దీపిక శ్రీదేవిలా క్లారిటీ ఇస్తుందా.. లేదంటే కౌంటరా?

అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంది. ప్రణయ్ ఏకంగా పది శాతం ప్రాఫిట్ షేర్ అడిగారని చెప్పడం, సినిమా లీకుల గురించి సీరియస్ ఆరోపణలు చేయడంతో ఇండస్ట్రీలో ఈ గొడవ మళ్లీ మొదలైంది.

Update: 2026-08-22 05:08 GMT

'స్పిరిట్' సినిమా నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం, ఆమె ప్లేస్‌లోకి త్రిప్తి డిమ్రి రావడం అందరికీ తెలిసిందే. షూటింగ్ కూడా ఎలాంటి బ్రేక్స్ లేకుండా వేగంగా జరుగుతోంది. దీంతో ఆ పాత కాంట్రవర్సీ ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా లేటెస్ట్ గా బయటపెట్టిన విషయాలతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. దీపిక భారీ రెమ్యునరేషన్ తో పాటు పని గంటలు, లాభాల్లో ఏకంగా పది శాతం వాటా కూడా అడిగారని ప్రణయ్ చెప్పారు.

దానికి తోడు మరో హీరోయిన్ కోసం వెతకడం మొదలుపెట్టాక తమ సినిమా స్టోరీ లీక్ అయిందని కూడా ఆయన బహిరంగంగా ఆరోపించారు. దీనిపై దీపిక ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. గతంలో 8 గంటల షిఫ్ట్ వివాదం బయటకు వచ్చినప్పుడు ఆమె డైరెక్ట్ గా వంగా టీమ్ కు కౌంటర్ ఇవ్వలేదు. కానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చాలామంది మేల్ సూపర్ స్టార్లు కూడా ఎనిమిది గంటలే పని చేస్తారని పరోక్షంగా బదులిచ్చారు.

అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంది. ప్రణయ్ ఏకంగా పది శాతం ప్రాఫిట్ షేర్ అడిగారని చెప్పడం, సినిమా లీకుల గురించి సీరియస్ ఆరోపణలు చేయడంతో ఇండస్ట్రీలో ఈ గొడవ మళ్లీ మొదలైంది. ప్రభాస్ తో దీపిక ఇలా ఒక ప్రాజెక్ట్ నుంచి మధ్యలో బయటకు రావడం ఇదే మొదటిసారి కాదు. 'కల్కి 2898 ఏడీ' సినిమాలో సుమతి పాత్ర చేసిన ఆమె, ఆ సినిమా సీక్వెల్ లో నటించడం లేదని వైజయంతీ మూవీస్ గత ఏడాదే అనౌన్స్ చేసింది. ప్రభాస్ తో చేయాల్సిన రెండు భారీ ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకున్నట్లు అయింది.

కల్కి మేకర్స్ సైలెంట్ అయినా స్పిరిట్ విషయంలో స్వయంగా నిర్మాత బయటకు వచ్చి మాట్లాడటంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారం చూస్తుంటే గతంలో 'బాహుబలి' సమయంలో శ్రీదేవి విషయంలో జరిగిన వివాదం అందరికీ గుర్తుకు వస్తోంది. శివగామి పాత్ర కోసం శ్రీదేవిని అడిగినప్పుడు ఆమె భారీ రెమ్యునరేషన్ తో పాటు మరికొన్ని కండిషన్లు పెట్టారని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పారు.

ఆ తర్వాత కొన్నాళ్లకు శ్రీదేవి వాటిని ఖండిస్తూ తన వెర్షన్ వినిపించారు. రాజమౌళి మాటలు తనను చాలా బాధించాయని ఆమె చెప్పారు. చివరికి రాజమౌళి కూడా శ్రీదేవి లాంటి సీనియర్ నటి గురించి తాను పబ్లిక్ గా మాట్లాడటం తప్పేనని ఒప్పుకున్నారు. శ్రీదేవి మరింత ఘాటుగా కాకుండా కూల్ గానే రాజమౌళిని పొగుడుతూ ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు స్పిరిట్ విషయంలో కూడా కేవలం వంగా టీమ్ వెర్షన్ మాత్రమే బయటకు వస్తోంది. మొదట సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం, ఇప్పుడు నిర్మాత ప్రణయ్ డీటెయిల్ గా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఈ ఇష్యూ పెద్దదైంది.

దీపిక మాత్రం ప్రణయ్ చేసిన కామెంట్స్ కు ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఆమె ఒకవేళ స్పందిస్తే పది శాతం వాటా డిమాండ్, షూటింగ్ టైమింగ్స్ తో పాటు మేకర్స్ చేసిన లీక్ ఆరోపణల మీద ఎలాంటి క్లారిటీ ఇస్తారన్నది కీలకంగా మారింది. ముఖ్యంగా శ్రీదేవిలా కూల్ గా క్లారిటీ ఇస్తారా లేదంటే తన స్టైల్ లో కౌంటర్ ఇస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. దీపికా పదుకొణె దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న స్టార్ హీరోయిన్. తనపై వచ్చే ప్రతి విమర్శకు ఆమె వెంటనే రియాక్ట్ అవ్వకపోవచ్చు కానీ, అవసరమైనప్పుడు మాత్రం కచ్చితంగా తన వాదన వినిపిస్తారు. చూడాలి మరి ఆ క్లారిటి ఎప్పుడు వస్తుందో.

Tags:    

Similar News