సుడిగాలి సుధీర్ డైరెక్టర్‌పై హీరోయిన్ ఘాటు కామెంట్స్!
జబర్దస్ట్ ప్రోగ్రామ్‌తో పాపులారిటీని సొంతం చేసుకున్న సుధీర్ `సాఫ్ట్‌వేర్ సుధీర్` సినిమాతో హీరోగా మారాడు.;
కొన్ని ప్రాజెక్ట్‌లు అనుకున్న విధంగా ముందుకు సాగవు. దానికి కారణం డైరెక్టర్‌కు, హీరోకు లేదా దర్శకుడికి, నిర్మాతకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వంటి కారణాలతో ఆగిపోతుంటాయి. కొన్ని సినిమాలు అవన్నింటినీ దాటుకుని బయటికి వస్తే మరికొన్ని అక్కడితో ఆగిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితే సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న `గోట్` సినిమాకు ఎదురైంది.
జబర్దస్ట్ ప్రోగ్రామ్‌తో పాపులారిటీని సొంతం చేసుకున్న సుధీర్ `సాఫ్ట్‌వేర్ సుధీర్` సినిమాతో హీరోగా మారాడు. `గాలోడు` సినిమా హిట్ కావడం, ప్రొడ్యూసర్‌కు లాభాలు తెచ్చి పెట్టడంతో సుడిగాలి సుధీర్‌కు హీరోగా మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కెం వేణుగోపాల్ `గోట్` సినిమాకు శ్రీకారం చుట్టారు. సుడిగాలి సుధీర్ హీరో, తమిళ నటి దివ్యభారతి హీరోయిన్.
నరేష్ కుప్పిలి దర్శకుడిగా సినిమా షూటింగ్ మొదలైంది. సాఫీగా సాగుతూ ఎండింగ్‌కు వచ్చే సమయానికి ముందే నిర్మాతలకు దర్శకుడికి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయట. దీంతో దర్శకుడు నరేష్ కుప్పిలి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. ఆ తరువాత నిర్మాతలే సినిమాని పూర్తి చేసి నవంబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్‌ని కూడా తాజాగా మొదలు పెట్టారు.
అయితే ఈ ప్రమోషనల్ కంటెంట్‌పై దర్శకుడు నరేష్ కుప్పిలి సోషల్ మీడియా వేదికగా విమర్శలకు దిగడం, అందులో హీరోయిన్ దివ్యభారతిని `చిలక` అంటూ అవహేళనగా మాట్లాడం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై హీరోయిన్ దివ్యభారతి తాజాగా సోషల్ మీడియా వేదిగా స్పందిస్తూ డైరెక్టర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. సెట్‌లో దర్శకుడు తనతో ఎలా బిహేవ్ చేశాడో ఈ సందర్భంగా వివరిస్తూ దివ్యభారతి ఫైర్ అయింది.
`స్త్రీలని `చిలకా` లేదా మరేదైనా పదంతో పిలవడం అనేది హానికాని జోక్ కాదు. ఇలాంటి వ్యవహారశైలి స్త్రీపై లోతుగా పాతుకుపోయిన ద్వేషాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ డైరెక్టర్ ఇలా ప్రవర్తించడం ఇదే మొదటి సారి కాదు. సెట్‌లో కూడా ఇదే తరహాలో వ్యవహరించాడు. పదే పదే స్త్రీలను అవమానిస్తూ తాను నమ్మిన కళకే ద్రోహం చేశాడు. ఇలాంటి మాటలు వింటూ హీరో మౌనంగా ఉండటం నాకు తీవ్ర నిరాశను కలిగించింది. ఇకపై స్త్రీలని గౌరవించని ప్రదేశాన్ని కానీ, పనిని కానీ తాను ఎంచుకోనని, అలాంటి వాటికి దూరంగా ఉంటానని ఒక మహిళగా, ఒక కళాకారిణిగా ప్రమాణం చేస్తున్నాను` అంటూ హీరోయిన్ దివ్యభారతి సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోప్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై సుడిగాలి సుధీర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.