స్టార్ హీరో (X) స్టార్ డైరెక్ట‌ర్: వివాదంలో పెద్ద‌ హీరో ఫింగ‌రింగ్?

అయితే ఈ గొడ‌వను ప‌రిష్క‌రించుకునేందుకు నిర్మాత‌ల గిల్డ్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తోంద‌ని, ప‌రిష్కారం వెతుకుతోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.. కానీ గిల్డ్ దీనికి ప‌రిష్కారాన్ని ఇవ్వ‌లేక‌పోయింది.;

Update: 2026-02-18 00:30 GMT

బాలీవుడ్ ని ఇటీవ‌ల‌ వ‌రుస వివాదాలు అట్టుడికిస్తున్నాయి. ఫ‌ర్హాన్ అక్త‌ర్ రూపొందించ‌నున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `డాన్ 3` నుంచి అనూహ్యంగా ర‌ణ్ వీర్ త‌ప్పుకోగా, నిర్మాత‌ ఫ‌ర్హాన్ 40 కోట్ల ప‌రిహారం అడుగుతున్నాడు. అయితే క‌థ న‌చ్చ‌కుండా స్క్రిప్టు లేకుండా న‌టించ‌మంటే కుద‌ర‌ద‌ని చెప్పే హ‌క్కు ఉంద‌ని ర‌ణ్ వీర్ అంటున్నాడు. మొత్తానికి ఈ గొడ‌వ చినికి చినికి గాలివాన‌గా మారింది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా నువ్వా నేనా? తేల్చుకుందాం! అనేంత‌వ‌ర‌కూ వెళ్లింది.

అయితే ఈ గొడ‌వను ప‌రిష్క‌రించుకునేందుకు నిర్మాత‌ల గిల్డ్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తోంద‌ని, ప‌రిష్కారం వెతుకుతోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.. కానీ గిల్డ్ దీనికి ప‌రిష్కారాన్ని ఇవ్వ‌లేక‌పోయింది. ఇంత‌లోనే ఇప్పుడు ఈ గొడ‌వ‌ను మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ అమీర్ ఖాన్ ప‌రిష్క‌రించేందుకు మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ ఇందులో నిజం ఎంత‌? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది.

ఈ వివాదానికి సంబంధించిన నిజా నిజాలను పరిశీలిస్తే.. 12 ఫిబ్రవరి 2026న అమీర్ ఖాన్ నివాసంలో కరణ్ జోహార్, సాజిద్ నడియాద్వాలా, ఏక్తా కపూర్, ఫర్హాన్ అక్తర్ త‌దిత‌ర అగ్ర‌ నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ భేటీ `డాన్ 3` వివాదాన్ని పరిష్కరించడానికేనని మీడియాలో కథనాలు వచ్చాయి. వీరంతా గిల్డ్ స‌భ్యులు కావ‌డంతో ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని కూడా భావించారు. కానీ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఇంకా దొర‌క‌లేదు.

రణవీర్ సింగ్ చివరి నిమిషంలో సినిమా నుంచి తప్పుకోవడం వల్ల ప్రీ-ప్రొడక్షన్ కోసం ఖర్చు చేసిన రూ.40 కోట్లు నష్టపోయామని, ఆ మొత్తాన్ని రణవీర్ చెల్లించాలని ఫర్హాన్ నిర్మాణ సంస్థ- ఎక్సెల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ డిమాండ్ చేస్తోంది. రణవీర్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు. సినిమాకు సంబంధించి పూర్తిస్థాయి బౌండ్ స్క్రిప్ట్ లేదని, కథలో మార్పులు చేయమన్నా ఫర్హాన్ పట్టించుకోలేదని ఆయన ఆరోపిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభించే విషయంలో ఫర్హాన్ సీరియస్‌గా లేరని, ఆయన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ `డాన్ 3`ని నిర్లక్ష్యం చేశారని రణవీర్ వర్గం అంటోంది. రణవీర్ అడ్వాన్స్ కూడా తీసుకోలేదు కాబట్టి పరిహారం అడిగే హక్కు వారికి లేదని వాదిస్తున్నారు.

