దీపికను మళ్లీ డిస్ట్రబ్ చేసిన 8గంటలు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక పదుకొనే పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. ఇది అస్తవ్యస్థమైన వ్యవస్థ అని వేలెత్తి చూపారు.;
బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపిక పదుకొనే కల్కి 2898 ఏడి చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఇప్పటివరకూ అత్యుత్తమమైన పాన్ ఇండియా విజయం ఈ సినిమాతోనే సాధ్యమైంది. అయితే కల్కి 2898 ఏడి సీక్వెల్ నుంచి దీపికను తొలగించడం విస్త్రతంగా చర్చలకు తెర తీసింది. అంతకుముందే సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న `స్పిరిట్` మూవీ నుంచి తొలగించిన తర్వాత ఈ ప్రకటన రావడం పెద్ద డిబేట్ కి కారణమైంది. బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ ప్రాజెక్టుల నుంచి తొలగించడంతో దీపిక వైఖరిపై చాలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక పదుకొనే పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. ఇది అస్తవ్యస్థమైన వ్యవస్థ అని వేలెత్తి చూపారు. ఈ వ్యవస్థలో హీరోలను ఒకలా హీరోయిన్లను మరోలా ట్రీట్ చేస్తుందనే అర్థం వచ్చేలా మాట్లాడారు. అంతేకాదు చాలా మంది హీరోలు రోజూ 8గంటలు పని చేస్తారు కానీ, వారంతంలో అసలు పని చేయరు! అని కూడా విమర్శించారు.
మహిళను కాబట్టి నాపై ఒత్తిడి చేస్తున్నారు. కానీ భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా మంది సూపర్ స్టార్లు, మేల్ స్టార్లు సంవత్సరాలుగా ఎనిమిది గంటలు పని చేస్తున్నారనేది రహస్యం కాదు.. వారు అంతకుమించి ప్రాజెక్టుకు కేటాయించరు.. అయినా ఎప్పుడూ వారిని హెడ్ లైన్స్ లోకి తీసుకురాలేదు!`` అని కూడా అన్నారు.
అయితే ఇక్కడ సమస్య ఇది కాదు. దీపిక పదుకొనే 8గంటలు పని చేయడానికి ఆసక్తిని కనబరచకపోవడం. కానీ దాని గురించి దీపిక అంతగా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడలేదు. ఆరు గంటలే తాను పని చేయగలనని, సిబ్బంది విషయంలోను కొన్ని సౌకర్యాలు డిమాండ్ చేసారని కూడా వాదనలు వినిపించాయి. దాని గురించిన ప్రస్థావన మాత్రం ఎక్కడా వినిపించలేదు.
అయితే ఫలానా నటుడు లేదా సూపర్ స్టార్ పరిమితంగా పని గంటలు పని చేస్తారని మాత్రం దీపిక ఎవరి పేరును ప్రస్థావించలేదు. ``నేను వారి పేర్లు చెప్పి విషయాన్ని పెద్దది చేయలేను. ఇది అందరికీ బహిరంగంగా తెలిసిన విషయమే. వారిలో చాలా మంది సోమవారం నుండి శుక్రవారం వరకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తారు. వారు వారాంతాల్లో పనిచేయరు`` అని దీపిక వ్యాఖ్యానించారు. సూపర్ స్టార్లు ఎనిమిది గంటలు మించి కేటాయించలేరు! అనేదానిని వ్యంగ్యంగా దీపిక కామెంట్ చేసిన విషయం అర్థమవుతోంది.
దీపిక పదుకొనే ప్రస్తుతం అట్లీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. తన ఫేవరెట్ కింగ్ ఖాన్ సినిమాలోను నటిస్తున్నానని దీపిక గర్వంగా చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఖాన్ వద్ద నేర్చుకున్న విషయాలను ఇప్పుడు పని ప్రదేశంలో అమలు చేస్తున్నానని కూడా ప్రకటించింది.