హై అలర్ట్: 'దురంధర్' టీమ్‌పై, ఇండియాపై రగిలిపోతున్న దావూద్ డీ-గ్యాంగ్?

బాలీవుడ్ స్పై థ్రిల్లర్ `దురంధర్` కొంప‌లు ముంచింది! ఈ సినిమా మోస్ట్ వాంటెడ్ అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-కంపెనీ గ్యాంగ్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.

Update: 2026-06-01 15:46 GMT

బాలీవుడ్ స్పై థ్రిల్లర్ `దురంధర్` కొంప‌లు ముంచింది! ఈ సినిమా మోస్ట్ వాంటెడ్ అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-కంపెనీ గ్యాంగ్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. పాకిస్తాన్ నుండి దావూద్ ఇబ్రహీం నడుపుతున్న ఈ గ్యాంగ్ సినిమా సక్సెస్ అయిన వెంటనే ముంబైలోని తమ గ్రౌండ్ నెట్‌వర్క్‌ను యాక్టివేట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రణవీర్ సింగ్ కథానాయకుడిగా రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ బ్లాక్‌బస్టర్ చిత్రంలో.. దావూద్ ఇబ్రహీం పోలికలతో ఉన్న`బడే సాహెబ్` అనే పాత్రను మరణశయ్యపై ఉన్నట్లు చూపించారు. తమ బాస్ ఇంకా బతికే ఉన్నాడని ప్రపంచానికి నిరూపించాలనే ఆరాటంతో డీ-కంపెనీ ఇప్పుడు అత్యంత వేగంగా పావులు కదుపుతోంది.

మొన్న‌టికి మొన్న దిల్లీలో భ‌గ్న‌మైన ఉగ్ర‌కుట్రకు కార‌కులైన డి గ్యాంగ్ స‌భ్యుల‌ను ఆరా తీస్తే ఇందులో ఎన్నో క‌ఠోర‌మైన నిజాలు బ‌య‌ట‌ప‌డిన‌ట్టు జాతీయ మీడియా చానెల్ ఎన్డీటీవీ వెల్ల‌డించింది. భారత్‌లో సరికొత్త ఉగ్ర కుట్రను అమలు చేయడానికి ఈ గ్యాంగ్ ఎదుర్కొన్న మొదటి సవాలు కొత్త సభ్యులను చేర్చుకోవడం. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ బాధ్యతను ముంబై అండర్‌వరల్డ్‌కు చెందిన షకీల్ గ్యాంగ్‌కు అప్పగించగా.. వీరికి ఆయుధాలు అందించడం .. శిక్షణ ఇచ్చే బాధ్యతను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) తీసుకుంది. ఈ దారుణ ఉగ్ర ప్లాన్‌ను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యతను లీగల్ షూటర్ మున్నా జింగాడాకు అప్పగించినట్లు క‌థ‌నాలొస్తున్నాయి. తమను ఎందుకు రిక్రూట్ చేసుకుంటున్నారనే అసలు విషయాన్ని ఈ కొత్త ముఠా సభ్యులకు కూడా డీ-కంపెనీ చెప్పలేదు.

ముంబై వీధుల నుండి అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేసిన ఈ యువకులను.. బాంద్రా గరీబ్ నగర్‌లోని ఒక అక్రమ మసీదుపై జరిగిన బుల్డోజర్ చర్యను సాకుగా చూపిస్తూ... వారిని రెచ్చగొట్టి ఈ కుట్రల్లోకి లాగారు. ఇటీవల ఢిల్లీ పోలీసులు ఒక భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసి.. పాకిస్తాన్ ఐఎస్ఐ - ముంబై అండర్‌వరల్డ్ మధ్య ఉన్న బలమైన లింకును బట్టబయలు చేయడంతో ఈ సంచలన విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఈ విచారణలో డీ-కంపెనీ తదుపరి టార్గెట్ `దురంధర్` చిత్ర బృందం స‌హా భారతదేశంలోని ప‌లువురు ప్రముఖులు లిస్ట్ లో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

అయితే భార‌త నిఘా సంస్థ‌లు, రక్షణ సంస్థల విశ్లేషణల ప్రకారం.. ముంబై అండర్‌వరల్డ్‌లో బలవంతపు వసూళ్ల వ్యాపారంలో డీ-కంపెనీ ప్రాభవం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ క్రమంలో తమ ఉనికిని చాటుకోవడానికి.. కోల్పోయిన ఇమేజ్‌ను మళ్లీ పునరుద్ధరించుకోవడానికి ఐఎస్ఐ సహాయంతో భారతదేశంలో ఒక భారీ దాడికి లేదా ఒక శక్తివంతమైన ప్రముఖుడిని టార్గెట్ చేయడానికి దావూద్ గ్యాంగ్ ప్రణాళికలు రచిస్తోంది. ఇలాంటి తీవ్రవాద క‌లాపాలను డిజైన్ చేసేందుకు, నేరస్థులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్తాన్ పాత్ర ఎప్పుడూ ఒకేలా ఉన్నా భారతీయ నిఘా సంస్థలు సమయానికి కీలక అరెస్టులు చేస్తూ వారి వ్యూహాలన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఇటీవ‌లి కాలంలో ముంబై పోలీస్ విభాగం అత్యంత బ‌లంగా మార‌డంతో డి.కంపెనీ ఆగ‌డాలు కొన‌సాగ‌డం లేదు. ఇప్పుడు ఆరంభంలోనే డి కంపెనీ గ్యాంగ్ ని అరెస్ట్ చేయ‌డంతో భ‌యాన‌క నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఈ విచార‌ణ‌లో ఇంకా ఎలాంటి నిజాలు తెలుస్తాయోననే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Tags:    

Similar News