మా ఇద్దరికీ చాలా పోలీకలున్నాయి
దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎంతో మంది అమ్మాయిలకు రాకుమారుడు ఈయన.;
దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎంతో మంది అమ్మాయిలకు రాకుమారుడు ఈయన. మలయాళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దుల్కర్. ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన దుల్కర్ అప్పట్నుంచి తన ప్రతీ సినిమానూ తెలుగులోకి డబ్ చేస్తూ వస్తున్నారు.
టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న దుల్కర్
తెలుగులో తనకు మంచి ఆదరణ ఉందని గుర్తించిన దుల్కర్ మహానటి సినిమాలో జెమినీ గణేషన్ గా జీవించి ఎంతో మందిని మెప్పించారు. తర్వాత సీతారామం సినిమాతో రామ్ గా ఎంతో మంది మనసుల్ని గెలుచుకున్న దుల్కర్, రీసెంట్ గా లక్కీ భాస్కర్ తో మరో మంచి సక్సెస్ ను అందుకుని సక్సెస్‌ఫుల్ గా దూసుకెళ్తున్నారు. అయితే ఓ వైపు హీరోగా నటిస్తూనే దుల్కర్ తన బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తారనే విషయం తెలిసిందే.
సూపర్ హిట్ గా దూసుకెళ్తున్న కొత్త లోక
తాజాగా దుల్కర్ తన సొంత బ్యానర్ అయిన వేఫేరర్ ఫిల్మ్స్ లో కొత్త లోక అనే సినిమాను తెరకెక్కించగా ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచి మంచి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించగా అందులో దుల్కర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆ హీరోయిన్ నాకు చెల్లి
దుల్కర్ లాంటి అందమైన హీరో ఓ హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఆమె తన చెల్లి లాంటిదన్నారు. కొత్త లోక హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తనకు చెల్లి లాంటిదని, గత జన్మలో తామిద్దరూ ట్విన్స్ గా పుట్టి ఉంటామని అన్నారు. తనకు, కళ్యాణికి సేమ్ వర్రీస్, సేమ్ ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయని, చాలా విషయాల్లో ఇద్దరం సిమిలర్ గా ఉంటామని దుల్కర్ చెప్పగా ఇప్పుడాయన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక కొత్త లోక సినిమా విషయానికొస్తే డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 28న రిలీజైంది. ఫస్ట్ షో నుంచే ఈ మూవీకి మంచి టాక్ రాగా, మొదటి రోజే కొత్త లోక రూ.2.7 కోట్లు కలెక్ట్ చేసింది. సుమారు రూ.30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాల్ని తెచ్చిపెట్టింది.