'ధర్మస్థల' కోసం చంద్రబోస్ ఫ్రీగా పాటలు.. గొప్ప సినిమా అంటూ..
చంద్రబోస్ మాత్రం ‘రంగస్థలం’ తర్వాత ఇంత సంతృప్తిగా పాటలు రాసిన సినిమా ఇదేనని చెప్పారు.
‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక రీసెంట్ గా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సీనియర్ మాస్ దర్శకుడు వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను జై జ్ఞాన ప్రభ తోట తెరకెక్కించగా, మేరుం భాస్కర్ నిర్మించారు. ఇక ఈవెంట్ లో ఎవరెవరు ఎం చెప్పారు అనే వివరాల్లోకి వెళితే..
వినాయక్ తన స్పీచ్‌లో చంద్రబోస్ చెప్పిన ఓ విషయం బయటపెట్టారు. ఈ కథ నచ్చడంతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఐదు పాటలు రాసినట్లు చంద్రబోస్ తనతో చెప్పారని అన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మంచి కథ చేశారని దర్శకుడి గురించి కూడా చంద్రబోస్ చెప్పినట్లు గుర్తు చేశారు. తన తొలి సినిమా ‘ఆది’కి మొదటి పాట రాసింది చంద్రబోసేనని, ఇప్పుడు జ్ఞాన ప్రభ తొలి సినిమాకూ ఆయనే అన్ని పాటలు రాయడం ఆనందంగా ఉందన్నారు.
చంద్రబోస్ మాత్రం ‘రంగస్థలం’ తర్వాత ఇంత సంతృప్తిగా పాటలు రాసిన సినిమా ఇదేనని చెప్పారు. ‘న్యాయం చేయరా దేవుడా’, ‘ధర్మో రక్షతి రక్షితః’, ‘ఆరంభం’, ‘కొడుకో కొడుకో’, ‘కాలం’ అంటూ ఐదు పాటలు ఉన్నాయని తెలిపారు. ప్రతి మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయని, వాటి మధ్య జరిగే సంఘర్షణే కథకు మూలమని చెప్పారు. మహవీర్ ఏలేందర్ ఈ పాటలకు సంగీతం అందించారు.
వితికా షేరు చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో మళ్లీ నటిస్తోంది. నిజంగా జరిగిన ఒక ఘటనను తీసుకుని కథను తయారు చేశారని ఆమె చెప్పింది. మరోవైపు కస్తూరి నెగిటివ్ పాత్రలో కనిపించనుంది. తనకు ఇలాంటి పాత్ర ఇవ్వడం ఊహించలేదని ఆమె అన్నారు. సత్యప్రకాశ్ కూడా కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పాడు. సాయికుమార్‌కు కథలో పవర్‌ఫుల్ పాత్ర ఉందని, ఆ పాత్ర చేయడం తాను ఎంజాయ్ చేశానని చెప్పారు.
రాజీవ్ కనకాల కూడా దర్శకుడి పనిని మెచ్చుకున్నారు. కొత్త దర్శకులు కథ బాగా చెప్పినా తెరకెక్కించే సమయంలో తడబడతారని, జ్ఞాన ప్రభ మాత్రం కథను అనుకున్నట్టే తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. డ్రగ్స్ గురించి ఇప్పుడు జరుగుతున్న విషయాలను ముందే ఊహించి కథలో పెట్టారని చెప్పారు. రాజా రవీంద్ర మాత్రం సినిమా చూడలేదని స్పష్టంగా చెప్పి, కస్తూరి, చంద్రబోస్ మాటలు విన్నాక సినిమా మీద నమ్మకం వచ్చిందన్నారు.
నిర్మాత మేరుం భాస్కర్ షూటింగ్ గురించి మరో విషయం చెప్పారు. ముందుగా అనుకున్న రోజులకు ఒక్క రోజు కూడా పెంచకుండా సినిమా పూర్తి చేశామని అన్నారు. గతంలో పెద్ద సినిమాలకు మేనేజర్‌గా పని చేసిన భాస్కర్‌కు నిర్మాతగా ఇదే మొదటి సినిమా. సెప్టెంబర్ 4న పీవీఆర్, ఐనాక్స్ ద్వారా విడుదల చేస్తున్నట్లు చెప్పారు. దర్శకుడు జై జ్ఞాన ప్రభ కూడా యదార్థ ఘటన నేపథ్యానికి కల్పిత కథను జోడించి, ఒక మంచి మెసేజ్ ఇచ్చేలా సినిమాను రెడీ చేసినట్లు వివరించారు.
నటరాజ్‌కు హీరోగా ఇదే తొలి సినిమా. “కామన్ మ్యాన్ కోసం కామన్ మ్యాన్ కథ” అంటూ సినిమా గురించి చెప్పాడు. ఇక ఉదయం ఆరు గంటలకే నటీనటులు సెట్లో ఉండేవారని దర్శకుడు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరి ఈ సినిమాకి వెంకట హనుమ ఛాయాగ్రహణం, సాయిబాబు తలారి ఎడిటింగ్, నందు మాస్టర్ ఫైట్స్ అందించారు. సెప్టెంబర్ 4 రిలీజ్‌కు ముందు ఈవెంట్‌లో ప్రతి ఒక్కరూ కథలోని సామాజిక అంశం, పాటలు, కొత్త టీమ్ చేసిన పని గురించే ఎక్కువగా మాట్లాడారు.