ఇడ్లీ కష్టాలు.. ట్రోల్స్‌కి హీరో కౌంటర్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'ఇడ్లీ కడాయ్' చిత్రం అక్టోబర్ 1న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.;
తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'ఇడ్లీ కడాయ్' చిత్రం అక్టోబర్ 1న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించిన నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి. తెలుగులో ఈ సినిమాను ఇడ్లీ కొట్టు అనే టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ స్పీడ్ పెంచాడు. ఇప్పటికే సినిమా భారీ ఈవెంట్స్ ను నిర్వహించి ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లారు. ఇటీవల ఒక ఈవెంట్‌లో ధనుష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సినిమా ప్రమోషన్ కోసం ధనుష్ అబద్దాలు చెప్పాడని, అంతటి హీరో అయ్యి ఉండి ఇలాంటి అబద్ధాలు చెప్పడం ఏంటో అంటూ చాలా సీరియస్‌గానే సోషల్ మీడియాలో ట్రోల్స్ జరిగాయి. ఇదే సమయంలో ధనుష్ ట్రోల్స్‌కి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.
ఇడ్లీ కడాయ్ విడుదలకు సిద్ధం
ఇడ్లీ కడాయ్ సినిమా నేపథ్యం కనుక ఇడ్లీ కనుక ప్రమోషన్ ఈవెంట్‌లో ధనుష్ మాట్లాడుతూ... చిన్నప్పుడు ఇడ్లీ కోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. బయట ఇడ్లీ కొనుక్కోవడానికి పనికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది అంటూ ధనుష్ తనకు ఇడ్లీపై ఉన్న అభిమానంను చెప్పుకొచ్చాడు. ధనుష్ ఇడ్లీ గురించి చేసిన వ్యాఖ్యలు, చెప్పిన విషయాలు చర్చనీయాంశం అయ్యాయి. ధనుష్ తండ్రి ఒక దర్శకుడు. ధనుష్ చిన్న వయసులోనే నటన ప్రస్థానం మొదలు పెట్టాడు. తండ్రి మంచి దర్శకుడిగా భారీగానే సంపాదించాడు. అయినా కూడా ఇడ్లీ కోసం కష్టపడ్డట్లు చెప్పడం విడ్డూరంగా ఉందని ధనుష్ ను ఉద్దేశించి చాలామంది కామెంట్స్ చేశారు. చివరకు ధనుష్ ఫ్యాన్స్ సైతం ఆయన మాటలు నమ్మశక్యంగా లేవు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ నుంచి కూడా వస్తున్న విమర్శల నేపథ్యంలో ధనుష్ స్పందించాల్సి వచ్చింది.
హీరో ధనుష్ వ్యాఖ్యలపై ట్రోల్స్
ఇటీవల మరో భారీ ఈవెంట్‌లో ధనుష్ పాల్గొన్నాడు. ధనుష్ మాట్లాడుతూ... తాను చేసిన వ్యాఖ్యలను సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్పాడు. తాను 1983లో పుట్టాను, మా నాన్న 1991లో దర్శకుడు అయ్యాడు. అయినా అప్పటికి మా పరిస్థితి ఆర్థికంగా గొప్పగా ఏమీ లేదు. 1995 వరకు మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ విషయం ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. అంటే నేను పుట్టిన దాదాపు 12 ఏళ్ల వరకు మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు అయ్యాయి. అందుకే నేను ఇడ్లీ కొనేందుకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని మరోసారి చెప్పుకొచ్చాడు. ఇడ్లీ కొడనం కోసం ఎక్కడో ఒక చోట పని చేయాల్సి వచ్చిన మాట వాస్తవం అని మరోసారి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వెంటనే ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. కానీ అప్పట్లో ఆర్థికంగా అంతంత మాత్రమే ఉండేది.
కోలీవుడ్‌లోనే ధనుష్ టాప్ స్టార్
ధనుష్ కెరీర్ ఆరంభం నుంచి వరుసగా సినిమాలు చేస్తూ ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరాడు. ఆయన తండ్రి దర్శకుడిగా, ఆయన సోదరుడు దర్శకుడిగా సినిమాలు చేసినా పెద్దగా ఆర్థికంగా సెటిల్ కాలేదు అనేది కోలీవుడ్ వర్గాల మాట. ధనుష్ ఎప్పుడైతే సినిమాలు చేస్తూ స్టార్‌గా ఎదిగాడో అప్పటి నుంచి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా పోయాయి అనేది ఇండస్ట్రీ వర్గాల వారు అంటూ ఉంటారు. ధనుష్ ప్రస్తుతం నిర్మాతగానూ వరుస సినిమాలు చేస్తున్నాడు. అంతే కాకుండా ధనుష్ నిర్మాణంలో వచ్చిన సినిమాలు ఆర్థికంగా మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. ధనుష్ ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న టాప్ స్టార్ అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ధనుష్ ఇడ్లీలకు కొదువ లేదు, కానీ ఒప్పుడు మాత్రం ఆయనకు ఇడ్లీలు కొనేందుకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్న మాట వాస్తవం అని మరోసారి చెప్పాడు.