న‌టితో సౌత్ డైర‌క్ట‌ర్ అనుచిత ప్ర‌వ‌ర్త‌న!

బాలీవుడ్ నటి డైసీ షా తన సినీ ప్రయాణంలో ఎదురైన ఓ చేదు అనుభవం గురించి పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.;

Update: 2026-04-16 14:27 GMT

బాలీవుడ్ నటి డైసీ షా తన సినీ ప్రయాణంలో ఎదురైన ఓ చేదు అనుభవం గురించి పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. సల్మాన్ ఖాన్ నటించిన `జై హో` సినిమాతో హిందీ ప్రేక్షకులకు పరిచయం కావడానికి ముందే ఆమె దక్షిణాది సినిమాల్లో న‌టించింది. అయితే ఒకానొక సందర్భంలో ఓ చిత్ర దర్శకుడు తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడ‌ని, ఆ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఓ మీట్ లో ఆవేదన చెందింది. షూటింగ్ సమయంలో ఒక సన్నివేశాన్ని వివరిస్తున్న నెపంతో సదరు దర్శకుడు తనను అసభ్యకరమైన రీతిలో తాకారని డైసీ షా వెల్లడించింది.

ఆ ఘ‌ట‌న‌ అనుకోకుండా జరిగింది కాదని, కావాలనే తన గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించారంది. ఈ చేదు అనుభవం వల్ల సినిమాలపై ఉన్న ఆస‌క్తి తగ్గిపోయిందని, సెట్స్‌లో ఉండటమే నరకంలా అనిపించిందని గుర్తు చేసుకుంది. ఆ దర్శకుడి ప్రవర్తన డైసీ షా ఎంతగా కుంగిపోయిందంటే? అసలు నటనకే స్వస్తి చెప్పాలని అనుకున్నానంది. `మనం ఎంతో గౌరవించే రంగంలో ఇలాంటి మనుషులు ఉంటారని ఊహించలేదు. ఆ ఒక్క ఘటన నా మనసును ఎంతగానో గాయ ప‌రిచింది. నేను మళ్ళీ మేకప్ వేసుకోవడానికి చాలా కాలం పట్టిందని తెలిపింది.

తన గౌరవాన్ని కాపాడుకోవడం కోసం సినిమాల కంటే ఏదైనా చిన్న పని చేసుకోవడమే మిన్న అని ఆ సమయంలో అనిపించింద‌ని తెలిపింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడటం అంత‌ సులభం కాదంది.కానీ ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని తిరిగి బాలీవుడ్‌లో ప్రయత్నాలు మొదలుపెట్టిన‌ట్లు గుర్తు చేసుకుంది.

ఒక చేదు అనుభవం వల్ల తన కెరీర్ ఆగిపోకూడదని నిర్ణయించుకుని, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చే వరకు పెద్ద పోరాట‌మే చేసానంది. ప్రస్తుతం ఎంతో జాగ్రత్తగా ప్రాజెక్టులను ఎంచుకుంటున్నానని, నటీమణుల భద్రత అనేది అన్నింటికంటే ముఖ్యమని తెలిపింది.

సినిమా పరిశ్రమలో పని ప్రదేశంలో భద్రత గురించి డైసీ షా టోన్ పెచింది. `నటీమణులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇలాంటి ప్రవర్తన కలిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంది. తనలాంటి వారు ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడటం వల్ల కొత్తగా వచ్చే వారికి ఓ హెచ్చరికగా ఉంటుందంది. లైంగిక వేధింపుల‌పై ఇప్ప‌టికే చాలా మంది న‌టీమ‌ణులు మీడియా మందుకొచ్చి మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. కొన్నేళ్ల క్రితం లైంగిక వేధింపుల‌పై ఇండియాలో మీటూ ఉద్య‌మ‌మే న‌డిచిన సంగ‌తి తెలిసిందే. డైసీ షా త‌మిళ్ లో `పోరీ`, `మ‌లై మ‌లై` అనే రెండు సినిమాల్లో న‌టించింది. క‌న్న‌డ‌, మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌ల్లో కూడా కొన్ని సినిమాల్లో న‌టించింది.

Tags:    

Similar News