'దృశ్యం-3' మూవీ రివ్యూ
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో 'దృశ్యం' కచ్చితంగా ఉంటుంది. దానికి కొనసాగింపుగా వచ్చిన 'దృశ్యం-2' సైతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
'దృశ్యం-3' మూవీ రివ్యూ
నటీనటులు: మోహన్ లాల్- మీనా- అన్సిబా హసన్- ఎస్తేర్ అనిల్- సిద్దిఖ్- ఆశా శరత్- శాంతి మాయాదేవి- మురళీ గోపి- బిజు మీనన్ తదితరులు
సంగీతం: అనిల్ జాన్సన్
ఛాయాగ్రహణం: సతీశ్ కురుప్
నిర్మాత: ఆంటోనీ పెరుంబవూర్
రచన-దర్శకత్వం: జీతు జోసెఫ్
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ‘దృశ్యం’ కచ్చితంగా ఉంటుంది. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం-2’ సైతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా రెడీ అయింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘దృశ్యం-3’ విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ: తన కుటుంబం చేతిలో హతమైన వరుణ్ మృతదేహాన్ని మాయం చేసి ఆ కేసు నుంచి తెలివిగా బయటపడ్డ జార్జి కుట్టి (మోహన్ లాల్).. రెండోసారి పోలీసులను బోల్తా కొట్టిస్తాడు. మళ్లీ ఈ కేసు తనను ఇబ్బంది పెట్టకుండా కోర్టు నుంచి ఆదేశాలు కూడా తెచ్చుకున్న జార్జి.. తన కొంచెం అటు ఇటుగా మార్చి నిర్మాతగా ఒక సినిమా కూడా తీసి పెద్ద హిట్టు కొడతాడు. తర్వాత తన కూతురికి పెళ్లి చేయడానికి సిద్ధమవుతాడు. కానీ తన పెళ్లి సంబంధాలు వరుసగా చెడిపోతుంటాయి. దీని వెనుక ఒక కుట్ర ఉందని జార్జి గ్రహిస్తాడు. తమ కొడుకును చంపిన జార్జి మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న వరుణ్ తల్లిదండ్రులు.. ఇంకోవైపు తమను వెర్రివాళ్లను చేసిన జార్జిని చట్టం ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న పోలీసులు.. కలిసి ఏం చేశారు.. ఈ కేసుకు సంబంధించి.. అలాగే తన కూతురి పెళ్లి విషయంలో ఎదురవుతున్న సవాళ్లను జార్జి ఎలా ఛేదించాడు.. చివరికి ఈ కేసుకు ఒక ముగింపు లభించిందా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: ప్రేక్షకులను ఉర్రూతలూగించి.. ఆల్ టైం గ్రేట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన చిత్రానికి సీక్వెల్ తీసి మెప్పించడం అంత తేలికైన విషయం కాదు. కానీ ‘దృశ్యం’ లాంటి కల్ట్ థ్రిల్లర్ మూవీకి ఏమాత్రం తగ్గని విధంగా ‘దృశ్యం-2’ను తీర్చిదిద్ది ఔరా అనిపించాడు జీతు జోసెఫ్. ఇప్పుడీ ఫ్రాంఛైజీలో మూడో సినిమా అనగానే ప్రేక్షకుల్లో మరో థ్రిల్ రైడ్ కు రెడీ అయిపోయారు. ఈసారి కథలో అంత థ్రిల్ ఉండదంటూ స్వయంగా దర్శకుడే స్టేట్మెంట్ ఇచ్చినా.. ట్రైలర్ ఏమంత ఆసక్తికరంగా అనిపించకపోయినా.. తెరపై జీతు-మోహన్ లాల్ కలిసి మరోసారి ఏదో మ్యాజిక్ చేసే ఉంటారని ఎంతో నమ్మకంతో థియేటర్లలో అడుగు పెట్టిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు. జార్జి కుట్టి క్యారెక్టర్.. ‘దృశ్యం’ ఫార్మాట్ బాగా అలవాటైపోయి ఉండడం వల్ల కొత్తదనం ఫీలవ్వలేని పరిస్థితి రావడం ‘దృశ్యం-3’కి అతి పెద్ద ప్రతికూలతగా మారింది. జీతు తన మార్కు ట్విస్టులు పెట్టినా.. తొలి రెండు భాగాలంత ప్రభావవంతంగా లేకపోవడం.. ఫ్యామిలీ డ్రామా బాగా బోర్ కొట్టించేయడం.. సుదీర్ఘ నిడివి ‘దృశ్యం-2’ ఇంపాక్టును తగ్గించేశాయి. మామూలుగా చూస్తే ఇది పర్వాలేదనిపించే థ్రిల్లరే కానీ.. ‘దృశ్యం’ తొలి రెండు భాగాలు నెలకొల్పిన ప్రమాణాలకు మాత్రం పార్ట్-2 చాలా దూరంలో ఆగిపోయింది.
