దెయ్యమా? పాపా?.. ఫహాద్ తెలుగు డెబ్యూ టీజర్ ఎలా ఉందంటే..
మాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్.. ఇప్పుడు నేరుగా తెలుగు హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
మాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్.. ఇప్పుడు నేరుగా తెలుగు హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా టీజర్ తాజాగా విడుదలై ఆసక్తిని పెంచుతోంది. టీజర్ మొదలైన కొద్ది క్షణాల్లోనే ప్రేక్షకులను ఓ వరల్డ్ లోకి తీసుకెళ్లిన దర్శకుడు.. చివరి వరకు ఆ చిన్నారి నిజంగా దెయ్యమా? లేక మరేదైనా రహస్యమా? అనే మిస్టరీ కొనసాగించడం విశేషం.
టీజర్ లో ఫహాద్ ఫాజిల్ ఓ మెజీషియన్ రోల్ లో కనిపించారు. మ్యాజిక్ ట్రిక్స్ తో చిన్నారిని అలరించే ఆయన.. ఆటలో భాగంగా ఆమెను మాయంచేసే ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడి నుంచే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. సాధారణంగా కనిపించిన ఆ చిన్నారి ఒక్కసారిగా విచిత్రమైన శక్తులను ప్రదర్శించడం మొదలుపెడుతుంది. ఆమె ప్రవర్తనతో మెజీషియన్ నే భయపెట్టే పరిస్థితులు ఏర్పడతాయి. చివరికి ఆమె నుంచి తప్పించుకోవడానికి ఫహాద్ పరుగులు తీయడం టీజర్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చింది.
అయితే టీజర్ మొత్తం చూసిన తర్వాత కూడా ఆ చిన్నారి నిజంగానే దెయ్యమా? లేక ఆమె వెనుక ఇంకేదైనా రహస్యం దాగి ఉందా? అనే విషయాన్ని దర్శకుడు బయటపెట్టలేదు. అదే టీజర్ కు ప్రధాన బలం. కథను పూర్తిగా చెప్పకుండా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా కట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. హారర్, ఫాంటసీ, థ్రిల్లర్, కామెడీ అంశాలను కలగలిపి సినిమాను రూపొందించినట్లు టీజర్ చెప్పకనే చెబుతోంది.
ముఖ్యంగా ఫహాద్ ఫాజిల్ తన నేచురల్ యాక్టింగ్ తో పాత్రలో పూర్తిగా ఒదిగిపోయినట్లు కనిపించారు. భయపడే సందర్భాల్లో ఆయన ఎక్స్ప్రెషన్స్, కామెడీ టైమింగ్ టీజర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారి పాత్రలో నటించిన సారా కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మంచి ఆసక్తిని కలిగించింది. టెక్నికల్ గా కూడా టీజర్ మంచి ముద్ర వేసింది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథలోని మిస్టరీ వాతావరణాన్ని మరింత స్ట్రాంగ్ గా మార్చాయి.
ఫాంటసీ వరల్డ్ ను స్క్రీన్ పై చూపించిన తీరు సినిమాపై అంచనాలను పెంచుతోంది. చివర్లో వచ్చే విజువల్స్ మాత్రం కథలో ఇంకా ఎన్నో సర్ప్రైజ్‌లు ఉన్నాయనే ఫీలింగ్ కలిగిస్తున్నాయి. సినిమాకు శశాంక్ యేలేటి దర్శకత్వం వహించగా, ఆర్కా మీడియా వర్క్స్ తో కలిసి ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడం కూడా సినిమాపై మరింత ఆసక్తిని తీసుకొచ్చింది.
ఫహాద్ ఫాజిల్ తో పాటు సారా, సౌరభ్ సచ్‌దేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ టీజర్ కథను చెప్పకుండా క్యూరియాసిటీని పెంచడంలో సక్సెస్ అయింది. దెయ్యమా? పాపా? అనే ఒక్క ప్రశ్న చుట్టూనే ప్రేక్షకులను థియేటర్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. సెప్టెంబర్ 11న విడుదల కానున్న ఈ చిత్రం ఫహాద్ ఫాజిల్ కు తెలుగు హీరోగా ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.