పోయి పోయి మోహన్ లాల్‌ తో పెట్టుకుంటున్నారు

బడ్జెట్లు, భారీతనం, వసూళ్ల సంగతి పక్కన పెడితే.. దేశంలో కంటెంట్ పరంగా అగ్రస్థానంలో నిలిచే ఇండస్ట్రీ ఏది అంటే మలయాళం సినిమానే అని చెప్పాలి.;

Update: 2025-06-23 03:41 GMT

బడ్జెట్లు, భారీతనం, వసూళ్ల సంగతి పక్కన పెడితే.. దేశంలో కంటెంట్ పరంగా అగ్రస్థానంలో నిలిచే ఇండస్ట్రీ ఏది అంటే మలయాళం సినిమానే అని చెప్పాలి. ఓటీటీల విప్లవం తర్వాత దేశమంతా అక్కడి సినిమాలను చూస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలను ఎంచుకుని.. పకడ్బందీగా తెరపై తీసుకొస్తుంటారు మలయాళ ఫిలిం మేకర్స్. బలమైన కంటెంట్‌తో, తక్కువ రోజుల్లో సినిమాలు లాగించేస్తుంటారు. వాటికి ప్రేక్షకుల నుంచి గొప్ప స్పందన లభిస్తుంటుంది.

మలయాళంలో పెద్ద స్టార్ అయినప్పటికీ.. మోహన్ లాల్ తరచుగా ప్రయోగాత్మక కథలు చేస్తుంటారు. వాటిలో అసాధారణ ఫలితాలను అందుకుంటారు. ఇలా ఆయన సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రాల్లో ‘దృశ్యం’ ఒకటి. మలయాళంలో అప్పటి కలెక్షన్ల రికార్డులన్నింటినీ కొట్టేసిన ఈ చిత్రం.. దేశంలోని అన్ని ప్రధాన భాషల్లోనూ ఈ సినిమా రీమేక్ అయి అన్ని చోట్లా ఘనవిజయం సాధించింది. చైనీస్, సింహళీస్ భాషల్లోనూ దీన్ని రీమేక్ చేసి హిట్టు కొట్టడం విశేషం. కరోనా టైంలో నేరుగా ఓటీటీలో రిలీజైన దీని సీక్వెల్ ‘దృశ్యం-2’ సైతం అద్భుత స్పందన తెచ్చుకుంది.

ఇప్పుడు మోహన్ లాల్, జీతు జోసెఫ్ జోడీ ‘దృశ్యం-3’ చేయడానికి రెడీ అయింది. స్క్రిప్టు లాక్ చేశారు. అక్టోబరు నుంచి షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ఇటు లాల్, అటు జీతు ఇద్దరూ వేగంగా సినిమాలు చేసేవాళ్లే. మూణ్నాలుగు నెలల్లో ‘దృశ్యం-3’ని ముగించి వచ్చే వేసవికల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఖాయం. ఈ సినిమా కోసం ఇతర భాషల వాళ్లూ అమితాసక్తితో ఎదురు చూస్తుంటారనడంలో సందేహం లేదు.

అయినా సరే హిందీలో వేరుగా ‘దృశ్యం-3’ తీస్తోంది చిత్ర బృందం. దృశ్యం-1, దృశ్యం-2 చిత్రాల హిందీ రీమేక్‌ల కోసం జీతు జోసెఫ్ కథనే తీసుకున్నారు. కానీ ఈసారి మాత్రం సొంతంగా స్క్రిప్టు చేసుకుంటున్నారు. ఈ సినిమా కూడా అక్టోబరులోనే సెట్స్ మీదికి వెళ్తుందట. వచ్చే దసరాకు రిలీజ్ అంటున్నారు. కానీ ఈలోపే మలయాళ ‘దృశ్యం-3’ రిలీజైపోతుంది. జీతు ఆషామాషీ రైటర్ కాదు. అందులోనూ దృశ్యం ఫ్రాంఛైజీ అంటే ది బెస్ట్ ఇస్తాడు.

మోహన్ లాల్, జీతు కలిసి చేసే ‘దృశ్యం-3’ రిలీజై ప్రేక్షకులను మెప్పించాక.. హిందీ దృశ్యం-3తో ఆకట్టుకోవడం అంత ఈజీ కాదు. మలయాళ దృశ్యం-3 హిందీలో రిలీజ్ కాకపోయినా.. సబ్ టైటిల్స్‌తో అయినా అక్కడి జనం బాగానే చూస్తారనడంలో సందేహం లేదు. అలాంటపుడు దాన్ని మించిన సినిమాతో హిందీ ‘దృశ్యం-3’ టీం మెప్పించడం సవాలుగా మారుతుంది. మరి అజయ్ దేవగణ్-అభిషేక్ పాఠక్ జోడీ అలా మెప్పించగలుగుతుందా అన్నది ప్రశ్న.

Tags:    

Similar News