స్టార్ హీరోతో సెటిల్మెంట్ ను ఖండించిన సంస్థ!
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజీ `డాన్ 3` పై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.;
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజీ `డాన్ 3` పై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ - హీరో రణవీర్ సింగ్ మధ్య ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో సెటిల్మెంట్లు జరిగాయని వస్తోన్న కథనాలు పరిశ్రమలో వేడి పుట్టించాయి. ఈ నేపథ్యంలో నిర్మాత రితేష్ సిధ్వాని, దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌లకు చెందిన నిర్మాణ సంస్థ అధికారికంగా ఈ వార్తలను ఖండిచారు. ఇవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లని కొట్టిపారేసారు. `డాన్` ప్రాంచైజీలో ముందుగా అమితాబ్ బచ్చన్, ఆ తర్వాత షారుఖ్ ఖాన్ డాన్ పాత్రల్లో మెప్పించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆ బాధ్యతను రణవీర్ సింగ్ చేపడుతున్నారు. అయితే ఈ మార్పుపై ఒక వర్గం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రావడంతో పాటు సినిమా బడ్జెట్ , పారితోషికాల విషయంలో నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే రణవీర్ సింగ్‌తో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నారని కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. అయితే ఈ ప్రచారం సినిమా ప్రతిష్టను దెబ్బతీసేలా ఉండటంతో మేకర్స్ క్లారిటీ ఇవ్వక తప్పలేదు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు మాట్లాడుతూ, `సినిమా పనులు పక్కా ప్రణాళికతో సాగుతున్నాయన్నారు. ఎవరితోనూ ఎలాంటి ఆర్థిక సెటిల్మెంట్లు జరగలేదని వివరించారు.
చిత్ర బృందం అంతా రణవీర్ సింగ్‌ను డాన్ గా ఆవిష్కరించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారన్నారు. సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడా వెనకడుగు వేయడం లేదని పేర్కొన్నారు. నిరాధారమైన వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను సరిచూసుకోవాలని హితవు పలికారు. రణవీర్ సింగ్ కూడా ఈ పాత్ర కోసం ఇప్పటికే సిద్ధమవుతున్నారు.
రణవీర్ సింగ్ వంటి ఎనర్జిటిక్ స్టార్‌ను డాన్ పాత్రకు ఎంపిక చేయడం వెనుక దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌కు స్పష్టమైన విజన్ ఉందన్నారు. కొత్త తరం ప్రేక్షకులకు ఈ సిరీస్‌ను మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే షారుఖ్ ఖాన్ అభిమానులు రణవీర్ ను ఆ స్థానంలో ఊహించుకోవడానికి కొంత సమయం తీసు కుంటుండటంతో ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టడం తో సినిమా షూటింగ్ పై పూర్తి దృష్టి పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ - ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కియారా అద్వానీ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, విదేశీ లొకేషన్లు , అత్యాధునిక సాంకేతికతతో సినిమాను గ్లోబల్ స్టాండర్డ్స్‌లో రూపొందించేందుకు ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తోంది. తాజా క్లారిటీతో ఈ ప్రాజెక్టుపై ఉన్న గందరగోళం కొంత వరకు తొలగిపోయింది.