స్టార్ హీరోని కొంగున కట్టేసుకున్న కథానాయిక!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సమయపాలన, క్రమశిక్షణపై చాలా విమర్శలు ఉన్నాయి. పలువురు దర్శకులు, సహచరులు కూడా అతడి ప్రవర్తనను తీవ్రంగా నిరశించారు.;
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సమయపాలన, క్రమశిక్షణపై చాలా విమర్శలు ఉన్నాయి. పలువురు దర్శకులు, సహచరులు కూడా అతడి ప్రవర్తనను తీవ్రంగా నిరశించారు. ఇండస్ట్రీలో డజను మంది అతడికి వ్యతిరేకంగా పబ్లిగ్గా మాట్లాడారు. కానీ భాయ్ సరసన `మాతృభూమి` చిత్రంలో నటిస్తున్న చిత్రంగద సింగ్ అందుకు భిన్నంగా మాట్లాడటం ఆశ్చర్యపరుస్తోంది. చిత్రాంగద ప్రస్తుతం తన కో-స్టార్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. సల్మాన్ వ్యక్తిత్వం, ఆయన క్రమశిక్షణ గురించి తను చెబుతున్న మాటలు వింటుంటే..ఈ స్టార్ హీరోని తన మాయ మాటలతో కట్టేసుకుందా అనే ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా సల్మాన్ అంటే ఉండే పాత ఇమేజ్‌ను పక్కన పెట్టి.. ఆయన సెట్స్‌లో ఎంత ఒదిగి ఉంటారో.. సామాన్య కార్మికుల విషయంలో ఎంతగా శ్రద్ధ చూపిస్తారో వివరిస్తూ చిత్రంగద కితాబిచ్చారు. ఆయన సమయపాలన గురించి వస్తున్న విమర్శల్లో నిజం లేదని కొట్టిపారేశారు.
నిజానికి సల్మాన్ ఖాన్ అంటే ఇండస్ట్రీలో ఒక రకమైన విమర్శ ఉంది. ఆయన లేట్ నైట్ పార్టీలను ఎంజాయ్ చేస్తారని.. అందుకే ఉదయాన్నే సెట్స్‌కు రావడం సాధ్యం కాదని ఇన్ సైడ్ టాక్. గతంలో దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ సైతం సల్మాన్ సమయపాలన విషయంలో విసిగిపోయానని బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. అలాగే అనురాగ్ కశ్యప్ సోదరుడు అభినవ్ కశ్యప్ కూడా సల్మాన్ క్రమశిక్షణారాహిత్యంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఇలాంటి నెగెటివ్ వార్తల మధ్య చిత్రంగద మాటలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
చిత్రంగద మాటల ప్రకారం.. సల్మాన్ ఖాన్ షూటింగ్ సమయంలో ఎంతో వృత్తి నైపుణ్యంతో వ్యవహరిస్తున్నారట. ముఖ్యంగా లడఖ్ వంటి కఠినమైన వాతావరణంలో.. అత్యంత ఎత్తైన ప్రదేశాలలో షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఎక్కడా అసహనం చూపలేదని పేర్కొంది. పైగా అక్కడ పనిచేసే లైట్‌మెన్, అసిస్టెంట్ డైరెక్టర్ల క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకోవడం అతడి గొప్పతనమని చిత్రాంగద పేర్కొన్నారు. గతంలో సల్మాన్ సరసన నటించిన చాలా మంది హీరోయిన్ల కంటే భిన్నంగా.. చిత్రంగద ఆయనలోని సాఫ్ట్ కార్నర్ గురించి లోతుగా వివరించడం విశేషం.
ప్రస్తుతం `మాతృభూమి`చిత్రం గల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం తన శారీరక దృఢత్వంపై ప్రత్యేక దృష్టి సారించి.. కాలిస్థెనిక్స్ వంటి కఠినమైన కసరత్తులు చేస్తున్నారు. ఒకవైపు అంతర్జాతీయంగా ఈ సినిమాపై వివాదాలు నడుస్తున్నా... మరోవైపు చిత్ర యూనిట్ మధ్య ఉన్న ఈ సాన్నిహిత్యం సినిమా అవుట్‌పుట్‌పై భరోసా ఇస్తోంది. చిత్రంగద ఇచ్చిన ఈ `సర్టిఫికేట్` సల్మాన్ ఇమేజ్‌ను ఒక్కసారిగా మార్చేలా ఉందనడంలో సందేహం లేదు.
చైనా- ఇండియా బార్డర్ లోని గల్వాన్ లోయలో జరిగిన సైనిక బాహాబాహీ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంతకుముందు `ది బ్యాటిల్ ఆఫ్ గల్వాన్` అనే టైటిల్ ని నిర్ణయించినా ఆ తర్వాత దానిని మార్చారు. చైనాతో భారత్ స్నేహం పెరిగిన నేపథ్యంలో సినిమా కారణంగా ఇరువైపులా సత్సంబంధాలు చెడకూడదని విదేశాంగ శాఖ సూచించింది. ప్రభుత్వ ఆదేశానుసారం సల్మాన్ గల్వాన్ లోయ వార్ డ్రామా కథను పూర్తిగా మార్చేసారని, ఇది ఇప్పుడు ప్రేమకథగా మారిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఫలితం ఎలా వస్తుందో వేచి చూడాలి. 40శాతం రీషూటింగుల కారణంగా బడ్జెట్ కూడా అమాంతం పెరిగిందని కథనాలొచ్చాయి. మొత్తానికి సల్మాన్ ఖాన్ - చిత్రాంగద ప్రేమకథను వెండితెరపై అభిమానులు వీక్షించనున్నారు. ప్రస్తుతానికి భాయ్ ని కొంగున కట్టేసుకోవడంలో చిత్రాంగద ప్రయత్నం సఫలమైందని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.