మాతృభాష రాకపోవడం గొప్ప కాదు.. అవమానం.. మన స్టార్ హీరోల బాసట!
కేవలం ధనుష్ మాత్రమే కాదు.. దక్షిణాది చిత్రసీమకు చెందిన పలువురు అగ్ర కథానాయకులు కూడా మాతృభాష పై తమకున్న అమితమైన ప్రేమను నిరూపించుకుంటూనే ఉన్నారు.
మాతృభాష అనేది కేవలం ఒకరి భావాలను వ్యక్తపరిచే సంభాషణ సాధనం మాత్రమే కాదు.. అది ఒక జాతి మూలాలను, సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే ఆత్మగౌరవ ప్రతీక. ప్రపంచీకరణ ప్రభావంతో నేడు విదేశీ భాషల మోజు పెరిగిపోతున్న తరుణంలో మన మాతృభాషను విస్మరించడం అంటే మన అస్తిత్వాన్ని మనమే కోల్పోవడమే. ఈ క్రమంలోనే సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపగల సినీ ప్రముఖులు, నటులు మాతృభాష విశిష్టతను గుర్తుచేస్తూ గళం విప్పడం విశేషం.
ఇటీవల తమిళ నటుడు ధనుష్ ఒక పాఠశాల కార్యక్రమంలో పాల్గొని మాతృభాష ప్రాముఖ్యతపై చేసిన వ్యాఖ్యలు ఎంతో ఆలోచింపజేసేలా ఉన్నాయి. మాతృభాష రాకపోవడం అనేది గొప్పగా చెప్పుకునే విషయం కాదు.. అదొక అవమానం! అని ఆయన స్పష్టం చేశారు. తమ చిన్నతనంలో ఇంగ్లీష్ మాట్లాడటానికి ఇబ్బంది పడేవారమని.. కానీ నేటి యువతలో పది మందిలో ఎనిమిది మందికి సొంత భాష సరిగ్గా రాకపోవడం విచారకరమని ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇతర భాషల కంటే ముందే మాతృభాషలో స్పష్టత సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
కేవలం ధనుష్ మాత్రమే కాదు.. దక్షిణాది చిత్రసీమకు చెందిన పలువురు అగ్ర కథానాయకులు కూడా మాతృభాష పై తమకున్న అమితమైన ప్రేమను నిరూపించుకుంటూనే ఉన్నారు. తెలుగు సినీ రంగంలో నటసింహం నందమూరి బాలకృష్ణ పలుమార్లు వేదికలపై తెలుగు భాష గొప్పతనం గురించి గుర్తు చేయడమే గాక.. పూర్తి తెలుగులో మాట్లాడుతూ తన భాషా మమకారాన్ని చాటుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం ఎంతో స్పష్టమైన, సుందరమైన తెలుగు ఉచ్చారణతో ప్రసంగిస్తూ మాతృభాష గొప్పతనాన్ని నిలబెడితే.. జనసేనాని, నటుడు పవన్ కళ్యాణ్ తెలుగు సాహిత్యాన్ని ఉదాహరిస్తూ భాష పరిరక్షణే మన గుర్తింపు అని ఉద్ఘాటిస్తుంటారు. తెలుగు భాష గొప్పతనం గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ పలు సందర్భాలలో వేదికలపై తనదైన శైలిలో గుర్తు చేసారు. మరోవైపు కమల్ హాసన్ తమిళ భాషా సంస్కృతి కోసం, రిషబ్ శెట్టి కన్నడ భాష - మట్టి వాసన కలిగిన కథల ప్రాముఖ్యత కోసం గళమెత్తడం వీరి భాషాభిమానానికి నిదర్శనం.
నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగ- ఉపాధి అవకాశాల కోసం ఆంగ్లం లేదా ఇతర అంతర్జాతీయ భాషలు నేర్చుకోవడం తప్పనిసరి కావచ్చు. కానీ ఇతర భాషలపై ప్రావీణ్యం సంపాదించే క్రమంలో స్వభాషను చిన్నచూపు చూడటం లేదా మర్చిపోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఇతర భాషలు మన జ్ఞానాన్ని పెంచడానికి తోడ్పడితే.. మాతృభాష మన హృదయానికి, భావోద్వేగాలకు దగ్గరగా ఉండి మనల్ని సన్మార్గంలో నడిపించే ఒక సాంస్కృతిక వారసత్వం అని గ్రహించాలి.
భాషా పరిరక్షణ అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా నిత్య జీవితంలో ఇళ్లలో, పిల్లల పెంపకంలో భాగం కావాలి. అగ్ర నటులు ఆలోచనాత్మక పిలుపు యువతలో మార్పుకు పునాది కావాలి. ఇతర భాషలను గౌరవిస్తూనే.. మన మాతృభాషను సగర్వంగా మాట్లాడటంలోనే అసలైన ఆత్మగౌరవం ఉందనే సత్యాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో గ్లోబల్ లాంగ్వేజ్ ఆంగ్లంపై పట్టు తప్పనిసరి అనేది మరువకూడదు.