ప్రేక్షకులను నిందించడం కరెక్టా?
ఇండిపెండెన్స్ డే వీకెండ్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘కూలీ’ సినిమా మంచి ఓపెనింగ్స్ అయితే తెచ్చుకుంది కానీ.. ఆ తర్వాత నిలబడలేకపోయింది.;
ఇండిపెండెన్స్ డే వీకెండ్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘కూలీ’ సినిమా మంచి ఓపెనింగ్స్ అయితే తెచ్చుకుంది కానీ.. ఆ తర్వాత నిలబడలేకపోయింది. అందుక్కారణం సినిమా బాలేకపోవడం. రిలీజ్ ముంగిట ఉన్న హైప్ వల్లే ఆ సినిమాకు చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. లేకుంటే పెద్ద డిజాస్టర్ అయ్యుండేది. కంటెంట్ పరంగా చూస్తే అది డిజాస్టర్ కావాల్సిన సినిమానే. కానీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ మాత్రం ఈ సినిమా సరిగా ఆడకపోవడానికి ప్రేక్షకులు పెట్టుకున్న భారీ అంచనాలే కారణమంటూ వాళ్ల మీదికి నింద నెట్టేశాడు. ఆడియన్స్ ఈ సినిమాలో ఎల్సీయూ కనెక్షన్ ఉందనుకుని వచ్చారట. అలాగే ఇది టైం ట్రావెల్ సినిమా అనుకుని భ్రమపడ్డారట. ఈ రెండు విషయాలనూ తాను ఖండించినప్పటికీ.. అలా ఊహించకుని సినిమాకు రావడం తప్పని, అందుకే నిరాశపడ్డారని విడ్డూరమైన వాదన తీసుకొచ్చాడు లోకేష్ కనకరాజ్.
ఐతే లోకేష్ చివరి చిత్రం ‘లియో’లో ఎల్సీయూ కనెక్షన్ గురించి ప్రేక్షకులు ఎక్కువ ఊహించుకుని వచ్చి నిరాశపడ్డ మాట వాస్తవం. కానీ ‘కూలీ’ విషయంలో అలాంటిదేమీ లేదు. ఇది స్టాండలోన్ మూవీ అని ముందు నుంచి లోకేష్ చెబుతూనే ఉన్నాడు. రిలీజ్ ముంగిట కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. అలాంటపుడు ఎల్సీయూ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎందుకు పెట్టుకుని వస్తారు? ఇక ట్రైలర్ చూస్తే టైం ట్రావెల్ అనుకుని పొరబడ్డా.. లోకేష్ ఖండించడంతో దాని మీదా ఎక్కువ ఆశించలేదు. అసలు సినిమా ఫెయిలవడానికి ఈ రెండు అంశాల్లో పెట్టుకున్న అంచనాలు కారణం అనుకుంటే అంతకంటే విడ్డూరం మరొకటి ఉండదు.
అంచనాల సంగతి పక్కన పెడితే.. ‘కూలీ’ సినిమా బాగుందా అన్నది మౌళికమైన ప్రశ్న? సినిమాలో ఎక్కడైనా ఒక పది నిమిషాలు కుదురుగా కూర్చోబెట్టే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఒక్కటైనా ఉందా? అసలు ‘కూలీ’లో సరైన కథ ఉందా..? ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉందా? ఒక్క క్యారెక్టర్ అయినా బలంగా ఉందా? సన్నివేశాల్లో లాజిక్కులు కనిపించాయా? ఈ ప్రశ్నలకు ముందు లోకేష్ కనకరాజ్ సమాధానం చెప్పాలి. ఊరికే గిరీష్ గంగాధరన్ విజువల్స్, అనిరుధ్ బీజీఎంతో విపరీతమైన బిల్డప్ ఇవ్వడం తప్పితే.. ‘కూలీ’లో స్టాండౌట్‌గా నిలిచే ఒక్క సన్నివేశం కూడా లేదన్నది వాస్తవం. అర్థరహితమైన కథ.. గజిబిజి స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల తల బొప్పి కట్టించిన ఘనత లోకేష్ కనకరాజ్ సొంతం. పేలవమైన సినిమా తీసి.. ప్రేక్షకులు ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం, ఏదో ఊహించుకుని రావడం తప్పని వాళ్లను నిందించడం ఎంత వరకు సమంజసం?