దృశ్యం కానీ.. దృశ్యం-2 కానీ.. ఒక దశ వరకు సాధారణంగా అనిపిస్తాయి. కానీ కథ మలుపు తిరిగే దగ్గర్నుంచి ప్రేక్షకులకు ఊపిరి సలపనివ్వకుండా సాగిపోతాయి. ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఆ రెండు సినిమాల్లోనూ జార్జి కుట్టి పాత్ర పరిణామం చెందే తీరు.. అతడి ప్లానింగ్- కౌంటర్ ఎటాక్ వేరే లెవెల్లో అనిపిస్తాయి. రైటింగ్-టేకింగ్ లో దర్శకుడి బ్రిలియన్స్ ఆశ్చర్యపరుస్తుంది. ఐతే పార్ట్-3లో మాత్రం జీతు జోసెఫ్ రాత-తీత రెండింట్లోనూ తన ముద్రను చూపించలేకపోయాడు. తొలి రెండు భాగాలతో పోలిస్తే ఈసారి జీతు మరీ తాపీగా కథను చెప్పాడు. ఫ్యామిలీ డ్రామా మరీ నత్తనడకన సాగడం.. కథ మలుపు తీసుకోవడానికి చాలా సమయం పట్టడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష తప్పదు. తొలి గంట అయ్యేసరికి ప్రేక్షకులను నీరసం ఆవహిస్తుంది. ఇంటర్వెల్ దగ్గర కథ మలుపు తిరిగే దగ్గర కొంత ఆసక్తి కలిగినా.. అది మరీ థ్రిల్లింగ్ గా ఏమీ ఉండదు. సెకండాఫ్ లో కథనం కొంచెం వేగం పుంజుకుంటుంది. కొన్ని ట్విస్టులూ ఉన్నాయి. ఈ ఫార్మాట్ అంతా తొలి రెండు భాగాల్లో చూసిందే కావడంతో కోరుకున్న కిక్కు రాదు. జీతు ఈసారి ప్రేక్షకుల అంచనాలను దాటి పెద్దగా ఏమీ చేయలేదని చెప్పొచ్చు.
