ఈ వారం సినిమాలు.. టిక్కెట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే?

సొంతంగా రిలీజ్ చేసుకుంటున్న ఈ చిన్న సినిమా, తక్కువ టిక్కెట్ ధరలతో ఎక్కువ మందిని ఆకర్షించి, మౌత్ టాక్‌పై ఆధారపడాలని చూస్తోంది.;

Update: 2025-10-16 16:56 GMT

పండగ సీజన్ వచ్చిందంటే థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. ఈ దీపావళికి ఆ సందడిని మరింత పెంచడానికి నాలుగు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’, కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’, ప్రియదర్శి ‘మిత్ర మండలి’ చిత్రాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. అయితే, ఇలా నాలుగైదు సినిమాలు ఒకేసారి వస్తున్నప్పుడు, ఏ సినిమా చూడాలా అని ఆలోచించే ప్రేక్షకుడికి టిక్కెట్ ధరలు కూడా ఒక ముఖ్యమైన అంశంగా మారతాయి.

ఈ నేపథ్యంలో, హైదరాబాద్‌లోని సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో ఈ చిత్రాల టిక్కెట్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే.. ఈ రేసులో బిజినెస్ పరంగా, స్టార్ పవర్ పరంగా ముందున్న ‘తెలుసు కదా’, ‘డ్యూడ్’ చిత్రాలు టిక్కెట్ ధరల విషయంలో ఒకే వ్యూహాన్ని అనుసరించాయి. ఈ రెండు సినిమాలకు సింగిల్ స్క్రీన్‌లో రూ.175, మల్టీప్లెక్స్‌లో రూ.250గా ధరలను నిర్ణయించారు.

'DJ టిల్లు' తర్వాత సిద్ధుకు ఉన్న క్రేజ్, దాదాపు 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ దృష్ట్యా 'తెలుసు కదా'కు ఈ రేటును ఫిక్స్ చేశారు. మరోవైపు, 'లవ్ టుడే'తో సంచలనం సృష్టించిన ప్రదీప్, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్‌తో వస్తుండటంతో 'డ్యూడ్' కూడా అదే ప్రీమియం ధరతో బరిలోకి దిగుతోంది. ఇక యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘K-ర్యాంప్’ విషయానికొస్తే, మేకర్స్ కాస్త తెలివైన వ్యూహాన్ని అనుసరించారు. మల్టీప్లెక్స్‌లో ధరను రూ.250గానే ఉంచినా, సింగిల్ స్క్రీన్‌లలో మాత్రం రూ.150కే టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చారు.

ఇది కిరణ్ అబ్బవరంకు బలంగా ఉన్న B, C సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది సినిమా బిజినెస్ (రూ.6.39 కోట్లు)కు తగ్గట్టుగా, పోటీలో నిలబడటానికి వేసిన స్మార్ట్ స్టెప్. ఈ దీపావళి బరిలో ఆడియన్స్ ఫ్రెండ్లీ ధరలతో వచ్చిన చిత్రం ‘మిత్ర మండలి’. గురువారం విడుదలైన ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్‌లో 150, మల్టీప్లెక్స్‌లో కేవలం రూ.200 మాత్రమే ధరను నిర్ణయించారు. మిగిలిన సినిమాలతో పోలిస్తే, మల్టీప్లెక్స్ రేటు ఏకంగా 50 తక్కువ. ఇది కంటెంట్‌ను నమ్ముకుని, ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించాలనే స్పష్టమైన వ్యూహాన్ని చూపిస్తోంది.

సొంతంగా రిలీజ్ చేసుకుంటున్న ఈ చిన్న సినిమా, తక్కువ టిక్కెట్ ధరలతో ఎక్కువ మందిని ఆకర్షించి, మౌత్ టాక్‌పై ఆధారపడాలని చూస్తోంది. ఈ టిక్కెట్ ధరలను బట్టి, ప్రేక్షకుడు తన బడ్జెట్‌కు, అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకోవడానికి ఒక క్లారిటీ వస్తుంది. స్టార్ పవర్, భారీ ప్రొడక్షన్ ఉన్న సినిమాలకు కాస్త ఎక్కువ వెచ్చించాల్సి ఉండగా, నవ్వులను పంచే కామెడీ ఎంటర్‌టైనర్‌కు ఒక అందుబాటు ధర ఉంది. అయితే, ఏ సినిమా తన టిక్కెట్ ధరకు న్యాయం చేస్తుందో, ఏ సినిమా కంటెంట్‌తో ప్రేక్షకుడి మనసు గెలుస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News