2.O రచయిత జేయ‌మోహ‌న్ నవల ఆధారంగా భారీ చిత్రం?

శంక‌ర్ ద‌ర్శ‌కుడిగా, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన‌ 2.0, విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ నటించిన `భారతీయుడు 2` వంటి భారీ చిత్రాలకు కథా విభాగంలో పని చేసిన జేయమోహన్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.;

Update: 2026-03-23 03:40 GMT

శంక‌ర్ ద‌ర్శ‌కుడిగా, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన‌ 2.0, విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ నటించిన `భారతీయుడు 2` వంటి భారీ చిత్రాలకు కథా విభాగంలో పని చేసిన జేయమోహన్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్‌లో జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి.. తన అద్భుతమైన రచనా నైపుణ్యంతో స్టార్ రైటర్‌గా ఎదిగిన ఆయన ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. జేయమోహన్ రాసిన ప్రఖ్యాత తమిళ నవల `కుమారియిన్ మైందన్` (ది డాటర్ ఆఫ్ కుమారి) త్వరలోనే వెండితెరపై సినిమాగా ఆవిష్కృతం కానుందనే గుసగుసలు పరిశ్రమలో బలంగా వినిపిస్తున్నాయి.

ఈ నవలలోని ప్రధానాంశం చరిత్ర..పురాణాల మేళవింపుతో సాగే ఒక అద్భుతమైన కల్పిత గాథ. అల్లావుద్దీన్ ఖిల్జీ సేనలు మదురై నగరాన్ని ముట్టడించి పాండ్య సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో ఈ కథ మొదలవుతుంది. శత్రువుల దాడిలో ఆలయాల ధ్వంసం... సంపద దోపిడీ జరుగుతుండగా.. మధురై నగర రక్షకురాలిగా భావించే మీనాక్షి అమ్మవారు తన నిలయాన్ని వదిలి కుమారి (కన్యాకుమారి)కి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఇది కేవలం ఒక విగ్రహం.. భౌతిక ప్రయాణం మాత్రమే కాదు.. ఒక గొప్ప సంస్కృతి.. ఆధ్యాత్మిక శక్తి తన మూలాలను కాపాడుకోవడానికి చేసే పోరాటంగా రచయిత చిత్రించారు.

నగరంలోని అల్లకల్లోలం నుండి తప్పించుకోవడానికి మీనాక్షి అమ్మవారు దక్షిణ దిశగా సముద్ర తీరప్రాంతమైన కుమారి వైపు పయనిస్తారు. ఈ రహస్య ప్రయాణంలో ప్రకృతి కూడా ఆమెకు సహకరిస్తుంది. శత్రువుల కంట పడకుండా అడవులు, కొండల గుండా సాగే ఈ ప్రయాణం పాఠకులలో ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. సుచిత్ర చేసిన ఆంగ్ల అనువాదం `ది డాటర్ ఆఫ్ కుమారి` మూల తమిళ రచనలోని గాంభీర్యాన్ని, భావోద్వేగాలను ఏమాత్రం తగ్గకుండా ప్రతిబింబిస్తుంది. ఈ చారిత్రక కల్పనను ఒక పురాణ గాథలా మలచడంలో జేయమోహన్ చూపిన ప్రతిభ అసాధారణమైనది.

జేయమోహన్ తన రచనలో మదురై, కుమారి ప్రాంతాల మధ్య ఉన్న భౌగోళిక వైవిధ్యాన్ని.. అలాగే ఆనాటి సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వివరించారు. దండయాత్రల వల్ల కలిగే విధ్వంసం ఒకవైపు.. దేవతపై ప్రజలకున్న అచంచలమైన విశ్వాసం మరోవైపు ఈ కథలో స్పష్టంగా కనిపిస్తాయి. మన పూర్వీకులు శత్రువుల దాడుల నుండి దేవతా మూర్తులను కాపాడుకోవడానికి ఎంతటి సాహసాలు చేశారో.. వాటి వెనుక ఉన్న గూఢమైన నమ్మకాలు ఏమిటో ఈ నవల సారాంశం మనకు తెలియజేస్తుంది.

ఒక నాగరికత తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేసిన ఈ పోరాటం సినిమాగా వస్తే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. విజువల్ వండర్‌గా తీర్చిదిద్దే అవకాశం ఉన్న ఈ కథకు దర్శకుడు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇదే జరిగితే.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మరో చారిత్రక దృశ్యకావ్యం తోడవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేవ‌త‌ల నేప‌థ్య క‌థ‌తో సినిమా అనగానే కాంతార ఫ్రాంఛైజీ గుర్తుకు వ‌స్తుంది. అదే త‌ర‌హాలో మీనాక్షి అమ్మ‌వారి ప్ర‌యాణంపై న‌వ‌లాధారిత చిత్రం కూడా బాక్సాఫీస్ వ‌ద్ద‌ అసాధార‌ణ మ్యాజిక్ చేసేందుకు ఆస్కారం లేక‌పోలేదు. (నోట్: ప్ర‌స్తుతానికి ఇది గుస‌గుస మాత్ర‌మే. అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా వెలువ‌డ‌లేదు).

Tags:    

Similar News