దళపతి సినిమా చుట్టూ ఏం జరుగుతోంది?
ముందు నుంచి ఇది భగవంత్ కేసరి రీమేక్ అని ప్రచారం జరిగినా మేకర్స్, డైరెక్టర్ స్పష్టత ఇవ్వలేదు. అంతే కాకుండా ఇది రీమేక్ కాదని నొక్కి చెబుతూ వచ్చారు.;
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న మూవీ `జన నాయగన్`. తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` ఆధారంగా దీన్ని రీమేక్ చేశారు. హీరో విజయ్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ప్రవేశిస్తున్న వేళ ఆయన చేస్తున్న చివరి సినిమా ఇది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. జనవరి 9నే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రిలీజ్‌కు మరో రెండు రోజులే ఉండటంతో సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ముందు నుంచి ఇది భగవంత్ కేసరి రీమేక్ అని ప్రచారం జరిగినా మేకర్స్, డైరెక్టర్ స్పష్టత ఇవ్వలేదు. అంతే కాకుండా ఇది రీమేక్ కాదని నొక్కి చెబుతూ వచ్చారు. ఫైనల్‌గా ట్రైలర్ రిలీజ్ తరువాత ఇది అంతా ఊహించినట్టే `భగవంత్ కేసరి` రీమేక్ అని తేలిపోయింది. ఇక ఈ మూవీ కథలో స్వల్ప మార్పులు మాత్రమే చేసి సమకాలీన రాజకీయాంశాలని జోడించి పొలిటికల్ పంచ్‌లు ఓ రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేశారు. ట్రైలర్‌లో వినిపించిన డైలాగ్‌లని బట్టి ఈ మూవీని విజయ్ రాజకీయాలకు పనికొచ్చే విధంగా రూపొందించారనే క్లారిటీ అందిరిలోనూ ఏర్పడింది.
ఎవరు ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా, తొక్కేస్తామని బెదిరించినా భయపడనని, వెనక్కి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని విజయ్ చెప్పిన డైలాగ్‌లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ షాక్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. పొలిటికల్ డైలాగ్‌ల డోస్ మరీ ఎక్కువ కావడం వల్లే సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ చేయడం లేదని, కావాలనే ఆలస్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జనవరి 9న రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ డిసెంబర్ లోనే సెన్సార్ వారికి పంపించారట. సినిమా చూసిన సెన్సార్ బృందం కొన్ని సంభాషణలని మ్యూట్ చేయాలని, అభ్యంతరకర సన్నివేశాలని తొలగించాలని సూచించారట.
ఆ మేరకు మార్పులు చేసిన మేకర్స్ మళ్లీ సెన్సార్‌కు పంపించిగా వారి నుంచి ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది. ఈ సందర్భంగా అత్యవసర పిటీషన్‌ని దాఖలు చేసింది. ఈ పిటీషన్‌ని మంగళవారం న్యాయమూర్తి విచారించారు. `జన నాయగన్` సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వని అంశంపై కేంద్ర సెన్సార్ బోర్డ్ సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. కొత్త కమిటీ మళ్లీ చూడాల్సి ఉందని, గడువు కావాలని సెన్సార్ బోర్డు తరుపున న్యాయవాదులు తెలిపారు.
విడుదలకు కొన్ని రోజులే గడువు ఉందని, కొత్త కమిటీకి వెళ్లాల్సిన అవసరం లేదని నిర్మాణ సంస్థ తరుపు న్యాయవాదులు వాదించారు. దీనిపై కేంద్ర సెన్సార్ కమిటీ సమాధానం ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చిన న్యాయమూర్తి తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా తమిళగ వెట్రి కళగం డిప్యూటి జనరల్ సెక్రటరీ సీటీ నిర్మల్ కుమార్ సెన్సార్ బోర్డ్ సభ్యులని హెచ్చరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, ఇప్పటికైనా సెన్సార్ బోర్డ్ స్పందించాలని, లేదంటే మా నాయకుడిని సంప్రదించి తదుపరి చర్యలకు పూనుకుంటామని జాతీయ మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది. తాజా వివాదం నేపథ్యంలో అసలు విజయ్ సినిమా చుట్టూ ఏం జరుగుతోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.