రణవీర్ నేరుగా ద‌ర్శ‌క‌నిర్మాత ఫ‌ర్హాన్ పై మరో పెద్ద‌ ఆరోపణ చేశారు. తన మార్కెట్ విలువను తక్కువ చేసి చూపిస్తూ.. తన స్థానంలో హృతిక్ రోషన్ ను తీసుకోవాలని ఫర్హాన్ ప్రయత్నించారని ఆరోపించారు. అయితే ధురంధర్ సూపర్ హిట్ అవ్వడంతో మళ్ళీ తన దగ్గరకు వచ్చారని రణవీర్ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసారు. అయితే హృతిక్ రోషన్ ఈ వార్తలను ఖండించారు. ఈ వివాదం చివ‌రికి చినికి చినికి గాలివాన‌గా మారింది. ఇటీవ‌లి వ‌రుస సీక్వెన్సులు ప‌రిశీలిస్తే, ర‌ణ్ వీర్ - ఫ‌ర్హాన్ మ‌ధ్య విభేధాలు లేదా క‌మ్యూనికేష‌న్ గ్యాప్ ఏర్ప‌డింద‌ని స్ప‌ష్ఠంగా అర్థ‌మ‌వుతోంది.

వివాదాన్ని పరిష్కరించడానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (పిజిఐ) ఏం చేసింద‌నేదానిపై ఇప్ప‌టికీ క్లారిటీ రాలేదు. ఫిబ్రవరి చివరి వారంలో రెండు వర్గాలతో విడిగా సమావేశం కావాలని గిల్డ్ నిర్ణయించిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. గిల్డ్ రెండు వర్గాల వాదనలు విన్న తర్వాత సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి 10 రోజుల సమయం ఇస్తుంది. ఒకవేళ కుదరకపోతే ఈ కేసును సినీటీవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (CINTAA)కు బదిలీ చేస్తుంది. ఇంత‌లో ఈ గొడ‌వ‌ను ప‌రిష్క‌రించేందుకు అమీర్ ఖాన్ ముందుకు వచ్చార‌ని, పెద్ద‌రికం నెరిపార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే ఈ వార్త‌ల్ని అమీర్ ఖాన్ పూర్తిగా ఖండించారు. ఆయన ఈ గొడవతో తనకు ఎటువంటి సంబంధం లేదని ..తను ఎవరికీ మధ్యవర్తిగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. అలాగే గిల్డ్ సమావేశంలో పరిశ్రమ ఇత‌ర‌ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం చర్చించార‌ని కూడా తెలుస్తోంది.

ఎన్ని గొడ‌వ‌లు ఉన్నా `ధురంధర్` విజయంతో ర‌ణ్ వీర్ సింగ్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. మరోవైపు ఫర్హాన్ అక్తర్ కార్పొరేట్ పద్ధతిలో నష్టపరిహారం కోసం పట్టుబడుతున్నారు. దీంతో వివాదం ఇంకా అలానే మిగిలి ఉంది. అమీర్ ఖాన్ వంటి పెద్దలు ఇందులో నేరుగా జోక్యం చేసుకోకపోయినా.. పరిశ్రమ పెద్దలందరూ కలిసి దీనిని సామరస్యంగా ముగించాలని అంద‌రూ కోరుకుంటున్నారు. ఎందుకంటే `డాన్` వంటి పెద్ద ఫ్రాంచైజీకి ఇలాంటి వివాదాలు బ్రాండ్ విలువను తగ్గిస్తాయి. ఈ గొడవలో రణవీర్ సింగ్ తరువాతి సినిమా `ప్రళయ్` షూటింగ్‌ను ఫర్హాన్ అడ్డుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే వీట‌న్నిటినీ ఒక‌దానిని అనుస‌రించి ఒక‌టిగా, కాన్ సీక్వెన్స్ వార్త‌లుగా మ‌నం చూడాల్సి ఉంటుంది.

Tags:    

Similar News