జార్జి కుట్టి ఫ్యామిలీతో ఇంతకుముందులా రిలేట్ కాలేని విధంగా మరీ బోరింగ్ సన్నివేశాలతో సినిమాలో చాలా వరకు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన జీతు.. చివరి అరగంటలో మాత్రం ఒక మోస్తరుగా థ్రిల్ చేశాడు. ఆ అరగంట కోసం సినిమా ఒకసారి ట్రై చేయొచ్చు అనిపిస్తుంది. తమను బోల్తా కొట్టించిన జార్జిని ఇరికించడానికి పోలీసులు చేసే కుట్ర.. దానికి జార్జి కౌంటర్ ఎటాక్ వరకు ఒక మోస్తరుగా పేలాయి. దృశ్యం.. దృశ్యం-2 చిత్రాలకు అతి పెద్ద ఆకర్షణగా నిలిచిన ‘షాక్’ ఫ్యాక్టర్ పార్ట్-2లో మిస్ అయింది. తొలి రెండు భాగాల్లో మాదిరి వావ్ అనుకునేలా.. నోరెళ్లబెట్టి చూసేలా ఇందులో సన్నివేశాలు లేవు. అందుక్కారణం.. దృశ్యం ఫార్ములా బాగా అలవాటైపోయి ఉండడమే. సినిమా అంతా అయ్యేసరికి ఇవే దృశ్యాలు ఎన్నిసార్లు చూస్తాం.. ఇక చాలు బాబోయ్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ‘దృశ్యం’ లవర్స్ అందరూ ఈ కథను కొత్తగా ఏ మలుపు తిప్పారు.. ఎలా ముగించారు అనే ఆసక్తితో ఉంటారు కాబట్టి దీనిపై ఒక లుక్కేయొచ్చు కానీ.. తొలి రెండు భాగాలకు ఇది సమీపంలో కూడా నిలవదు.
నటీనటులు: మోహన్ లాల్ మరోసారి జార్జి కుట్టి పాత్రలో జీవించేశాడు. ఆ పాత్రను ఆయన ఓన్ చేసుకున్న విధానం ఆకట్టుకుంటుంది. జార్జిని మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా మార్చడంలో ఆయన పాత్ర ప్రశంసనీయం. కథకు కీలకమైన సన్నివేశాల్లో తనదైన శైలిలో సటిల్ గా నటిస్తూనే బలమైన ఇంపాక్ట్ వేయడంలో ఆయన మరోసారి సక్సెస్ అయ్యారు. జార్జి భార్య పాత్రలో మీనా అలవాటైన తరహాలో నటించింది. ఆమె పెర్ఫామెన్స్ స్టాండౌట్ అనిపించే సీన్లేమీ ఇందులో లేవు. గత రెండు భాగాల్లో మంచి ఇంపాక్ట్ చూపించిన ఆశా శరత్ కు ఈసారి పెద్దగా అవకాశం దక్కలేదు. సిద్దిఖ్.. మురళీ గోపి బాగా చేశారు. జార్జి కూతుళ్ల పాత్రల్లో అన్సిబా.. ఎస్తేర్ ఇద్దరూ చక్కటిగా నటించారు. ముఖ్యంగా అన్సిబా తన ప్రత్యేకతను చాటుకుంది. మిగతా ఆర్టిస్టులంతా ఓకే.
సాంకేతిక వర్గం: టెక్నికల్ గా ‘దృశ్యం-3’లో మంచి ప్రమాణాలు కనిపిస్తాయి. అనిల్ జాన్సన్ బీజీఎం కొన్ని ముఖ్య సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. సతీశ్ కురుప్ ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులను ఒక మూడ్ లోకి తీసుకెళ్లడానికి విజువల్స్ ఉపయోగపడ్డాయి. సినిమాను పరిమిత బడ్జెట్లో తీసిన విషయం అర్థమవుతుంది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఐతే తెలుగు డబ్బింగ్ మాత్రం బాగా చేయలేదు. డబ్బింగ్ వాసనలు గుప్పుమంటాయి. జీతు జోసెఫ్ ఈసారి రచయితగా.. దర్శకుడిగా తన ప్రమాణాలను అందుకోలేకపోయాడు. దృశ్యం.. దృశ్యం-2 చిత్రాల్లో మైండ్ బ్లోయింగ్ రైటింగ్ తో కట్టిపడేసిన జీతు.. ఈసారి నిరాశపరిచాడు. ముఖ్యంగా ప్రేక్షకుల బుర్రలకు పని పెట్టేలా సాగే తన మార్కు స్క్రీన్ ప్లే ఇందులో మిస్ అయింది. దర్శకుడిగానూ జీతు పనితనానికి యావరేజ్ మార్కులే పడతాయి.
చివరగా: దృశ్యం-3.. సరిపోని సీక్వెల్ కిక్
రేటింగ్-2.25/5