకపోతే తినడం కూడా మానేసే అంతగా. ఇలా చేయడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం చాలా ప్రమాదకరంగా మారుతుంది. అయితే ఏ వస్తువు వల్ల అయినా లాభాలూ, నష్టాలూ రెండూ ఉంటాయి.
ఏదో కాసేపు ఫోన్ చూడటం, దాన్ని పక్కన పెడితే బాగానే ఉంటుంది. లేదంటే అందులో ఉండే ఇన్ఫర్మేషన్ ను నేర్చుకోవడానికి ఫోన్ ను వాడినా ప్రయోజనమే అలా కాకుండా పనికిమాలిన వీడియోలు, కంటెంట్ చూస్తే పిల్లలు నాశనమవడం తప్ప ఏమీ ప్రయోజనముండదు. తాజాగా ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ మలయాళ డైరెక్టర్ రేవతి ఎస్ వర్మ ఈ వలయం అనే సినిమాను తీశారు.
రియల్ లైఫ్ కు చాలా దగ్గరగా ఉండే సినిమాలను తెరకెక్కించే మలయాళ ఇండస్ట్రీ ఈ వలయం సినిమాను కూడా ఎంతో గొప్పగా తెరకెక్కించారు. జూన్ 13న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలొచ్చాయి. రియల్ లైఫ్ కు దగ్గరగా ఉన్న కథ కావడంతో ఆడియన్స్ కూడా ఈ వలయం మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. డ్రగ్స్ కు అలవాటు పడితే ఎంత ప్రమాదమో, సెల్‌ఫోన్ కు అలవాటు పడినా అంతే డేంజర్ అనే నేపథ్యంలో తీసిన ఈ సినిమా అందరినీ మెప్పిస్తోంది. డిజిటల్ గ్యాడ్జెట్స్ అలవాటైతే ఎంత డేంజరో చెప్తూ తీసిన ఈ మూవీకి కేరళ ప్రభుత్వం ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ నుంచి కూడా మినహాయింపునిచ్చింది. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమాను ఇతర సౌత్ భాషల్లోకి కూడా డబ్ చేసి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.