మెగా విక్టరీ మాస్ ఫైర్ మొదలైంది
టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తున్నా, కొన్ని కాంబినేషన్లు సెట్ అవ్వడం చాలా అరుదు.;
టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తున్నా, కొన్ని కాంబినేషన్లు సెట్ అవ్వడం చాలా అరుదు. అలాంటి ఒక రేర్ కాంబినేషన్ ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్ళింది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తున్నారనే అప్డేట్ వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ లో క్యూరియసిటీ ఒక రేంజ్ లో పెరిగింది. ఇక ఇప్పుడు చిత్ర యూనిట్ ఒక చిన్న వీడియో గ్లింప్స్ ను విడుదల చేసింది. ఇందులో ఇద్దరు సీనియర్ స్టార్లను చూసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో జరుగుతోంది. ఇందుకోసం వేసిన ప్రత్యేకమైన సెట్ లో చిరంజీవి, వెంకటేష్ మధ్య వచ్చే ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. తాజాగా వదిలిన వీడియోలో భారీగా మంటలు ఎగిసిపడుతుండగా, ఆ వెలుగులో ఇద్దరు హీరోలు నడుచుకుంటూ రావడం చూడొచ్చు. షాడోలో కనిపించినా వారి ఇంపాక్ట్ గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతుంది. చివర్లో ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని, భుజాల మీద చేతులు వేసి 'థంబ్స్ అప్' చూపించడం వీడియోలో హైలైట్.
ఈ స్పెషల్ సాంగ్ కు "మెగా విక్టరీ మాస్ సాంగ్" అనే పేరు పెట్టారు. దాదాపు 500 మంది డ్యాన్సర్ల మధ్య ఈ పాట షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన బీట్స్ కు ఈ ఇద్దరు స్టార్లు డ్యాన్స్ చేస్తున్నారు. సినిమాలో వెంకటేష్ పాత్ర నిడివి తక్కువే అయినా, ఈ పాట ద్వారా ఆయన పాత్రకు మంచి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
కమర్షియల్ గా మార్కెట్ లో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అలాగే డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరకు సొంతం చేసుకుందని టాక్. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా 2026 జనవరిలో ఈ సినిమా విడుదల కానుంది. అనిల్ రావిపూడి సినిమాల్లో ఉండే కామెడీ, కమర్షియల్ అంశాలతో పాటు, ఈ ఇద్దరు హీరోల కలయిక సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. విడుదలై ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. పాట ఎలా ఉంటుందో చూడాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.