చైనాలో 'ది ఒడిస్సీ' ఎన్ని ఐమ్యాక్స్ థియేటర్లలో విడుదలైంది?
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన దృశ్య కావ్య చిత్రం `ది ఒడిస్సీ` ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన దృశ్య కావ్య చిత్రం 'ది ఒడిస్సీ' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. విమర్శకుల సవాళ్లను దాటుకుని ఈ చిత్రం ఇప్పటికే 1.1 బిలియన్ డాలర్ల (రూ. 9,200 కోట్లకు పైగా) మైలురాయిని అధిగమించింది. నోలన్ సినీ ప్రయాణంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు చైనా మార్కెట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రంగంలోకి దిగింది.
ఈ చిత్రం చైనా వ్యాప్తంగా ఉన్న సుమారు 800 IMAX స్క్రీన్లలో అత్యంత వైభవంగా విడుదలైంది. ఓవరాల్ గా 20వేల స్క్రీన్లలో విడుదలవ్వడం కూడా ఒక రికార్డ్. తాజాగా బీజింగ్‌లోని `చైనా నేషనల్ ఫిల్మ్ మ్యూజియం`లో నిర్వహించిన గ్రాండ్ ప్రిమియర్ వేడుకలో దర్శకుడు నోలన్‌తో పాటు సినిమా తారలు మ్యాట్ డామన్, షార్లిజ్ థెరాన్ పాల్గొన్నారు. చైనాలోనే అతిపెద్ద టికెటింగ్ వేదిక `మావోయాన్`లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ హౌస్‌ఫుల్ బోర్డులతో శుభారంభాన్ని అందుకుంది.
అయితే గత ఐదేళ్లుగా అమెరికా-చైనా మధ్య రాజకీయ, వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం... స్థానిక చిత్రాలను ప్రభుత్వం ప్రోత్సహించడం వల్ల చైనాలో హాలీవుడ్ సినిమాల మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఇటీవల అక్కడి బాక్సాఫీస్ ఆదాయంలో 80 శాతం స్థానిక చిత్రాలే దక్కించుకోగా... గత ఐదేళ్లలో కేవలం 10 హాలీవుడ్ సినిమాలు మాత్రమే అక్కడి టాప్-10 జాబితాలో చోటు సంపాదించగలిగాయి.
ఇటువంటి సవాళ్లు ఎన్ని ఉన్నా చైనీస్ ప్రేక్షకుల్లో క్రిస్టోఫర్ నోలన్ ఒక ప్రత్యేకమైన 'రైట్ బ్రాండ్'గా నిలిచారు. ఆయన మునుపటి చిత్రాలైన ఇన్సెప్షన్ (2010) చైనాలో 68.4 మిలియన్ డాలర్లు (457 మిలియన్ యువాన్లు), ఇంటర్‌స్టెల్లార్ (2014) ఏకంగా 139.2 మిలియన్ డాలర్లు (876 మిలియన్ యువాన్లు), ఓపెన్‌హైమర్ (2023) 61.6 మిలియన్ డాలర్లు (450 మిలియన్ యువాన్లు) వసూలు చేసి అద్భుత విజయాలను నమోదు చేశాయి. అలాగే `ఒడిస్సీ` కథలోని ``ఇంటికి తిరిగి రావడం-కుటుంబాన్ని కలవడం`` అనే ప్రధానాంశం తూర్పు ఆసియా సంస్కృతికి దగ్గరగా ఉండటం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.
ప్రస్తుతం ఆర్థిక మందగమనం వల్ల చైనాలో 2024 - 2025 లలో వేలాది థియేటర్లు మూతపడటంతో అక్కడి థియేటర్ల పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ క్లిష్ట సమయంలో ప్రేక్షకాదరణను మళ్లీ పెంచేందుకు చైనా బాక్సాఫీస్‌కు నోలన్ `ది ఒడిస్సీ` ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. సంక్షోభంలో ఉన్న థియేటర్లకు పూర్వవైభవం తీసుకురావడంలో ఈ విజువల్ వండర్ కీలక పాత్ర పోషిస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.