సినిమాపై ఈ ప్రేమే 82 ఏళ్ల వెటరన్ డైరెక్టర్‌ని బతికిస్తోంది తెలుసా?
లెజెండరీ దర్శకుడు భారతీరాజా(82) అనారోగ్యం గత కొద్ది రోజులుగా అభిమానుల్లో చర్చగా మారింది.;
లెజెండరీ దర్శకుడు భారతీరాజా(82) అనారోగ్యం గత కొద్ది రోజులుగా అభిమానుల్లో చర్చగా మారింది. ఆయనకు 82 సంవత్సరాలు.. వయసు సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు అనారోగ్యం నుండి కోలుకుని తిరిగి యాక్టివ్ అయ్యారు. అయితే ఆయన సజావుగా చికిత్సతో కోలుకుని తిరిగి ఇంటికి రావడం కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో సంతోషాన్ని నింపింది. ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స అనంతరం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా సినిమాపై తనకున్న మక్కువను చాటుకుంటూ.. విశ్రాంతి సమయంలోనే తన శిష్యురాలు రాధికా శరత్‌కుమార్ నటించిన తాయ్ కిజవి చిత్రాన్ని వీక్షించడం విశేషం. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుసుకున్న అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
భారతీరాజా తన సినిమాను చూడటంపై నటి రాధికా శరత్‌కుమార్ సోషల్ మీడియా వేదికగా ఒక అత్యంత భావోద్వేగపూరితమైన వీడియోను నోట్ షేర్ చేసారు. తనను వెండితెరకు పరిచయం చేసిన గురువుగారు ఇన్నేళ్ల తర్వాత కూడా తన నటనను అంతే నిశితంగా గమనించి మెచ్చుకోవడం రాధికను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆసుపత్రి నుంచి వచ్చిన వెంటనే తన సినిమా చూసి ప్రశంసించడం ఒక నటిగా తనకు దక్కిన గొప్ప గౌరవమని, ఇది తనకెంతో ప్రత్యేకమైన క్షణమని రాధిక ఆనందం వ్యక్తం చేసారు.
`తాయ్ కిజవి` సినిమా వీక్షణ సమయంలో భారతీరాజా కేవలం ఒక వీక్షకుడిలా కాకుండా.. ఒక దిగ్గజ దర్శకుడిలా ప్రతి సన్నివేశాన్ని విశ్లేషించడం గమనార్హం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాధికా నటనను చూసి ఆయన ముగ్ధులయ్యారని.. తన నటనలో పదును ఏమాత్రం తగ్గలేదని ప్రశంసించారు. వయసు పెరిగినా.. అనారోగ్యం ఎదురైనా సినిమా విషయంలో ఆయనకు ఉన్న అంకితభావం.. ఉత్సాహం అక్కడున్న వారందరిలో స్ఫూర్తిని నింపింది.
రాధికా - భారతీరాజా మధ్య ఉన్న అనుబంధం దశాబ్దాల కాలం నాటిది. గురు-శిష్యుల బంధానికి అతీతంగా వారిద్దరి మధ్య ఒక అపురూపమైన స్నేహం ఉంది. తన కెరీర్ ప్రారంభం నుండి నేటి వరకు ప్రతి అడుగులోనూ భారతీరాజా ఇచ్చే సలహాలు, సూచనలు తనకు కొండంత అండగా ఉంటాయని రాధికా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గురువు గారు భారతీరాజా కోసం ప్రత్యేక ప్రదర్శనలో చిత్ర యూనిట్ కూడా పాల్గొని ఆశీస్సులు తీసుకోవడం విశేషం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో రాధికా షేర్ చేసిన ఈ అప్‌డేట్ జోరుగా వైరల్ అవుతోంది. భారతీరాజా పూర్తి ఆరోగ్యంతో మళ్లీ సెట్స్ మీదకు రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఒక అగ్ర దర్శకుడి నుండి లభించిన ఈ ప్రశంసలు `తాయ్ కిజవి` చిత్ర యూనిట్‌కు కొండంత బలాన్ని ఇచ్చాయి. సినిమాపై ఉన్న ఆరాధనే మనిషిని ఏ స్థితిలోనైనా ఉత్సాహంగా ఉంచుతుందని భారతీరాజా మరోసారి నిరూపించారు.
దిగ్ధర్శకుడు భారతీరాజా .. శ్రీదేవి, రజనీకాంత్, కమల్ హాసన్ లతో పదహారేళ్ల వయసు చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తమిళం, తెలుగులో రూపొందించారు. రాధిక, విజయశాంతి వంటి ఎందరో గొప్ప నటీమణులను పరిచయం చేసిన భారతీరాజా సినిమాను కేవలం వినోదంగానే కాకుండా ఒక గొప్ప కళాఖండంగా తీర్చిదిద్దిన దృశ్య కావ్యాన్వేషి.