ట్రెండ్స్‌ వెంటేనా.. కొత్త కథల మాటేమిటి? సినీప‌రిశ్ర‌మ‌పై కామెంట్!

నేటి చిత్ర పరిశ్రమలో కథల ఎంపిక కంటే.. బాక్సాఫీస్ వద్ద హిట్టయిన పాత ఫార్ములాను అనుసరించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నటి అనన్యా పాండే అభిప్రాయపడ్డారు.;

Update: 2026-03-08 15:30 GMT

నేటి చిత్ర పరిశ్రమలో కథల ఎంపిక కంటే.. బాక్సాఫీస్ వద్ద హిట్టయిన పాత ఫార్ములాను అనుసరించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నటి అనన్యా పాండే అభిప్రాయపడ్డారు. కరీనా కపూర్ ఖాన్‌తో జరిగిన ముఖాముఖిలో ఈ బ్యూటీ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ముచ్చ‌టించారు. ముఖ్యంగా బాలీవుడ్ , టాలీవుడ్ వంటి పరిశ్రమలు నేర్చుకోవాల్సిన పాఠాలను చక్కగా విశ్లేషించారు. ఒక సినిమా విజయం సాధిస్తే.. వెంటనే అదే తరహా కథలతో సినిమాలు తీయడం వల్ల సృజనాత్మకత దెబ్బతింటుందని.. ప్రేక్షకులు కూడా ఒకే రకమైన మూస కథల విష‌యంలో విసిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఉన్న కాపీ సంస్కృతిపై అన‌న్య‌ చేసిన సునిశిత విమర్శలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.

అనన్యా పాండే తన సంభాషణలో ఒక ముఖ్యమైన ఉదాహరణను ప్రస్తావించారు. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం `లోకా చాప్టర్ 1: చంద్ర` లాంటి కొత్త పంథా సినిమాల అవసరాన్ని నొక్కి చెప్పారు. కరీనా కపూర్‌తో ఎంతో పరిణతితో అనన్య మాట్లాడిన తీరు పరిశ్రమలో జెన్ Z పాత్రలకే నటీమణులను పరిమితం చేయడాన్ని ప్రశ్నించిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

కేవలం అనన్య మాత్రమే కాదు.. నాటి నుండి నేటి వరకు పలువురు మేటి కథానాయికలు సినిమా జానర్లు మారాలని, వైవిధ్యమైన పాత్రలు రావాలని తపించారు. నాటి తరం నటీమణుల్లో రేవతి, సుహాసిని వంటి వారు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథా బలమున్న సినిమాలను ఎంచుకున్నారు. రేవతి అప్పట్లోనే మహిళా కోణంలో ఉండే విభిన్న కథాంశాలను ప్రోత్సహించగా.. సుహాసిని కూడా సినిమాల్లో అర్థవంతమైన మార్పు రావాలని కోరుకున్నారు. వారు నటించిన చిత్రాలు నేటికీ ఒక పాఠంలా నిలుస్తాయి.

నేటి తరం విషయానికి వస్తే.. లేడీ సూపర్ స్టార్ నయనతార వంటి వారు కొత్త పంథా సినిమాలకు చిరునామాగా నిలిచారు. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల ట్రెండ్‌ను సౌత్ ఇండియాలో బలంగా కొన‌సాగించ‌డంలో న‌య‌న్ పాత్ర కీలకం. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా కథలో వైవిధ్యం ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ న‌టి నిరూపించారు. ఇలాంటి కథానాయికల బాటలో నేటి తరం నటీమణులు కూడా కొత్త జానర్లను, విభిన్న కథాంశాలను అన్వేషించాలని కోరుకోవడం చిత్ర పరిశ్రమకు శుభపరిణామం.

Tags:    

Similar News