రాజమౌళిని ఇచ్చాను.. అది చాలు..
అయితే ఆయన కెరీర్ దశ దిశ మార్చిన సినిమా ఏది? అంటే.. దానికి కె.రాఘవేంద్రరావు స్వయంగా ఆన్సర్ ఇచ్చారు.;
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తన కెరీర్ లో బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లను అందించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి దిగ్గజ స్టార్లతో కలిసి పని చేసిన సీనియర్ ఆయన. ఎందరో నటీనటులు, కథానాయికలను వెండితెరకు పరిచయం చేసారు.
అయితే ఆయన కెరీర్ దశ దిశ మార్చిన సినిమా ఏది? అంటే.. దానికి కె.రాఘవేంద్రరావు స్వయంగా ఆన్సర్ ఇచ్చారు. నేను ఎన్టీఆర్ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని, ఆయనతో తీసిన `అడవి రాముడు` తన కెరీర్ ని మార్చేసిందని ఆయన అన్నారు. ఈ చిత్రం అప్పట్లో వంద రోజులు ఆడింది. ఆ మూవీ షీల్డ్‌ను ఇప్పటికీ ఇంట్లో గుర్తుగా పెట్టుకున్నానని రాఘవేంద్రరావు చెప్పారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో తాను అనేక చిత్రాలు తీశానని కూడా తెలిపారు. అన్నగారు ఎన్టీఆర్ నటన తనకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగించేదని, ఆయనలాంటి నటుడిని తాను ఎపుడూ చూడలేదని కూడా రాఘవేంద్రరావు అన్నారు.
ఇదే సమయంలో కె.రాఘవేంద్రరావు రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తన శిష్యుడైన రాజమౌళి నేడు పాన్ ఇండియా స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందని, పరిశ్రమకు ఒకరిని ఇచ్చాననే సంతృప్తి ఉందని కూడా వ్యాఖ్యానించారు. కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో కథాసుధ అనే వెబ్ సిరీస్ రూపొందింది. ఇది ప్రముఖ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రచార సభలో కె.రాఘవేంద్రరావు పైవిధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.