ఆ కమిషన్ వస్తేనే మా ఇంటి బండి నడిచేది.. సుమంత్ ప్రభాస్

సినిమాల్లోకి రాకముందు తన కుటుంబం పడిన ఆర్థిక కష్టాలను, తన తండ్రి చేసిన పోరాటాన్ని చాలా ఎమోషనల్ గా వివరించాడు.

Update: 2026-08-31 07:31 GMT

సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమా రోమాంచకం. ఇక ప్రమోషన్స్ లో భాగంగా హీరో సుమంత్ ప్రభాస్ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. సినిమాల్లోకి రాకముందు తన కుటుంబం పడిన ఆర్థిక కష్టాలను, తన తండ్రి చేసిన పోరాటాన్ని చాలా ఎమోషనల్ గా వివరించాడు.

తండ్రి పడిన కష్టం వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని ఎంతో వినయంగా చెప్పుకొచ్చాడు. నాన్నగారు ఒకప్పుడు చిన్న చిన్న రియల్ ఎస్టేట్ పనులు చేసేవారని సుమంత్ తెలిపాడు. ఒక యాభై వేలు లేదా లక్ష రూపాయల డీల్ ఏదైనా చేస్తే దానికి కొంత కమిషన్ వచ్చేదని అన్నాడు. కానీ ఆ డబ్బులు అంత సులువుగా చేతికి అందేవని కాదని అసలు వాస్తవాన్ని వివరించాడు.

ఆ చిన్న కమిషన్ రావాలంటే ప్రాపర్టీ కొనేవాళ్లు దొరకాలి, అలాగే అమ్మేవాళ్లు దొరకాలి, దీనికి చాలా సమయం పట్టేదని అప్పటి పరిస్థితులను తెలిపాడు. ఆ రోజుల్లో తమ నాన్నగారికి ఒక చిన్న రియల్ ఎస్టేట్ గ్యాంగ్ ఉండేదని సుమంత్ గుర్తుచేసుకున్నాడు. ఆ గ్యాంగ్ లో అందరికీ కార్లు ఉండేవని, వాళ్ళంతా బాగా డబ్బులు ఉన్నవాళ్ళని చెప్పాడు. కానీ వాళ్లందరితో పోలిస్తే తమ నాన్నగారు ఒక్కరే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా చాలా సాధారణంగా ఉండేవారని అన్నాడు.

మిగతా వాళ్లలాగా పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే స్థోమత తమకు అసలు లేదని స్పష్టం చేశాడు. ఆ డీల్స్ ద్వారా వచ్చే చిన్నపాటి కమిషన్ తోనే తమ కుటుంబం బతికేదని సుమంత్ అన్నాడు. అప్పట్లో తమ ఇంటి పరిస్థితి అలా ఉండేదని చెబుతూ గతాన్ని తలుచుకుని కొద్దిగా భావోద్వేగానికి గురయ్యాడు. తల్లిదండ్రులు ఆనాడు అంతలా కష్టపడ్డారు కాబట్టే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని తన ఎదుగుదలకు కారణం వాళ్లే అని ఎంతో వినయంగా చెప్పుకొచ్చాడు.

​సుమంత్ హీరోగా నటించిన ఈ రోమాంచకం సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుమంత్ కు జోడీగా అనంతిక సనిల్ కుమార్ నటించింది. ప్రేమ, కామెడీ, సస్పెన్స్ లాంటి అంశాలతో ఒక పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వాసుకి వైభవ్ ఇచ్చిన మ్యూజిక్ కు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు.

​ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ లో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఒక క్లీన్ మూవీగా దీన్ని రూపొందించినట్లు ప్రణయ్ వివరణ ఇచ్చారు. సునీల్ నారంగ్ ఈ సినిమాను తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటకలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఎంతో నమ్మకంతో వస్తున్న ఈ సినిమా సుమంత్ కెరీర్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News