'మీసాల పిల్ల' ఇచ్చిన కీ హింట్

‘మన శంకర వర ప్రసాద్ గారు’లో చిరు, నయన్ మధ్య బాగానే కెమిస్ట్రీ పండబోతోందని ‘మీసాల పిల్ల’ పాట ప్రోమోలు చూస్తే అర్థమైపోయింది.;

Update: 2025-10-16 11:31 GMT

రీఎంట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటిదాకా చేసినవి ఆరు సినిమాలు. ‘మన శంకర వర ప్రసాద్’ ఏడో సినిమా. ఈ ఏడు చిత్రాల్లో మూడుసార్లు చిరుతో జట్టు కట్టిన కథానాయిక నయనతార. సీనియర్ స్టార్లకు హీరోయిన్లను సెట్ చేయడం కష్టమవుతున్న రోజుల్లో చిరుతో నయన్‌కు బాాగానే జోడీ కుదిరింది. ‘సైరా నరసింహా రెడ్డి’లో చిరు భార్య పాత్రలో కనిపించింది నయన్. ఐతే ‘గాడ్ ఫాదర్’లో మాత్రం ఇద్దరినీ జోడీగా చూపించలేదు. చిరుకు నయన్‌ను చెల్లెలిగా చూపించి పెద్ద షాకిచ్చారు.

ఐతే ఆ సినిమా పెద్దగా జనాల దృష్టిలో లేదు కాబట్టి.. ఈసారి చిరు పక్కన నయన్‌ను జోడీగానే తీసుకున్నాడు అనిల్ రావిపూడి. ‘మన శంకర వర ప్రసాద్ గారు’లో చిరు, నయన్ మధ్య బాగానే కెమిస్ట్రీ పండబోతోందని ‘మీసాల పిల్ల’ పాట ప్రోమోలు చూస్తే అర్థమైపోయింది. ఈ పాట సినిమాలో చిరు, నయన్ పాత్రల గురించి.. కథ గురించి కొంత హింట్ కూడా ఇవ్వడం విశేషం.

‘మన శంకర వరప్రసాద్ గారు’ చిరుకు నయన్ మాజీ భార్య పాత్రలో కనిపించనుండడం విశేషం. ‘మీసాల పిల్ల’ పాట లిరిక్స్ గమనిస్తే ఆ విషయం తెలుస్తుంది. ఈ పాటలో ‘‘నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా.. నీ వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే’’ అని నయన్ అంటే... ‘‘రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా’’ అని చిరు అంటాడు. దానికి బదులుగా.. ‘‘నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా’’ అని నయన్ రెట్టించి అడిగితే.. ‘‘అబ్బా పాతవన్నీ తొడాలా.. నా అంతు ఏదో చూడాలా’’ అని చిరు బదులిస్తాడు.

దీన్ని బట్టి ఇష్టపడి పెళ్లి చేసుకుని విడిపోయిన జంట.. కొన్ని కారణాలతో మళ్లీ కలిసి పని చేయాల్సి రావడం.. తన మాజీ భార్యతో తిరిగి కలవడానికి హీరో ప్రయత్నించడం.. ఈ నేపథ్యంలో కథ నడిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి దీని చుట్టూ అనిల్ ఎలాంటి డ్రామా.. కామెడీ నడిపాడో.. ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూాడాలి.

Tags:    

Similar News