చిరంజీవి అల్లు రామ‌లింగ‌య్య అల్లుడు ఎలా అయ్యాడు?

మెగాస్టార్ చిరంజీవి న‌ట‌నా కెరీర్ ఐదు ద‌శాబ్ధాల క్రితం మొద‌లైంది. మ‌ద్రాసు ఫిలింఇనిస్టిట్యూట్ లో శిక్ష‌ణ త‌ర్వాత న‌టుడిగా అడుగుపెట్టారు చిరు.;

Update: 2025-08-28 04:30 GMT

మెగాస్టార్ చిరంజీవి న‌ట‌నా కెరీర్ ఐదు ద‌శాబ్ధాల క్రితం మొద‌లైంది. మ‌ద్రాసు ఫిలింఇనిస్టిట్యూట్ లో శిక్ష‌ణ త‌ర్వాత న‌టుడిగా అడుగుపెట్టారు చిరు. ఆయ‌న‌ ఇంతింతై అన్న చందంగా టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడిగా ఎదిగిన తీరు అంద‌రికీ తెలుసు. కానీ ఆయ‌న నిర్మాత‌ అల్లు రామ‌లింగ‌య్యకు అల్లుడు ఎలా అయ్యాడు? దానికి ముందు ఎంత మెలోడ్రామా కొన‌సాగింది? అనే విష‌యాలు చాలా కొద్దిమందికే తెలుసు. అస‌లు న‌టుడిగా కెరీర్ ప‌రంగా అంతంత మాత్రంగానే ఉన్న స‌మ‌యంలో చిరంజీవిని అల్లుడిని చేసుకోవాల‌నే ఆలోచ‌న న‌టుడు - నిర్మాత అయిన‌ అల్లు రామ‌లింగ‌య్య‌కు ఎలా వ‌చ్చింది? అంటే ఒక ఆస‌క్తిక‌ర క‌థనం వెబ్ లో అందుబాటులో ఉంది.

ఓసారి చిరంజీవి త‌న స్నేహితుడితో క‌లిసి అల్లు రామ‌లింగ‌య్య ఇంటికి వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఇంట్లో లేరు. రామ‌లింగ‌య్య‌ కుమార్తె సురేఖ ఆ స‌మ‌యంలో ఇంట్లో ఉన్నారు. ఆమె చిరంజీవికి `హ‌లో` చెప్పి `కాఫీ` ఇచ్చారు. ఇది ఒక సాధార‌ణ‌ మీటింగ్ అయినా కానీ చిరంజీవిపై సురేఖ‌కు ఒక అభిప్రాయం ఏర్ప‌డిన సంద‌ర్భ‌మ‌ది. యువ న‌టుడు చిరంజీవిపై ప్ర‌శంసాపూర్వ‌క‌మైన చూపు క‌లిసిన రోజు అది.

70ల‌లో చిరంజీవి పెద్ద స్టార్ కానే కాదు. కానీ స్టార్ డ‌మ్ కోసం ఆయ‌న‌ ఎంత‌గా హార్డ్ వ‌ర్క్ చేసారో అల్లు కుటుంబం ప్ర‌త్య‌క్షంగా చూసింది. అయితే త‌న కుమార్తె సురేఖ ఒక న‌టుడిని పెళ్లాడ‌టం అల్లు రామ‌లింగ‌య్య‌కు ఇష్టం లేదు. ప్రభుత్వ ఉద్యోగి లేదా ఐఏఎస్ అధికారిని సురేఖ పెళ్లాడాల‌ని కోరుకున్నారు. అయితే విధి రాత‌ను ఎవ‌రు మార్చ‌గ‌ల‌రు? చిరంజీవితో ఆ రోజు సంఘ‌ట‌న కీల‌క మ‌లుపు. అది ప్ర‌త్యేక‌మైన‌ది.. మ‌ర‌పురానిది.. చిరుపై అల్లు అభిప్రాయాన్ని మార్చిన అరుదైన ఘ‌ట‌న అది. ఆరోజు అల్లు రామలింగయ్యతో రైలులో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో చిరంజీవికి చాలాసార్లు మద్యం ఇవ్వడానికి ప్రయత్నించారు.. కానీ తాను హనుమంతుడి భక్తుడిని అని చిరంజీవి మర్యాదగా తిరస్కరించారు. అత‌డి క్ర‌మ‌శిక్ష‌ణ వెంట‌నే అల్లూని ఆక‌ర్షించింది. ఇలాంటి గ్లామ‌ర‌స్ ప్ర‌పంచంలో విలాసాల మ‌ధ్య కూడా ఇంత‌టి క్ర‌మ‌శిక్ష‌ణ సాధ్య‌మా? అని భావించారు. ఆ త‌ర్వాత‌ మన వూరి పాండవులు (1978)లో చిరంజీవితో కలిసి పనిచేసినప్పుడు చిరు హార్డ్ వ‌ర్క్ ని అల్లు రామ‌లింగ‌య్య ప్ర‌త్య‌క్షంగా చూసారు. అరుదైన క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన‌ ప్ర‌తిభావంతుడు చిరంజీవి.. కాబట్టి ఆ యువ నటుడికి గొప్ప భవిష్యత్తు ఉంటుందని రామలింగయ్య గ్ర‌హించారు.

కొంతకాలం తర్వాత ఇరువ‌ర్గాల‌కు పరస్పర స్నేహితుడు అయిన‌ నిర్మాత జయకృష్ణ సహాయంతో రెండు కుటుంబాలు పెళ్లి గురించి మాట్లాడుకున్నాయి. చిరంజీవి కెరీర్ అప్ప‌టికి చెప్పుకోద‌గ్గ‌ స్థితిలో లేదు. అయినా కానీ చిరు భ‌విష్య‌త్‌ని గొప్ప‌గా ఊహించుకున్న‌ అల్లు రామ‌లింగ‌య్య చివ‌రికి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు అంగీకరించారు. వివాహం 20 ఫిబ్రవరి 1980న జ‌రిగింది. ఈ పెళ్లి త‌ర్వాత చిరంజీవి ఎదుగుద‌ల గురించి తెలిసిందే. 90ల‌లో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ అసాధార‌ణంగా పెరిగింది. ఆయ‌న ఎప్ప‌టికీ ఎదురేలేని అగ్ర క‌థానాయ‌కుడిగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అసాధార‌ణ అభిమాన బ‌లంతో టాలీవుడ్ లో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇప్పుడు చిరు- సురేఖ దంప‌తుల కుమారుడు రామ్ చ‌ర‌ణ్ పాన్ ఇండియ‌న్ స్టార్ గా అద్భుత‌మైన కెరీర్ ని కొన‌సాగిస్తున్నారు. దివంగ‌త మామ‌గారు అల్లు రామ‌లింగ‌య్య‌పై చిరు కృత‌జ్ఞ‌త‌, గౌర‌వం మ‌ర్యాద ఎప్ప‌టికీ చెర‌గ‌నివి. చిరంజీవి భవిష్య‌త్ ని ముందే ఊహించిన మేధావి అల్లు రామ‌లింగ‌య్య‌. ఆ రోజు ఆ పెళ్లి నిజానికి టాలీవుడ్ ద‌శ దిశ‌ను కూడా మార్చేసిన అసాధార‌ణ నిర్ణ‌యంగా చూడాలి.

Tags:    

Similar News